దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఒకవైపు బీజేపీ మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఇండియా కూటమి.. బీజేపీని ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి గెలిస్తే, వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ సమం చేసినట్లవుతుంది. నెహ్రూ 1951–52, 1957, 1962లో వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని, అందులో బీజేపీకి కనీసం 370 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ఇప్పటికే నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కమలదళం 2019లో తొలిసారిగా గెలిచిన 32 లోక్‌సభ స్థానాలను తిరిగి గెలుచుకోవడం ఎంతో ముఖ్యం.
ఈ కీలకమైన సీట్లలో పశ్చిమ బెంగాల్ నుంచి 16, హర్యానా నుంచి 3, కర్ణాటక నుంచి 3, ఒడిశా నుంచి 3, తెలంగాణ నుంచి 2, త్రిపుర నుంచి 2 సీట్లు ఉన్నాయి. ఒక సీటు అస్సాం నుండి, ఒక సీటు మహారాష్ట్ర నుండి, ఒక సీటు మణిపూర్ నుండి కూడా గెలుచుకోవాల్సివుంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారిగా 16 సీట్లు గెలుచుకుంది. అలాగే హర్యానాలోని సిర్సా, హిసార్, రోహ్‌తక్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇదే విధంగా కర్ణాటకలోని చామరాజనగర్, చిక్కబల్లాపూర్, కోలార్ స్థానాలను కూడా గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ మొదటిసారి మూడు స్థానాలను గెలుచుకుంది.
2019లో తొలిసారిగా తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్‌లో పార్టీ విజయం సాధించింది. అదే ఏడాది త్రిపుర పశ్చిమ, త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ తన ఖాతా తెరవడంలో విజయం సాధించింది. 2019లో తొలిసారిగా అసోంలో బీజేపీ 9 సీట్లు గెలుచుకుంది.
2019లో తొలిసారిగా మహారాష్ట్రలో మాధాలో బీజేపీ విజయం సాధించింది. ఇన్నర్ మణిపూర్ సీటును గెలుచుకోవడం ద్వారా, బీజేపీ 2019లో మొదటిసారి మణిపూర్‌లో తన ఖాతాను తెరిచింది.
Comments
Please login to add a commentAdd a comment