పెళ్లయిన నాలుగు నెలలకే...
విషజ్వరంతో యువకుడి మృతి
15 రోజుల క్రితం కన్నుమూసిన తండ్రి
రుద్రవరంలో విషాద ఛాయలు
రుద్రవరం(రెడ్డిగూడెం) :
పెళ్లయిన నాలుగు నెలలకే ఓ యువకుడు విషజ్వరంతో మరణించాడు. అతని తండ్రి కూడా 15 రోజుల క్రితమే విషజ్వరంతోనే కన్నుమూశాడు. ఈ విషాద ఘటన రెడ్డిగూడెం మండలంలోని రుద్రవరం గ్రామంలో చోటు చేసుకుంది. రుద్రవరం గ్రామంలో విషజ్వరాలు ప్రబలాయి. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మల్లాది వినోద్‌కుమార్(23) కూడా నీరసంగా ఉండటంతో గత నెల 27వ తేదీన గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్నాడు. జ్వరం ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స చేశారు. రెండు రోజులు గడిచినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు గత నెల 29వ తేదీన విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
రుద్రవరంలో విషాద ఛాయలు
వినోద్‌కుమార్‌కు నాలుగు నెలల క్రితమే వివాహమైంది. అతని తండ్రి సూరయ్య కూడా విషజ్వరంతో బాధపడుతూ 15 రోజుల క్రితమే మరణించారు. పదిహేను రోజుల వ్యవధిలో తండ్రీ కొడుకులు మృతిచెందడంతో రుద్రవరంలో విషద ఛాయలు అలుముకున్నాయి.