నాలుగు రోజుల్లో తేల్చండి | ys jagan mohan reddy give 4 days time to AP Govt on | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో తేల్చండి

Published Fri, Jul 24 2015 1:02 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

నాలుగు రోజుల్లో తేల్చండి - Sakshi

నాలుగు రోజుల్లో తేల్చండి

సింగపూర్ వాళ్లు వస్తే రాజమండ్రిలో రెడ్‌కార్పెట్ పరిచిన పెద్దమనిషి.

లేకుంటే ఆపై రాష్ట్ర బంద్..
మున్సిపల్ సమ్మెపై ఏపీ సర్కార్‌కు జగన్ హెచ్చరిక

 
14 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా బాబుకు చీమకుట్టినట్లు కూడా లేదు
పుట్టపర్తిలో సమ్మెచేస్తూ మృతి చెందిన కార్మికునికి పరిహారం ఎందుకివ్వరు?
నేడు జరిగే కలెక్టరేట్ ముట్టడికి వైఎస్సార్‌సీపీ పూర్తిగా సహకరిస్తుంది
రైతు భరోసాయాత్రలో సమస్యలు విన్నవించిన మున్సిపల్ కార్మికులు
కార్మికులకు పూర్తి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
(రైతుభరోసా యాత్ర నుంచి సాక్షిప్రతినిధి): ‘‘సింగపూర్ వాళ్లు వస్తే రాజమండ్రిలో రెడ్‌కార్పెట్ పరిచిన పెద్దమనిషి.. 14 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మెచేస్తున్న మున్సిపల్ కార్మికులను కనీసం చర్చలకు కూడా పిలవడంలేదు. చంద్రబాబుకు నాలుగు రోజులు టైమ్ ఇస్తున్నాం. ఈలోపు కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే మున్సిపాలిటీలను స్తంభిం పచేస్తాం... రాష్ర్ట బంద్‌కు పిలుపునిస్తాం’’ అని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అనంతపురం జిల్లాలో మూడోవిడత రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని మూడోరోజు గురువారం కంబదూరు మండలం తిమ్మాపురం క్రాస్ వద్ద మున్సిపల్ కార్మికులు, కార్మిక సంఘం నేతలు కలసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘పని చేస్తేకాని పొట్ట గడవని స్థితిలో ఉన్న మున్సిపల్ కార్మికులు 14 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నా సీఎం చంద్రబాబుకు కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. అరకొర జీతాలతో బతకడం కష్టంగా ఉంది, జీతాలు పెంచమని కోరుతుంటే ఉక్కుపాదంతో అణచివేస్తామంటున్నారు. అసలు చంద్రబాబు మనిషేనా? ఎన్నికలకు ముందు ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్నవారిని, కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తానని, ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చింది చంద్రబాబు కాదా? అప్పుడు వీళ్ల ఓట్లతో అవసరం ఉంది కాబట్టి మాయ మాటలు చెప్పారు. ఇప్పుడు రోడ్డుపై నిలబెట్టారు. ఎప్పుడు ఉద్యోగాల్లోంచి తీసేస్తారో తెలియని పరిస్థితుల్లో వారందరి జీవితాలతో చెలగాటం అడుతున్నారు. ఇదీ చంద్రబాబు నిజస్వరూపం’’ అంటూ జగన్ మండిపడ్డారు.

ఉద్యోగులకు పెంచిన 43 శాతం ఫిట్‌మెంట్ ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి, కాంట్రాక్ట్ సిబ్బందికి వర్తించదా? అని ప్రశ్నించారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి కూరగాయలు ఏమైనా తక్కువ ధరకు ఇస్తారా? లేకపోతే పెట్రోల్ ఏమైనా తక్కువ రేటుకు పోస్తారా? డీజిల్ తక్కువ రేటుకు ఇస్తారా? అని నిలదీశారు. ‘‘తెలంగాణలో కార్మికులు సమ్మె చేస్తే ప్రభుత్వం అడిగిన మేరకు వేతనాలు పెంచేందుకు దిగివచ్చింది. ఇక్కడ వేతనాలు పెంచినా ప్రభుత్వంపై రూ.200-300కోట్ల భారం మాత్రమే పడుతుంది. దీనికోసం కార్మికులను రోడ్డున పడేశారు. సమ్మెతో పట్టణాల్లో ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ప్రజలు రోగాలబారిన పడతారని ప్రభుత్వానికి ఏమాత్రం జాగ్రత్త లేదు. మునిసిపల్ కార్మికులను చర్చలకు పిలవలేదు’’ అని దుయ్యబట్టారు. పుట్టపర్తిలో సమ్మెచేస్తూ మరణించిన కార్మికుడికి రూ.ఐదు లక్షల పరిహారం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కార్మికులు నేడు చేస్తున్న కలెక్టరేట్ల ముట్టడిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొంటాయని చెప్పారు.  

మద్దతిస్తే ప్రభుత్వం దిగివస్తుంది..
రెగ్యులర్, కాంట్రాక్టు మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 14రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మున్సిపల్ కార్మికులు జగన్‌కు వినతిపత్రం ఇచ్చిన సందర్భంగా విన్నవించారు. పదో పీఆర్సీ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు 29-32శాతం ఫిట్‌మెంట్ ఇవ్వొచ్చని... కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 13వేల రూపాయలు తగ్గకుండా వేతనం ఇవ్వాలని సిఫార్సు చేశారని తెలిపారు. ఇటీవల ఆర్టీసీ కార్మికులు వేతనాలు పెంచాలని సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జగన్ ప్రత్యక్షంగా మద్దతు తెలిపి బంద్‌కు పిలుపునిచ్చినపుడు ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు.

మున్సిపల్ కార్మికులకు కూడా అలాంటి సహకారం అందించాలని కార్మికసంఘం నేతలు కోరారు. పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లకు నెలకు రూ.1,623 మాత్రమే వేతనం ఇస్తున్నారని, వీరికి కూడా సరిపడా జీతం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు జగన్ మద్దతు తెలిపారు. జగన్‌కు సమస్యలు విన్నవించిన వారిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, సీఐటీయూ నాయకులు గోపాల్, ఐఎఫ్‌టీయూ నాయకులు ఉపేంద్ర, వైఎస్సార్‌టీయూసీ నేత ఆదినారాయణరెడ్డి ఉన్నారు. మూడోరోజు యాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ పొగ్రాం కోర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బోయ తిప్పేస్వామి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషా శ్రీచరణ్, జిల్లా నేత చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మీరు యాత్ర మొదలుపెట్టాక పిలిచి చెక్ ఇచ్చారు
‘సార్... మీరు శెట్టూరు నుంచి భరోసా యాత్ర ప్రారంభించగానే మమ్మల్ని పిలిచి రూ.3.50 లక్షల చెక్ ఇచ్చార’ని అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న తిమ్మాపురం గ్రామ రైతు నారాయణప్ప పెద్ద కుమారుడు మారెన్న జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. తాను వచ్చినందుకైనా వారికి పరిహారం అందడంపట్ల జగన్ సంతోషం వ్యక్తం చేశారు. మూడో విడత రైతు భరోసాలో భాగంగా గురువారం ఏపీలోని కల్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలంలో  నారాయణప్ప, వంటారెడ్డిపల్లి రైతు రామాంజనేయులు కుటుంబాల ను జగన్ పరామర్శించారు. రుణమాఫీ ఎంత వర్తించింది? ప్రైవేటు అప్పులు ఎంత ఉన్నాయి? అని నారాయణప్ప భార్య లక్ష్మీదేవిని అడిగి తెలుసుకున్నారు.

పింఛన్‌కు దరఖాస్తు చేసినా ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు పింఛన్లు పెంచినట్టే పెంచి ఉన్నవి తీసేశారు. మీలాంటి వారందరితో హైకోర్టులో పిటిషన్ వేయిస్తాం. మీకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం’’ అని జగన్ భరోసానిచ్చారు. ఇక ‘‘నా భర్త చనిపోతే సాయం చేయడానికి వచ్చిన అధికారులను టీడీపీ నాయకులు భయపెడుతున్నారు. మీరు మా పార్టీ కార్యకర్తలు కాదు కదా! మీకు సాయం ఎందుకు చేయాలంటున్నారు. ’’ అంటూ రామాంజనేయులు భార్య గంగమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పార్టీ శ్రేణులు అండగా ఉంటారని, ధైర్యంగా ఉండాలని జగన్ భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement