పి.జయమ్మ (ఫైల్)
సాక్షి, ఖమ్మం : ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి పి.జయమ్మ (45) జ్వరంతో మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు మరణించారు. జయమ్మకు భర్త, ఇద్దరు కుమారులున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం అయోధ్యనగర్ గ్రామానికి చెందిన జయమ్మ 2013లో జడ్జిగా ఎంపికయ్యారు. హైకోర్టు విభజనలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జిగా పనిచేసిన ఆమె జనవరి 7, 2019న ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యామూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె వృత్తిలో అనతికాలంలోనే న్యాయవాదులు, కక్షిదారుల మన్ననలు పొందారు. ఆమె పెద్ద కుమారుడు రోహిత్ డాక్టర్ కాగా.. చిన్న కుమారుడు విజయవాడలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. భర్త వెంకటేశ్వరబాబు డాక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపూడి తాజుద్దీన్‌బాబా ఆధ్వర్యంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించి న్యాయమూర్తి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యాయమూర్తి మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. న్యాయమూర్తి మృతికి ఐలు జిల్లా కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలిపింది. సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కార్యవర్గం, మహిళా న్యాయవాదులు, కోర్టు గుమస్తాలు తీవ్ర సంతాపం తెలిపారు. న్యాయమూర్తి మృతికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లెందు, మధిర, మణుగూర్ బార్ అసోసియేషన్లు తీవ్ర విచారాన్ని, సంతాపాన్ని తెలిపాయి. అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బార్ సంఘం సభ్యులు కొల్లి సత్యనారాయణ తదితరులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment