యువకుడి అనుమానాస్పద మృతి
– మతిస్థిమితం కోల్పోయి గొంతుకోసుకున్నట్లు అనుమానం
– పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామంటున్న పోలీసులు
అనంతపురం : అనంతపురం నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రుద్రంపేటలో అనిల్‌కుమార్(23) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడని స్థానికులు, పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... రవి, అనిల్‌కుమార్ ఇద్దరూ సోదరులు. వారికి తల్లిదండ్రులు లేరు. రవి బేల్దారి పని చేస్తుండగా, అనిల్‌కుమార్ అవివాహితుడు. రవి ముందు భాగంలో నివాసం ఉండగా, అనిల్‌కుమార్ ఒక్కడే అదే ఇంటికి వెనుక భాగంలో ఉంటున్నాడు. వారం రోజుల కిందట అనిల్ మిద్దెపై నుంచి కిందకు పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అప్పటి నుంచి మతిస్థిమితం లేదు.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంటి ముందు మంచంపై పడుకున్న అనిల్ గొంతు కోసుకున్నాడు. తర్వాత ఇంట్లోకి వెళ్లి గడియపెట్టుకుని గొంతుతో పాటు శరీరంపై అక్కడకక్కడా గాట్లు పెట్టుకున్నాడు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. సోదరుడు రవి, అనిల్ ఇంటివైపు చూశాడు. మంచంపై రక్తం పడి ఉండడం, వస్తువులన్నీ చిందరవందరగా ఉండడంతో అనుమానం వచ్చి తమ్ముడిని పిలిచాడు. ఎంతసేపటికీ గడి తీయకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో వాకిలి తొలగించి చూడగా.. తమ్ముడు విగతజీవిగా పడి ఉన్నాడు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ శివశంకర్ తమ సిబ్బందితో వెళ్లి అనిల్‌మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని సీఐ వెల్లడించారు. కాగా స్థల విషయమై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా? అనే అనుమానాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు తేలాల్సి ఉంది.