నమ్మితే నిలువునా మోసం చేశారు | womer cheated persons | Sakshi
Sakshi News home page

నమ్మితే నిలువునా మోసం చేశారు

Published Sun, Feb 19 2017 10:09 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

నమ్మితే నిలువునా మోసం చేశారు

నమ్మితే నిలువునా మోసం చేశారు

 
  • కోల్డ్‌స్టోరేజి ఎదుట 12రోజులుగా మహిళ పోరాటం
  • పసుపు వ్యాపారం చేస్తూ చనిపోయిన భర్త
  • రుణాలు చెల్లిస్తామని మోసగించిన పెద్దమనుషులు
  • న్యాయం చేయాలంటూ రైతులతో కలిసి మహిళ ఆందోళన 
 
దుగ్గిరాల: పసుపు వ్యాపారం చేస్తున్న భర్త మృతిచెందడంతో ఆయనకు ఉన్న అప్పులు తీర్చేందుకు పెద్దమనుషులను నమ్మి మోసపోయిన మహిళ న్యాయం కోసం పోరాడుతోంది. తన పేరున ఉన్న భూమిని విక్రయించి రుణాలు తీర్చాలని,   కోల్ట్‌స్టోరేజిలో పెట్టిన పసుపు బస్తాలను తీసి రైతులకు  చెల్లించాలని ఎక్కడ అడిగితే అక్కడ సంతకాలు పెట్టిన ఆమె మోసపోయానని తెలుసుకుంది.  కోల్డ్‌ స్టోరేజి యాజమాన్యంతో కలిసి పెద్దలు తమవరకు రావాల్సిన మొత్తం తీసుకుని రైతులకు చెల్లించలేదని ఆలస్యంగా తెలుసుకుని న్యాయం చేయాలంటూ  కోల్‌స్టోరేజి ఎదుట పోరాడుతోంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు...
కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన బొంతు అశోక్‌రెడ్డి పసుపు వ్యాపారం నిర్వహించేవారు. అందులో భాగంగా మధ్యవర్తిగా ఉండి దుగ్గిరాలలోని ఓ కోల్డ్‌స్టోరేజిలో రైతులకు చెందిన సుమారు రూ. ఏడు కోట్ల విలువైన  పసుపును నిల్వ ఉంచారు.  గత ఏడాది అశోక్‌రెడ్డి అనారోగ్యంతో అకస్మికంగా మృతి చెందారు.  విషాదంలో ఉన్న అశోక్‌రెడ్డి భార్య రమాదేవిని పలువురు పెద్దలు కలిసి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి చెప్పగా.. తన భర్త ఎవరికి రుణం ఉండకూడదని చెప్పి తన పేరిట ఉన్న 11 ఎకరాల పొలం కాగితాలు ఇచ్చి, విక్రయించి అందరికి చెల్లించడంతో పాటు స్టోరేజిలో ఉన్న పసుపు రైతులకు అప్పగించాలని కోరింది. ఇదే అదనుగా కొందరు కోల్డ్‌ స్టోరేజి యాజమాన్యంతో కుమ్మక్కై 13500 పసుపు బస్తాలను 1350 బస్తాలుగా చిత్రీకరించి మోసం చేశారు. ఆచారం ప్రకారం గుడిలో నిద్ర చేస్తున్న  మహిళ వద్దకు వెళ్లిన పెద్దలు సమస్య అంతా తీరిపోయిందని, ఒక్క స్టాంప్‌ పేపర్‌ మీద సంతకం చేస్తే చాలని చెప్పడంతో నిజమేనని నమ్మి సంతకం చేసింది. అంతా అయిపోయిందని తన రాత ఇంతవరకే ఉందనుకుని కుమార్తెను చదివించుకుంటూ జీవిస్తోంది. 
కోర్టు నోటీసులతో...
అంతా సజావుగా ఉందనుకునే సమయంలో నెల రోజుల క్రితం కొందరు తమకు అశోక్‌రెడ్డి డబ్బులు ఇవ్వాలంటూ రమాదేవికి కోర్టు నోటీసులు పంపడంతో కంగారుపడ్డ ఆమె ఏం జరిగిందో తెలుసుకుని నివ్వెరపోయింది.   కోల్డ్‌స్టోరేజి యాçజమాన్యం రైతుల పసుపు బస్తాలకు వారిపేరునే బాండ్లను తయారు చేసి గుంటూరులోని ఓ బ్యాంక్‌లో పెట్టి కోట్ల రూపాయలు రుణం తీసుకుంది.  అశోక్‌రెడ్డి మృతి చెందడంతో రైతులకు ఎగ్గొట్టేందుకు స్టోరేజి యాజమన్యం ఆయన భార్య రమాదేవి సంతకం చేసిన స్టాంప్‌ పేపర్‌లో స్టోరేజిలో ఉన్న పసుపును రైతులకు అప్పగించినట్టు రాసుకుని దానినే ఇప్పుడు రైతులకు చూపిస్తూ వారిని మోసగించేందుకు కుట్ర చేస్తున్నారు.     రమాదేవి కోల్డ్‌ స్టోరేజి యాజమాన్యాన్ని ప్రశ్నించగా తమకు సంబంధం లేదని చెప్పింది. దీంతో కోల్డ్‌ స్టోరేజి రికార్డులను పరిశీలిస్తే   వాస్తవాలు బయటకు వస్తాయని, రైతులకు అన్యాయం చేయవద్దని రమాదేవి రైతులతో కలిసి  12రోజులుగా స్టోరేజి వద్ద ఆందోళన చేస్తోంది.   ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకుని స్టోరేజిలో రికార్డులను పరిశీలించాలని కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement