యువత కళల్లో రాణించాలి
కావలి : యువత కళల్లో రాణించాలని యువజన సర్వీసుల శాఖ సీఈఓ డాక్టర్ సీ సుబ్రమణ్యం అన్నారు. పట్టణ పరిధిలోని మద్దూరుపాడులో ఉన్న డీబీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన డివిజన్ స్థాయి యువజనోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జనవరిలో జాతీయ యువజనోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. డివిజన్ స్థాయిలో పోటీలు జరిగిన తరువాత జిల్లాస్థాయిలో ఉత్సవాలు జరిపి కళాకారులను ఎంపిక చేస్తామని తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయి, తరువాత జనవరి 12 నుంచి 16 వరకు జాతీయ స్థాయిలో యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో డివిజన్ నుంచి జాతీయ స్థాయి వరకు యువ కళాకారులను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తామన్నారు. సంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలలో యువకులు ప్రతిభ చూపాలన్నారు. అనంతరం యువకులు వివిధ నృత్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి డీబీ.సురేష్‌బాబు, డైరెక్టర్ దామిశెట్టి సుధీర్‌నాయుడు, కౌన్సిలర్ అలేఖ్య, ప్రిన్సిపల్ టీవీ, రావు, ఏఓ రమేష్‌బాబు, డ్యాన్స్ మాస్టార్ ఉమామహేశ్వరరావుతోపాటు యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.