
ఆశా వర్కర్ల ధర్నాకు వైఎస్ జగన్ మద్దతు
వరంగల్ : ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లకు వైఎస్ జగన్ తన మద్దతు ప్రకటించారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ గురువారం ధర్మసాగర్ మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
తర్వాత స్టేషన్ ఘన్పూర్, రఘునాథ్పల్లి మండలాల్లో వైఎస్ జగన్ ప్రచారం చేయనున్నారు. సాయంత్రం స్టేషన్ ఘన్పూర్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. వైఎస్ జగన్ నవంబర్ 16 నుంచి వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
నేటి సాయంత్రంతో వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ఈ నెల 21వ తేదీన జరగనుంది. ఈ నెల 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.