వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఎస్సై జులుం
చిట్టమూరు : మండలంలోని ఆరూరుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను వాకాడు ఎస్‌ఐ సుధాకర్ మంగళవారం చిట్టమూరు పోలీస్‌స్టేషన్‌లో కొట్టాడు. దీనిపై గూడూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్ తీవ్రంగా ఖండించారు. ఆరూరులో జరిగిన ఉత్సవాల్లో ఫ్లెక్సీలు చించేశారని అధికార పార్టీ నాయకులు చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత ఫిర్యాదు చేశారు. దళితవాడకు చెందిన లక్ష్మీనారాయణ, కుమార్ అనే కార్యకర్తలు ఫ్లెక్సీలు చించారని ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్‌చార్జి వాకాడు ఎస్‌ఐ సుధాకర్ విచారణ జరుపకుండా ఇద్దరు కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు రప్పించి లాఠీలు విరిగిపోయేట్టు కొట్టారు. విషయం తెలుసుకున్న పార్టీ అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నాయకులు దేవారెడ్డి సుధాకర్ రెడ్డి, మరి కొంత మంది నాయకులతో కలిసి మేరిగ స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ సుధాకర్ నిలదీశారు. టీడీపీ నేతల మెహర్బాని కోసం తమ కార్యకర్తలపై అకారణంగా తప్పుడు కేసులు బనాయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.