అగ్రహారంలో మహిళ హత్య
Published Mon, Jul 25 2016 10:37 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
వేములవాడ రూరల్ : వేములవాడ మండలం అగ్రహారం జోడాంజనేయస్వామి ఆలయం వద్ద ఆదివారం రాత్రి ఓ మహిళ హత్యకుగురైంది. పట్టణ సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన కల్పన(28) తల్లిదండ్రులు ఆమె పదిహేడో ఏటనే మృతిచెందారు. అప్పటి నుంచి ఆమె పెద్దమ్మ వీరబత్తిని గౌరమ్మ కల్పన బాగోకులు చూసింది. అదే గ్రామానికి చెందిన గౌడ శ్రీనివాస్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిపించింది. వీరికి కుమారుడు(10), కూతురు(8) ఉన్నారు. కుటుంబ కలహాలతో ఏడాది క్రితం విడిపోయారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం శ్రీనివాస్ తన ఇద్దరు పిల్లలతో షోలాపూర్ వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం కల్పన సామగ్రితో తనlపెద్దమ్మ ఇంటికి వెళ్లింది. కొన్ని రోజులు అక్కడ ఉంటానని కోరింది. తన ఇంట్లో వేరే వారు అద్దెకు ఉంటున్నారని, వారం రోజుల్లో వారిని ఖాళీ చేయించి, ఆ గదిని ఇస్తానని చెప్పింది. చేసేదేమీ లేక కల్పన వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె సమాచారం ఎవరికీ తెలియలేదు. ఇంతలో ఆగ్రహారం ఆలయ వెనుక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంఘటన స్థలంలో ఉన్న బ్యాగు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని మృతురాలు సిరిసిల్లకు చెందిన కల్పనగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కల్పన పెద్దమ్మ గౌరమ్మ తన కూతురును గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితుడు..?
కల్పన హత్యతో సంబంధం ఉందన్న అనుమానంతో పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నట్లు తెలిసింది. మృతురాలి సెల్‌ఫోన్ ఆధారంగా డాటా హత్య కేసును 24 గంటల్లో ఛేదించడానికి పట్టణ సీఐ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement