మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
పులివెందుల: వేముల మండలం రాచకుంటపల్లెకు చెందిన గంగాదేవి(35) అనే మహిళా రైతు తమ వ్యవసాయ భూమిని ఇతరులు ఆక్రమించుకుంటున్నారని శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రాచకుంటపల్లెకు చెందిన ప్రసాద్, గంగాదేవి దంపతులకు 2.30 ఎకరాల పొలం ఉంది. 40 ఏళ్ల నుంచి ఆ భూమిలో ప్రసాద్ కుటుంబ సభ్యులు సాగు చేసుకొని జీవనం సాగించే వారు. ప్రస్తుతం రూ.4 లక్షల పెట్టుబడితో చామంతి తోటను సాగు చేశారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన పరందామయ్య పాసుపుస్తకంలో ప్రసాద్ భూమి సర్వే నంబరు ఉంది. పరందామయ్య ఆ భూమి తనదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ప్రసాద్‌కు చెందిన భూమి వద్దకు పరందామయ్య అధికారులతో కలిసి వెళ్లి బలవంతంగా బోరు వేయడానికి ప్రయత్నించాడు. అడ్డువచ్చిన ప్రసాద్, అతని భార్య గంగాదేవి, ఇతర కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన గంగాదేవి అక్కడికక్కడే పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను వెంటనే 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.