మద్యం దుకాణాలపై మహిళ కన్నెర్ర
అనంతపురం సెంట్రల్ : జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై మహిళలు కన్నెర్ర చేశారు. జిల్లా కేంద్రంలోని నడిమివంక సమీపంలోని రెండు మద్యం దుకాణాలపై దాడి చేశారు. సీసీ కెమెరాలు, సామగ్రిని ధ్వంసం చేశారు. గత కొద్దిరోజులుగా నడిమివంకలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తొలగించాలని మహిళా సంఘాలు, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, ముస్లిం మైనార్టీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సదరు మద్యం దుకాణాలు ఓ మంత్రి అనుచురుడిది కావడంతో వాటిని తొలగించేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. బుధవారం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ముట్టడించారు. తొలుత జనశక్తినగర్ నుంచి ర్యాలీగా వచ్చారు. అనంతరం మద్యం దుకాణాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
అయితే ఆందోళన చేస్తున్నా మద్యం దుకాణాల్లో వ్యాపారాలు సాగుతుండడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మద్యం షాపులకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వాటర్‌ప్యాకెట్లు నిల్వ ఉంచిన డ్రమ్ములు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మణి, జిల్లా కార్యదర్శి సుహాసిని మాట్లాడుతూ.. ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనురుగా పరిగణిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జనావాసాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి మహిళలు నివసించే పరిస్థితి లేకుండా చేస్తున్నారన్నారు.
మహిళల ఆందోళనలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి చింతకుంట మదు, సంఘం అధ్యక్షులు వీరనారప్ప, ఉపాధ్యక్షులు బాషా తదితరులు మద్దతు పలికారు. అదేవిధంగా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఒకేచోట ఐదు మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మహిళలు రాస్తారోకో చేశారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనకారులపై మద్యం దుకాణం నిర్వాహకులు శ్రీనివాసులు, వలి, నారాయణస్వామిలు తమ అనుచరులతో కలిసి పోలీసుల సమక్షంలోనే రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ నాయకుడు జానప్పతోపాటు పలువురు మహిళలు గాయపడ్డారు. అనంతరం ఆందోళనకారులు పోలీసులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.