
‘సీఎంఆర్‌ఎఫ్’లో మరో ఐదుగురు అరెస్టు
♦ 112 నకిలీ బిల్లులతో 73 లక్షలు స్వాహా చేసిన అక్రమార్కులు
♦ నిధుల గోల్‌మాల్‌పై కొనసాగుతున్న విచారణ
♦ ఇప్పటివరకు 11,600 దరఖాస్తులను పరిశీలించిన సీఐడీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) అవకతవకల వ్యవహారంలో సీఐడీ మరో ఐదుగురిని అరెస్టు చేసింది. కరీంనగర్‌లోని దత్తసాయి ఫార్మసీకి చెందిన వనంపల్లి రాజేందర్(27), కేపీఆర్ ఆస్పత్రి ఫార్మసీ ఇన్‌చార్జి సింగిరెడ్డి సుభాష్‌రెడ్డి, దేవిశెట్టి ఆస్పత్రిలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న అడికొప్పుల సాగర్, మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రిలో డాక్టర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.మురళీ ప్రసాద్, ఇదే జిల్లా వీణవంక మండలం మామిడిపల్లిలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్న టి.శ్రీనివాస్ వారిలో ఉన్నారు.
వీరంతా మధ్యవర్తిత్వం వహించి నకిలీ బిల్లులతో నిధులు స్వాహా చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఇప్పటివరకు దాదాపు 11,600 దరఖాస్తులను పరిశీలించి... భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. దాదాపు 50 ఆస్పత్రుల పేరుతో 112 నకిలీ బిల్లులు సృష్టించి రూ.73,68,572 స్వాహా చేసినట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ కుంభకోణంతో 120 మందికి సంబంధమున్నట్లు గుర్తించింది. ఇప్పటికే అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఐదుగురు దళారులను కస్టడీలోకి తీసుకుని మరోసారి విచారించాలని భావిస్తోంది.
వాస్తవానికి సీఎం రిలీఫ్ ఫండ్ పక్కదారి పడుతున్నట్లు గతేడాది జనవరిలోనే అధికారులు గుర్తించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. గతేడాది జనవరి 30న సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మంజూరు చేసిన బిల్లులన్నింటిపై విచారణ చేపట్టారు.
కీలక వ్యక్తులకు బిగుస్తున్న ఉచ్చు
నకిలీ వైద్య బిల్లులు సృష్టించడం కోసం బ్రోకర్లు, ఆస్పత్రుల బిల్ డెస్క్ సిబ్బంది, ఆరోగ్య మిత్రలు కుమ్మక్కైనట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. కొన్ని సందర్భాలలో అసలు వైద్యమేదీ చేయించుకోకుండానే నకిలీ బిల్లులు పెట్టి... ఆరోగ్యశ్రీ కింద రీయింబర్స్‌మెంట్‌కు, సీఎంఆర్‌ఎఫ్ కింద సహాయానికి దరఖాస్తులు చేసి నిధులు కాజేశారు. అలాగే ఆస్పత్రుల బిల్లింగ్ సిబ్బంది సహాయంతో నకిలీ బిల్లులు సృష్టించారు. తర్వాత ఆరోగ్య మిత్రల సహాయంతో బ్రోకర్లు రంగంలోకి దిగి దరఖాస్తు చేసి సొమ్ము స్వాహా చేశారు. ఈ తతంగం వెనుక బడా వ్యక్తులు ఉన్నట్లు విచారణలో వెలుగు చూసింది. వారిని పక్కాగా దొరకబుచ్చుకునేందుకు సీఐడీ ప్రయత్నిస్తోంది.