కాల్ మనీ గ్యాంగ్ ... విడిదింట్లోనే వీకెండ్స్!
విజయవాడ సిటీ : నగరానికి చేరువలోని ఓ ప్రజాప్రతినిధి అతిథి గృహాన్ని రాము ముఠా వీకెండ్స్‌కు విడిది కేంద్రంగా వినియోగించుకునేవారు. శని, ఆదివారాల్లో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొనేదని స్థానికుల సమాచారం. మద్యం, మాంసం, మగువ.. ఇలా ఇక్కడికి వచ్చే అతిథులకు ఏది కావాలంటే అది క్షణాల్లో ఏర్పాటు చేసేవారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నత స్థానాల్లోని అధికారులు వారాంతపు విశ్రాంతి కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చే వారి జాబితాలో కొందరు సినీ తారలు కూడా ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం.
అందుకయ్యే ఖర్చంతా యలమంచిలి రాము, వెనిగళ్ల శ్రీకాంత్, ఎలక్ట్రికల్ డీఈ ఎం.సత్యానందం తదితరులు భరించేవారని చెపుతున్నారు. వీరు ఎక్కువగా తమ ఫైనాన్స్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినవారికి ఇక్కడ ఖరీదైన పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. కొందరిని విదేశాలకు కూడా వీరి ఖర్చులతోనే పంపుతుంటారు.
ఖరీదైన పార్టీలే
ఇక్కడ జరిగే పార్టీలన్నీ కూడా ఖరీదైనవేనని పట్టుబడిన ముఠా సభ్యుల సహచరుల సమాచారం. వారాంతంలో రెండు రోజులు జరిగే ఈ పార్టీలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తారని తెలిసింది. విదేశీ మద్యం, ఖరీదైన మాంసాహార వంటకాలు తయారు చేయిస్తారని సమాచారం.
కొన్ని రకాల విదేశీ పక్షులను కూడా ఇక్కడి వంటకాల్లో ఉపయోగిస్తుంటారని చెపుతున్నారు. ఇక రాత్రయితే చాలు ఖరీదైన కార్లలో పలువురు యువతులు, మహిళలు ఇక్కడికి వస్తుంటారని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రధాన నగరాలకు చెందిన మోడల్స్ కూడా ఇక్కడికి వచ్చి వెళుతుంటారని స్థానికుల సమాచారం. నెలలో మూడు నుంచి నాలుగు మార్లు జరిగే ఈ వేడుకలకు కాల్‌మనీ వ్యాపారంలో ఆర్జించిన మొత్తం నుంచే ఖర్చు చేస్తుంటారని తెలిసింది.
వచ్చేది ప్రముఖులే
జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇక్కడ జరిగే పార్టీల్లో పాల్గొంటారని చెపుతున్నారు. అక్కడికి వీరిని రప్పించుకొని సకల సౌకర్యాలు సమకూర్చుతుంటారు. ఆపై వీరి నగదును పెట్టుబడిగా పెట్టించుకొని కాల్‌మనీ వ్యాపారం చేస్తుంటారు. ఆ ముసుగులో సెక్స్ రాకెట్‌లోకి దించిన మహిళలను వీరి వద్దకు పంపుతుంటారని సమాచారం.
పైరవీలకూ వేదిక
ఇక్కడ జరిగే పార్టీల నడుమ పైరవీల పర్వం కూడా సాగుతుందని తెలిసింది. ఉద్యోగాలు, పోస్టింగ్‌లు, కాంటాక్టులు.. ఇలా ప్రభుత్వపరంగా జరగాల్సిన పలు వ్యవహారాలు ఇక్కడి వీకెండ్స్‌లో ఉంటాయి. రాము, శ్రీకాంత్ తదితరులు తాము చేసుకున్న ఒప్పందాలను పార్టీకి వచ్చిన ప్రముఖుల ద్వారా పూర్తి చేయిస్తారు.
ఈ క్రమంలోనే లక్షల రూపాయలు చేతులు మారుతుంటాయని చెపుతున్నారు. ఇప్పుడీ ముఠా పోలీసులకు చిక్కడంతో వీకెండ్ పార్టీల్లో పాల్గొన్న నేతలు, అధికారులు కంగుతిన్నారు. తమ పేర్లు బయటకు రాకుండా చూసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.