ఆపరేషన్‌లో నిర్లక్ష్యం వహించిన ఓ వైద్యురాలికి రూ.8 లక్షల నష్టపరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశిచింది.
రంగారెడ్డి జిల్లా కోర్టులు (హైదరాబాద్): ఆపరేషన్‌లో నిర్లక్ష్యం వహించిన ఓ వైద్యురాలికి రూ.8 లక్షల నష్టపరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశిచింది. సనత్‌నగర్‌కు చెందిన శ్యామల కుమార్తె దీపిక(13)కు 2013 సెప్టెంబరు, 10న కడుపునొప్పి రావడంతో స్థానికంగా ఉన్న సెంట్ థెరీసా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యురాలు కె.లలిత దీపికను పరీక్షించి గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని నిర్ధారించి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత దీపికకు కడుపులో నొప్పితో పాటు కామెర్లు రావడంతో ఆమెను సాయివాణి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు.
పరీక్షలు నిర్వహించిన వైద్యులు గాల్ బ్లాడర్ శస్త్రచికిత్సలో నిర్లక్ష్యం వల్లే కడుపునొప్పితో పాటు కామెర్లు వచ్చాయని తెలిపారు. దీంతో మరోసారి దీపికకు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌కు గాను ఆమె తల్లి శ్యామల దాదాపు రూ.2.50 లక్షలను ఖర్చు చేశారు. థెరీసా ఆస్పత్రి డాక్టర్ లలిత సేవలో లోపం ఉందంటూ దీపిక తల్లి శ్యామల జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫోరం అధ్యక్షుడు గోపాలకృష్ణమూర్తి, మహిళా సభ్యురాలు స్రవంతిలు బాధితురాలికి రూ.8 లక్షల పరిహారంతోపాటు, ఖర్చుల కింద రూ.20వేలు చెల్లించాలని తీర్పు చెప్పారు.