నిలదీద్దాం..రండి
- కష్టాల్లో ‘అనంత’ అన్నదాతలు
- ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం
- సర్కారు తీరుకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట నేడు వైఎస్సార్‌సీపీ మహాధర్నా
- హాజరు కానున్న విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- రైతులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పార్టీ నేతల పిలుపు
అనంతపురం ప్రతినిధి :
‘అనంత’ రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయారు. వరుస పంట నష్టాలతో తల్లడిల్లిపోతున్నారు. ఈసారీ రూ.కోట్ల పెట్టుబడులు మట్టిపాలు అయ్యాయి. కన్నీళ్లే ‘రాబడి’గా మిగిలాయి. అసలే బక్కచిక్కిపోయిన అన్నదాతలను ఆదుకోకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మానవీయ కోణంలో చూడకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వారి బతుకును ఫణంగా పెడుతున్నారు. అధికారులు కూడా సర్కారు పెద్దల మెప్పు కోసం వాస్తవాలు దాచి.. తప్పుడు లెక్కలతో రైతులను వంచిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో వర్షాభావంతో జిల్లా వ్యాప్తంగా పంటలు నష్టపోగా.. ప్రభుత్వం మాత్రం ‘రక్షకతడి’తో కాపాడామంటూ ఇన్‌పుట్æసబ్సిడీ ఎగ్గొట్టేందుకు సిద్ధమవుతోంది. అన్నదాతకు హక్కుగా దక్కాల్సిన బీమా కూడా అందకుండా పోతోంది. ఈ క్రమంలో రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడిగేందుకు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. నేటి (మంగళవారం) ఉదయం 11గంటలకు జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపడుతోంది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.