పెదపూడి (అనపర్తి): పెదపూడి ఎస్సై కిషోర్‌బాబు వేధింపులు తాళలేక వైఎస్సార్ సీపీ మండల కార్యదర్శి పెంకే ఏకాశి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. బాధితుడు, బంధువుల కథనం ప్రకారం.. గండ్రేడు గ్రామానికి చెందిన ఏకాశి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తుంటాడు. అయితే గ్రామంలో వల్లు రామతులసి, దెయ్యాల మంగయమ్మ ఇంటి సరిహద్దు వివాదంలో మంగయమ్మ తరఫున ఏకాశి మధ్యవర్తిత్వం వహించాడు. అప్పటి నుంచి అతడిపై అధికార పార్టీ నేతలు, పోలీసులు కక్షకట్టారని వారు ఆరోపించారు. రామతులసి ఇచ్చిన ఫిర్యాదుపై ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఏకాశిని ఐదు రోజుల క్రితం పెదపూడి పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. శనివారం ఉదయం ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు.
ఎస్సై కిషోర్‌బాబు, పోలీసులు ఏకాశిని కొట్టి వెళ్లిపొమ్మని, మరలా సాయంత్రం మిగిలినవారందరితో కలిసి రావాలంటూ పంపించేశారు. గ్రామంలో పెద్దగా ఉంటున్న తనను, కొట్టడం, తిరిగి సాయంత్రం రమ్మనడంతో ఏకాశి తీవ్ర మనస్తాపంతో మందు తాగి, మరలా పోలీస్‌స్టేషన్‌కి వచ్చి పురుగులు మందు తాగాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన వేరే కేసులో ఉన్నవారు అడ్డుకుని వెంటనే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఏకాశి పురుగులు మందు తాగడానికి ముందుగానే మొబైల్‌లో తనను పోలీసులు వేధిస్తున్నారని, ఐదుగురు వ్యక్తులపై కేసులు ఉండగా ఎవరిని స్టేషన్‌కు తీసుకురాకుండా, తనను మాత్రమే పోలీస్టేషనుకు తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి, మిత్రులకు వాట్సప్ మెసేజ్ చేసినట్టు తెలిపారు.
తక్షణం ఎస్సైను సస్పెండ్ చేయాలి : డాక్టర్ సూర్యనారాయణరెడ్డి
దౌర్జన్యంగా పోలీస్టేషన్‌కు తీసుకొచ్చి వేధింపులకు గురి చేసి పురుగుల మందు తాగడానికి కారణమైన ఎస్సై కిషోర్‌బాబును తక్షణం సస్పెండ్ చేయాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన పోలీస్టేషన్‌ను, పురుగులు మందు తాగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన స్టేషన్లో పోలీసులతో మాట్లాడారు. ఏకాశిని ఎందుకు కొట్టారంటూ ప్రశ్నించారు. అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదై ఉంటే చూపించాలన్నారు. అయితే పోలీసులు ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో ఏకాశి పేరు లేదని, కేసు నమోదు చేయలేదని ఉందేంటని అడిగారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ అతడి పేరు సీడీ ఫైల్‌లో నమోదు చేస్తామని చెప్పారు. దీంతో డాక్టర్ సూర్యనారాయణరెడ్డి వైఎస్సార్ సీపీ నాయకులే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ నాయకులపై దౌర్జన్యకాండ ఆపాలి
మండలంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు వ్యవహరిస్తున్న దౌర్జన్య కాండను వెంటనే ఆపాలని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గతేడాది జూలై 10న శహపురం గ్రామంలో రాయుడు సత్యనారాయణ అనే వ్యక్తి పోలీసులు వేధింపుల తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అలాగే ఇప్పుడు ఏకాశి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడన్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. గతంలో శహపురం రాయుడు సత్యనారాయణ సంఘటనలో ఉన్నతాధికారులు ఎస్సైను సస్పెండ్ చేసి ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేవని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment