హద్దులు మీరుతున్న యువత..!
సంస్కృతి వైపు మొగ్గు
–రకరకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి
–యుక్త వయస్సులో తీవ్ర ప్రభావం
–పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే..
ఆలేరు : కౌమారం దశ బహు విచిత్రమైంది. వయస్సు చేసే అల్లరి, తల్లిదండ్రులను ఎదిరించి పంతం నెరవేర్చుకునేలా చేసేది ఈ దశే. ఇంట్లో లభించే స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ యువత పాశ్చాత్య పోకడల వైపు పయనిస్తూ పెడదోవ పట్టేది ఈ వయస్సులోనే. సెల్‌ఫోన్లలో, కంప్యూటర్లలో ఆశ్లీల కార్యక్రమాలను వీక్షించడం, వీడియో గేమ్‌లు ఆడడం, చాటింగ్ చేయడం, సెల్‌ఫోన్‌లతో గంటల తరబడి మాట్లాడడం, ధూమ, మద్యపానం లాంటి దురలవాట్లకు ఆకర్షితులవుతున్న టీనేజీ యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
చేతి నిండా డబ్బులు..
నేటి తరంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్యాకెట్ మనీ ఇష్టారాజ్యంగా ఇస్తున్నారు. దీంతో వారు జల్సాలకు అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా ఖరీదైన సెల్‌ఫోన్లు, బైక్ లు, ల్యాప్‌ట్యాబ్‌లు కొనిస్తుండడంతో వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
ఆకర్షణకు బందీ..
టీనేజీ యువతీయువకులు ఆకర్షణకు బందీ అవుతున్నారు. ప్రేమో, స్నేహమో తెలియని పరిస్థితి నెలకొంది. స్నేహానికి, ప్రేమకు మధ్య అంతరాన్ని గుర్తించడం లేదు. టీనేజీ భావనలను అధిగమించలేకపోవడం, సినిమాలు, టీవీల ప్రభావం, ఇంటివద్ద సమస్యలు తదితర కారణాలతో ప్రేమలో పడుతున్నారు. ప్రేమే లోకం, జీవితం అన్నట్టుగా మునిగిపోతున్నారు. దీంతో చదువు పెడదారిన పడుతోంది. గతంలో విద్యార్థులు చదువు, కే రీర్‌కు సంబంధించిన విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. కానీ నేఆ పరిస్థితి లేదు. ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి. ప్రేమలో విఫలమైతే ఉన్మాదులుగా మారుతున్నారు. మరికొందరు ఆత్మహాత్యలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ టీనేజీ వయస్సులోనే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్ నుండే..
సిగరేట్, బీరు తాగడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు.. నేటి తరం యువత. ఇంటర్ నుంచే వాటిని అలవాటు చేసుకుంటున్నారు. గుట్కాపై నిషేధం ఉన్నా యువత బానిస కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సిగరెట్ తాగడం విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు.
ఇంటర్నెట్‌తో...
ఇంటర్నెట్ చాలా మందికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే మానసిక జిజ్ఞాస ఉత్సుకతంగా మారుతోంది. హైస్కూల్ వయస్సు మొదలయ్యే ప్రాయంలోనే అధికంగా ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు ఏ మాత్రం అప్రమత్తత లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టే. నెట్‌తో అనుసంధానం కాగానే అప్రయత్నంగానే ప్రత్యక్షమయ్యే అవాంచనీయ ప్రకటనలు, చిత్రాలు మనస్సును కలుషితం చేస్తుంది. 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాతనే ప్రారంభించాల్సిన ఫేస్‌బుక్ ఖాతాను తప్పుడు జనన తేదీలతో ఆరంభిస్తున్నారు. యాప్స్ ద్వారా సునాయసనంగా విషయాలను, చిత్రాలను, దృశ్యాలను పంచుకుంటున్నారు. యూటుబ్‌లో మంచితో పాటు చెడు కూడా ఉంది.
వ్యసనంగా సెల్‌ఫోన్..
నేడు ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్ వ్యసనంగా మారింది. బైక్ నడుపుతూ, రోడ్డు దాటుతూ, రైలు పట్టాలు దాటుతూ సెల్‌ఫోన్‌లో మాట్లడడం సాధారణంగా మారింది. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గంటల తరబడి మాట్లడడం వల్ల సమయం వృధా అవుతుంది. ఇటీవల కాలంలో సెల్ఫీలతో కూడా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మరియు హెడ్‌ఫోన్స్‌తో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
కుర్రాళ్లు జాగ్రత్త
అధిక వేగం ఉన్న వాహనాల కొనుగోలుకు యువత అసక్తి చూపుతున్నారు. సై్టల్, హోదా ఉంటుందని వారి భావన. ఖరీదైన బైక్‌లపై మోజు గణనీయంగా పెరుగుతోంది.ఫలితంగా అతివేగం వల్ల వాహనంపై నియంత్రణ లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే తమ పిల్లలకు బైక్‌లను సమకూరుస్తున్న తల్లిదండ్రులపైనే చాలా బాధ్యత ఉందనే విషయాన్ని గమనించాలి. చేతికొచ్చిన పిల్లలు మృత్యువాత పడితే కడుపుకోత బాధ గురించి పిల్లలకు తెలియజేయాలి. బైక్‌లు కొనిచ్చినప్పటికీ.. వాటి నిర్వహణపై తల్లిదండ్రులు గమనిస్తుండాలి.
మద్యానికి బానిసలుగా..
యుక్తవయస్సు ఉన్నవారు ఆల్కహాల్‌కు బానిసవుతున్నారు. కొన్నిచోట్ల యువకులు మద్యం కోసం ప్రత్యేక బడ్జెట్‌ను తయారుచేసుకుంటున్నారు. తమ పాకెట్ మనీలో 70శాతం వరకు ఆల్కహాల్‌కే ఖర్చు పెడుతున్నారు. మద్యానికి డబ్బులు లేని సమయంలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇటీవల హైద్రాబాద్‌లో కొందరు యువకులు మద్యం తాగి వాహనం నడుపుతూ చిన్నారి రమ్యతో పాటు మరో ఇద్దరు చనిపోయేందుకు కారణమయ్యారు.
ముగ్గులోకి లాగుతున్నారు
పబ్‌లోకి అమ్మాయిలతో వస్తేనే ప్రవేశం.. స్నేహితులతో కలిసి వెళ్తున్న యువకులకు తీరా అక్కడికి వెళ్లాక మద్యం, మత్తు పదార్ధాలకు అలవాటు చేస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్‌తో మొదలుపెట్టి మద్యం, మత్తుపదార్థాల వరకు చేరుతున్నారు. క్రేజీగా భావిస్తున్నారు. స్టార్ హోటల్స్‌లలో అయితే వైన్ ఫెస్టివల్‌తో యువతారాన్ని ఆకర్షిస్తున్నాయి. క్రమంగా ఆల్కహాల్ ఎక్కువగా ఉండే పానీయాలపై మొగ్గు చూపుతున్నారు.
నైతిక విలువలకు ప్రాధాన్యం
విద్యార్థులకు ప్రాధమిక స్థాయి నుండే నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలి. మానవత్వం గురించి చెప్పాలి. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండేలా చూడాలి. చదువు, కేరీర్‌పైనే దృష్టి సారించేలా చూడాలి. తల్లిదండ్రులతో అభిప్రాయాలు పంచుకునేలా స్వేచ్ఛగా వెల్లడించాలి. సమస్యలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలి. జీవితమంటే సరదలు, షికారులే కాదు.. లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. ప్రేమే జీవితం కాదు.. జీవితంలో ప్రేమ ఓ భాగం మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి.
తల్లిదండ్రుల బాధ్యత పెరగాలి
విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. విద్యార్ధులను కేవలం ఉద్యోగాలు సంపాదించి యంత్రాలుగానే కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు, వారి ప్రవర్తన ఏ విధంగా ఉందని కనిపెడుతుండాలి. విద్యతో పాటు నైతిక విలువలు, మానవత్వం, సామాజిక బాధ్యతలు నేర్పాలి.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
–నర్సింహులు, ఎస్సై, ఆలేరు
మారుతున్న సమాజంలో తల్లిదండ్రులు సంపాదన మీద చూపుతున్న శ్రద్ధ కుటుంబంపై చూపడం లేదు. ప్రధానంగా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూడాలి. మానవీయ విలువలను తెలియజేయాలి. పిల్లలకు ఆత్మీయత, అనురాగాలు, అనుబంధాలను పెంపొందేలా పెంచాలి.
తేడా గుర్తించాలి
–డా. ప్రభాకర్ , స్త్రీ వైద్య నిపుణులు, ఆలేరు
ప్రేమకు–ఆకర్షణకు తేడా తెలుసుకోవాలి. కౌమరదశ– యవ్వనానికి పూర్వం అంటే 13–19 సంవత్సరాల మధ్య స్త్రీ పురుషుల్లో హర్మోన్ల ప్రభావంతో ఆకర్షణలు ఏర్పడుతాయి. విజ్ఞాత కలిగి హృదయపూర్వక సాన్నిహిత్యాన్ని కోరుకోవడమే అసలైన ప్రేమ. 20 ఏళ్లు దాటిన యువత సమాజం, పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ, చదువు అన్నింటిపై అవగాహన కలిగి ఉంటారు.
యాంత్రీకరణగా సంబంధాలు
–బండిరాజుల శంకర్, ప్రిన్సిపాల్, ఆలేరు
ప్రస్తుతం తల్లిదండ్రులకు సంపాదనపై ఉన్న ద్యాసం కుటుంబంపై ఉండడం లేదు. ఆలుమగల మధ్య సంబంధాలు యాంత్రీకరణగా మారడంతో అనుబంధం, ఆత్మీయత, అనురాగం దూరమవుతున్నాయి. వీటి ప్రభావం పిల్లలపై పడుతుంది. పిల్లలు పాశ్చాత్య పోకడలు పట్టకుండా చూడాల్సింది తల్లిదండ్రులదే. వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలపై అవగాహన కల్పించాలి.