
హుద్ హుద్ ఇళ్ల నత్తనడక
♦ ఈ ఏడాది చివరికి పూర్తికావడం డౌటే
♦ రూ.52.61కోట్లు మాత్రమే ఖర్చు
♦ జిల్లాలో నిర్మించతలపెట్టినవి 6వేలు
♦ పరిపాలనామోదం ఇచ్చినవి 4996 పూర్తయినవి 941
♦ వివిధ దశల్లో ఉన్నవి 1665
♦ ఇంకా మొదలు పెట్టనవి 2326
హుద్‌హుద్ బాధితులు నేటికీ నిలువు నీడ లేకుండా పరాయి పంచన రోజులు గడుపుతున్నారు. ఈరోజు వచ్చేస్తాయి..రేపొచ్చేస్తాయి అన్న ఆశతో కళ్లల్లోఒత్తులేసేకుని ఎదురుచూస్తున్నారు. కానీ ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాతలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చిన నిధులతో చేపట్టిన ఈ ప్రత్యేక గృహనిర్మాణాన్ని కూడా సర్కార్ పూర్తి చేయలేకపోతోంది.
సాక్షి, విశాఖపట్నం: స్థలాల గుర్తింపు...లబ్ధిదారుల ఎంపికలో జరిగిన జాప్యంతో ఈ ప్రాజెక్టు అమలు హుద్‌హుద్ అనంతరం ఆర్నెళ్లకు కానీ కార్యరూపం దాల్చలేదు. ముంబైకి చెందిన కంపెనీకి తొలుత రూ.560కోట్లతో మూడు జిల్లాల పరిధిలో 10వేల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఒక్క విశాఖలోనే ఆరువేల ఇళ్లు నిర్మించాలని తలపోశారు. తొలిదశలో 3216ఇళ్లు నిర్మాణానికి గతేడాది మేలోనే టెండర్లు ఫైనలైజ్ చేశారు. యలమంచలిమండలం కొత్తూరుతో సహా జీవీఎంసీ పరిధిలోని 12 ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి స్థలాలను గుర్తించారు. అత్యాధునిక ప్యాబ్రికేటెడ్ టెక్నాలజీతో చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం చెప్పిన ప్రకారం మూడు నెలల్లో పూర్తి కావాల్సి ఉంది.
గతేడాది అక్టోబర్-12 నాటికైనా తొలిదశ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేశారు. పనులు ప్రారంభమై 16నెలలు కావస్తున్నా..పూర్తి కాని దుస్థితి. సీఎం డాష్‌బోర్డులో పొందుపరిచిన వివరాల ప్రకారం అనకాపల్లి, భీమిలితో పాటు జీవీఎంసీ పరిధిలో 4210 ఇళ్లు మంజూరు చేయగా..వాటిలో కేవలం 936 ఇళ్లు మాత్రమే పూర్తి చేయ గలిగారు. 1624 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా.. 1586 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభమే కాలేదు.
అర్బన్‌లో రూ.184.39కోట్ల అంచనాతో చేపట్టగా ఇప్పటి వరకు కేవలం రూ.52.61కోట్లుమాత్రమే ఖర్చు చేయగలిగారు. ఇక గ్రామీణ ప్రాంతంలో 786 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా..కేవలం ఐదు ఇళ్లు మాత్రమే పూర్తి చేయగలిగారు. 41 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా..740 ఇళ్లు అసలు ప్రారంభమే కాలేదు. వీటితో పాటు కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ సొంత నిధులతో చేపట్టిన హుద్‌హుద్ ఇళ్లు నిర్మాణం మాత్రం కొలిక్కి వస్తున్నాయి. ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ల నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.