
మెరుగైన విద్యాబోధనకు కృషి చేయండి
కలెక్టర్ ముత్యాలరాజు
నెల్లూరు (వేదాయపాళెం) : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మరింత మెరుగైన విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అన్నారు. నగరంలోని కలెక్టర్ బంగ్లాలో శనివారం సాయంత్రం ఆయన విద్య, సాంఘిక సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి ఉత్తీర్ణత ఫలితాల శాతం గణనీయంగా పెరిగేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోని బోధన ఉపాధ్యాయులకు ఒక్కొక్క సబ్జెక్ట్‌కు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు.
సర్వశిక్షా అభియాన్ ఉపాధ్యాయులను ప్రత్యేక బోధకులుగా నియమించి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. 8,9,10 తరగతులకు విద్యార్థులకు వర్క్ బుక్‌లు సిద్ధం చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ఒక ప్రత్యేక అధికారిని నియమించి విద్యా ప్రమాణాలపై వారితో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే నెలలో జరిగే ‘మనబడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ నిధులే కాకుండా దాతల విరాళాలతో పాఠశాలలో తగిన మౌలిక వసతులు మెరుగు పరచాలన్నారు. ‘మనబడి పిలుస్తోంది’ కార్యక్రమంలో చదువుకున్న వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లు అందజేయాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ మధుసూదన్‌రావు, గిరిజనాభివృద్ధి సంస్థ అధికారి గిరిధర్, సర్వశిక్షా అభియాన్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
పది మండలాల్లో పురోగతి సాధించాలి
జిల్లాలో ఆత్మగౌరవం పథకం కింద బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా 220 పంచాయతీలను ప్రకటించాల్సి ఉందని కలెక్టర్ ముత్యాలరాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 716 గ్రామ పంచాయతీలు ఓడీఎఫ్ గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు. పెళ్లకూరు, దుత్తలూరు, మనుబోలు, నెల్లూరు, పొదలకూరు, కోవూరు, విడవలూరు, కొండాపురం, నాయుడుపేట, ఆత్మకూరు మండలాల పురోగతి సాధించాలని కోరారు. ఆత్మగౌరవం పథకం కింద జనవరి నుంచి లబ్ధిదారులకు రూ.31 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం రూ. 25 కోట్లు విడుదలయ్యాయని, రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు. మిగతా రూ.6 కోట్లు వారం రోజులలోపు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందన్నారు.