ప్రియురాలు దక్కదని యువకుడి ఆత్మహత్య
ఖమ్మం జిల్లా : చండ్రుగొండ మండలంలోని మద్దుకూరు గ్రామానికి చెందిన కొడెం శ్రీకాంత్ (22) ప్రియురాలు దక్కదని తీవ్ర మనస్ధాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారంరాత్రి జరిగింది. బాలిక కుటుంబీకులు శ్రీకాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఉన్న శ్రీకాంత్ పురుగులు మందు తాగి శనివారం స్టేషన్‌కు వెళ్ళాడు. ఇది గమనించిన పోలీసులు అతడిని చికిత్స కోసం తరలించారు. కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు, స్ధానికుల కధనం ప్రకారం సంఘటన వివరాలిలా ఉన్నాయి.
మద్దుకూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ శ్రీకాంత్, అయన్నపాలెం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి పెళ్ళికి బాలిక కుటుంబీకులు నిరాకరించారు. ఈ క్రమంలో వారు చండ్రుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడిచిన శుక్రవారం శ్రీకాంత్‌ను పోలీసులు పిలిపించి పెద్దల సమక్షంలో మాట్లాడారు. తిరిగి శనివారం తీసుకువస్తానని చెప్పి మేనమామ ముత్తయ్య, శ్రీకాంత్‌ను తన పూచికత్తుపై ఇంటికి తీసుకెళ్ళాడు. శనివారం స్టేషన్‌కు అని వచ్చిన శ్రీకాంత్ పురుగుల మందు తాగి వచ్చాడు. ఇదిగమనించిన పోలీసులు అతడిని స్ధానిక ప్రైవేటు క్లినిక్‌కు తరలించారు.
అతడి పరిస్ధితి విషమంగా ఉండటంతో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ మరణించాడు. అయితే పోలీసుల వేధింపుల కారణంగానే శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబీకులతోపాటు గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జూలూరుపాడు సీఐ నాయుడు మల్లయ్యస్వామిని సాఓఇ వివరణ కోరగా శ్రీకాంత్‌ని అతడి మామయ్య ముత్తయ్య లిఖితపూర్వకంగా పూచీకత్తు ఇచ్చి తీసుకెళ్ళాడు. తిరిగి స్టేషన్‌కు పురుగుల మందు తాగి వచ్చాడన్నారు. కొంతమంది కావాలని ఈ సంఘటనను రాద్దాంతం చేస్తున్నారని చెప్పారు.