సర్కారు తీరు దారుణం
- పన్నులు చెల్లించకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తారా?
– వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
రాజమహేంద్రవరం రూరల్ : జిల్లాలోని గ్రామపంచాయతీలలో ఐదు రెట్లు ఇంటి పన్నులు పెంచేసి, వాటిని చెల్లించకపోతే ప్రభుత్వ పథకాలైన రేషన్‌కార్డులు, పింఛన్లను నిలుపుదల చేస్తామని అధికారులు చెప్పడం దారుణమని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమూరు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ధర్నాలో ఆమె, పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు(బాబు) పాల్గొన్నారు. ధర్నా అనంతరం విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడారు. గతంలో ఇంటి పన్ను రూ.600 ఉంటే ఇప్పుడు ఆ పన్ను రూ.5,560 ఉందని, పెంచిన ఇంటిపన్నులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు హయాంలో జరిగిన అభివృద్ధే ఇంకా కనిపిస్తోందన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కేంద్రప్రభుత్వం ద్వారా అమలవుతున్న ఉపాధిహామీ పథకం, పంచాయతీ నిధులతో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నారన్నారు. గోరంట్ల స్వయంగా చేసిన అభివృద్ధి ఏమిటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప గ్రామాలలో చాలా ప్రదేశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందన్నారు. ఎమ్మెల్యే రోజాను అనైతికంగా ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, మళ్లీ ఏడాది పాటు సస్పెండ్ చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. శాసనసభలో తన నియోజకవర్గ సమస్యలపై రోజా మాట్లాడేందుకు వీలు లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఏ శాసనసభలోనూ ఏడాదిపాటు ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవన్నారు.