జ్వరాలతో గజ..గజ...   | People Suffering With Fever In Khammam | Sakshi
Sakshi News home page

జ్వరాలతో గజ..గజ...  

Published Fri, Aug 31 2018 12:11 PM | Last Updated on Fri, Aug 31 2018 12:59 PM

People Suffering With Fever In Khammam - Sakshi

రోగులను పరీక్షిస్తున్న డాక్టర్‌ సురేష్‌నారాయణ  

ఓ పక్క సీజనల్‌  వ్యాధులు.. మరో పక్క కంటి వెలుగు కార్యక్రమం.. ముగ్గురు వైద్యాధికారులకు ఇద్దరు కంటి వెలుగు విధుల్లో.. ఒక్క వైద్యుడిపైనే అదనపు భారం....ఆస్పత్రిలో రోగులు కిక్కిరిసిపోతున్నారు.. వైద్య సేవలు అందించలేక నానా అవస్థలు పడుతున్నారు. రోజుకు దాదాపు 300 మందికి పైగా ఓపీ వస్తుంది. దీంతో సిబ్బంది కూడా అసహనంతో రోగులపై చికాకు పడుతున్నారు. చీదరింపులకు చాలా మంది రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదీ నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి.

నేలకొండపల్లి : ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండల ప్రజలు వైరల్‌ ఫీవర్‌తో వణికిపోతుంది. గ్రామాల్లో పేరుకపోయిన పారిశుద్ధ్యం వలన సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మండలంలో ఏ గ్రామం, ఏ ఇంటి తలుపు తట్టినా జ్వరపీడితులే. గ్రామాల నుంచి వస్తున్న జ్వరపీడితులతో  కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ రోగులతో కిక్కిరిసిపోతుంది. జ్వరాలు, నీరసం, కీళ్ల నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతి రోజూ 300 మందికి పైగా అవుట్‌ పేషెంట్‌(ఓపీ) హాస్పిటల్‌కు వస్తున్నారు. దీంతో సిబ్బంది రోగుల పట్ల చికాకుపడటం, చీదరించుకోవటం చేస్తున్నారు. అసలే రోగం, నొప్పులతో వైద్యం కోసం వచ్చే వారి పట్ల  సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుతో చాలా మంది బాధపడుతున్నారు. చీదరింపులు తట్టుకోలేక ప్రైవేట్‌ హాస్పిటల్‌ను ఆశ్రయిస్తున్నారు. 

ఒక్కరే వైద్యుడు..  

కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ కావటంతో మండలం నుంచే కాకుండా ముదిగొండ, కూసుమంచి మండలాలకు చెందిన ప్రజలు కూడా నేలకొండపల్లి హాస్పిటల్‌కు వస్తున్నారు. ఈ హాస్పిటల్‌లో ముగ్గురు డాక్టర్స్‌ ఉన్నారు. మండల వైద్యా«ధికారి డాక్టర్‌ రాజేష్‌ను కంటి వెలుగు పథకానికి నియమించారు. 

మరో డాక్టర్‌ రత్నమనోహర్‌ను మంచుకొండ కంటి వెలుగు పథకానికి డిప్యూటేషన్‌పై పంపిం చారు. ఇక మిగిలింది  డాక్టర్‌ సురేష్‌నారాయణ.  ఒక్కరే 300 మందికి పైగా ఓపీ చూడాల్సి వస్తుంది. అంతే కాకుండా రాత్రి డ్యూటీలు చేసి మళ్లీ ఉదయం డ్యూటీలు చేస్తుండటంతో అదనపు భారంతో సతమతం అవుతున్నారు. 

డాక్టర్‌కూ జ్వరమే..  

సీజనల్‌ వ్యాధుల వలన హాస్పిటల్‌కు రోగుల సంఖ్య పెరగటంతో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు సురేష్‌నారాయణకు జ్వరం వచ్చింది. కంటి వెలుగు పథకం ప్రారంభం నుంచి  ఒక్కరే విధులు నిర్వహిస్తుండటంతో జ్వరం వచ్చింది. జ్వరం, గొంతు నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.సెలవు పెట్టేందుకు ప్రత్యామ్నాయం వైద్యులు లేకపోవటంతో జ్వరంతోనే విధులు నిర్వహిస్తున్నారు.

రోజు రోజుకు జ్వరం తీవ్రత కావటంతో ఓపిక తగ్గుతుందని తాను సెలవులో వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఉన్న ఒక్క డాక్టర్‌ కూడా సెలవు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రత్యామ్నాయంగా వైద్యులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

రోగులను సిబ్బంది గౌరవించాలి 

రోగులను అగౌరవ పరిచే విధంగా వ్యవహరిస్తే సిబ్బంది పై చర్యలు తీసుకుంటాం. సీ జనల్‌ వ్యాధుల వలన రోగు ల సంఖ్య పెరిగే  అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలి. రోగులను ప్రేమతో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. డాక్టర్స్‌ కొరత ఉన్న మాట వాస్తవమే. వాటిని భర్తీ చేసేందుకు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. 

– డాక్టర్‌ కొండల్‌రావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ 

వారం రోజులుగా జ్వరం 

వారం రోజులుగా జ్వరం వస్తుంది. జ్వరం, నీరసం తో బాధపడుతున్నాను. హాస్పిటల్‌కు వస్తే జనం బాగా ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డాను. జ్వర పీడితులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వైద్యం అందించేందుకు మరింత సిబ్బందిని పెంచాలి. 

– కె.నాగమణి, సింగారెడ్డిపాలెం 

కీళ్ల నొప్పులు, నీరసంతో ఇబ్బందిగా ఉంది 

కీళ్ల నొప్పులు, నీరసంతో బాధపడుతున్నాను. రోగులు ఎక్కువగా వస్తున్నారు. దీంతో నిలబడే ఓపిక లేకుండా ఉంది. ఇంటి వద్ద నుంచి హాస్పిటల్‌కు కూడా రాలేక పోయాను. ఇక్కడ డాక్టర్‌ ఒక్కరే చూడటం వలన క్యూలో నిలబడలేక పోతున్నా. రోగుల బాధలు  అర్థం చేసుకుని వైద్యులను నియమించాలి. 

– పి.కాంతయ్య, మండ్రాజుపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement