బాబోయ్ చిరుతలు
Published Sun, Aug 7 2016 10:08 PM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM
కామారెడ్డి : చిరుత పులుల సంచారం గ్రామీణులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఏడాది కాలంగా చిరుతలు జిల్లాలోని అటవీ శివారు గ్రామాల వైపు వస్తుండగా వాటిని పట్టుకోడానికి అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఏడాది క్రితం మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో చిరుతలు సంచరిస్తున్న విషయం బహిర్గతమైంది. తరువాత కొంతకాలానికి దోమకొండ, భిక్కనూరు మండలాల పరిధిలోని గ్రామాల శివారు ప్రాంతాల్లో చిరుతలు తిరిగాయి. తాజాగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న మాచారెడ్డి మండలంలో చిరుతలు సంచరిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
వివరాల్లోకి వెళితే...ఏడాది క్రితం మాక్లూర్ మండలం గుత్ప, మాదాపూర్, చిన్నాపూర్, మామిడిపల్లి, మెట్‌పల్లి, గంగరమంద గ్రామాల్లో చిరుతలు సంచరించాయి. వాటి కోసం అటవీ శాఖ గాలింపు చర్యలు చేపట్టింది. తరువాత కొంత కాలానికే దోమకొండ, భిక్కనూరు మండలాల సరిహద్దుల్లోని ముత్యంపేట, దోమకొండ, జంగంపల్లి గ్రామాల శివారులోని పంట చేలల్లో చిరుత తిరిగిన ఆనవాళ్లు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో చిరుతల సంచారం గురించిన చర్చ జరుగుతూనే ఉంది. అయితే వర్షాలు కురిసేదాకా ఎక్కడా చిరుతల సంచారం బయటపడలేదు. ఇటీవల వర్షాలు కురవడం, అడవి పచ్చదనాన్ని సంతరించుకున్న దరిమిలా చిరుత సంచారం కనిపించింది. మాచారెడ్డి మండలంలోని ఇసాయిపేట గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత సంచరించిందన్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలపడంతో అటవీ ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు. కాని చిరుత ఆచూకీ దొరకలేదు. ఇదే మండలంలోని ఎల్లంపేట గ్రామానికి చెందిన గిరిజనులు ఆదివారం ఆవులు, గేదెలను మేత కోసం ఇసాయిపేట అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లగా పశువుల మందపై చిరుత దాడి చేయడంతో అవి భయంతో గ్రామంవైపు పరుగులు తీశాయి. ఒక్కొక్కటిగా పాడుబడిన బావిలో పడిపోయాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని బావిలో పడిన 15 ఆవులు, బర్రెలనుతాళ్ల సాయంతో పైకి తీశారు. కాగా గాయాలపాలైన రెండు ఆవులు మృతి చెందాయి. పశువుల వెంట చిరుతలు పడడంతో కాపరులు భయంతో పరుగులు తీశారు.
అటవీ ప్రాంత గ్రామాల్లో భయం భయం...
ఇసాయిపేట గ్రామం చుట్టూరా అటవీ ప్రాంతం ఉంది. ఇసాయిపేట, అక్కాపూర్, ఎల్లంపేట, అన్నారం, దేవునిపల్లి, పోతారం, సింగరాయపల్లి తదితర గ్రామాల సరిహద్దు అటవీ ప్రాంతం కలిసి ఉండడం, అటవీ ప్రాంతానికి ఆనుకుని ఆయా గ్రామాలకు చెందిన రైతుల వ్యవసాయ భూములు ఉండడంతో రైతులు వ్యవసాయ పనులకు నిత్యం వెళ్తుంటారు. చిరుత తిరుగుతుందన్న భయం ఇప్పుడు ఆయా గ్రామాల ప్రజలను వెన్నాడుతోంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నపుడు చిరుతలు దాడి చేస్తాయన్న భయంతో ఉన్న రైతులు చిరుతల బారి నుంచి తమను కాపాడాలని, ఇందు కోసం అటవీ శాఖ అధికారులు కృషిచేయాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement