- భర్తే చంపాడంటూ మృతురాలి బంధువుల ఆరోపణ
- నిందితుని ఇంటి ముందు ఆందోళన
గుంతకల్లు : గుంతకల్లు సత్యనారాయణపేటలో నివాసముంటున్న ట్రక్కు డ్రైవర్ నారాయణ భార్య లింగమ్మ(36) అనుమానాస్పదస్థితిలో బుధవారం మరణించినట్లు కసాపురం పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం కుందనకుర్తికి చెందిన లింగమ్మ వివాహం గుంతకల్లుఓని బర్మశాలలో నివాసముంటున్న నారాయణతో కొన్నేళ్ల కిందట అయింది. తమ తాహతుకు తగ్గట్టు కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశామని లింగమ్మ సోదరుడు రాజేశకర్ తెలిపారు. కొన్నాళ్ల పాటు వారి సంసారం సాఫీ గానే సాగింది. వీరికి కొడుకు, కుమార్తె కూడా కలిగారు. ఆ తరువాత తాగుడు, జూదానికి అలవాటుపడిన నారాయణ, తన సోదరుడు శ్రీరాములు, ఆడపడుచులు శకుంతల, రత్నతో కలసి పుట్టింటికి వెళ్లి డబ్బు తేవాలంటూ లింగమ్మను వేధిస్తుండేవారని ఆరోపించారు. దీంతో రెండేళ్ల కిందట అప్పు చేసి అదనంగా మరో రూ.50 వేలు ఇచ్చామన్నారు. రెండు నెలల కిందట ఇంకో రూ.20 వేలు ముట్టజెప్పానని రాజశేఖర్ తెలిపారు. అయినా తమ చెల్లి లింగమ్మను నిత్యం కొడుతుండేవాడని ఆరోపించారు.
పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా..
నారాయణ వేధింపులు తాళలేక కసాపురం పోలీసులను మంగళవారం ఆశ్రయించినట్లు రాజశేఖర్ తెలిపారు. పోలీసులు అతన్ని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారన్నారు. అయితే బుధవారం లింగమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందంటూ తమకు ఫోన్ వచ్చిందని రాజశేఖర్ కన్నీటిపర్యంతమయ్యారు. తన చెల్లిని భర్త నారాయణ, అతని కుటుంబ సభ్యులే కొట్టి చంపారని ఆయన ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే కొట్టి చంపారని ఆయన వాపోయారు. ఆ తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించే క్రమంలో లింగమ్మ నోట్లో పురుగుల మదు పోసారని నాటకాలాడుతున్నట్లు ఆరోపించారు.
బంధువుల ఆందోళన
లింగమ్మను హతమార్చిన ఆమ భర్త నారాయణ, అతని కుటుంబ సభ్యులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ఎవరూ ముందుకు రాలేదు. ఆస్పత్రి ఎదుటే తమ ఆందోళనను కొనసాగించారు. నిందితులను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
వివాహిత అనుమానాస్పద మృతి
Published Wed, Apr 19 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
Advertisement