పేర్నినానిని పరామర్శించిన బొత్స
మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం సబ్ జైలులో ఉన్న వైఎస్సార్సీపీ నేత పేర్నినానిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొత్స సత్యనారాయణ బుధవారం పరామర్శించారు. రైతుల తరఫున పోరాడుతున్న తమ పార్టీ నాయకులపై టీడీపీ సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన మండిపడ్డారు. అంతకు ముందు పేర్నినాని విడుదల కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాలో బొత్స మాట్లాడారు.
అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని, రైతుల కోసం చివరి వరకూ పోరాడతామని బొత్స స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. పేర్ని నానిని పరామర్శించిన వారిలో పార్టీ నేతలు కొలుసు పార్థసారధి, రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. మచిలీపట్నం పోర్ట్, దాని అనుబంధ పరిశ్రమల కోసం 30 వేల ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ రైతుల తరఫున ఉద్యమిస్తున్న పేర్ని నానిని పోలీసులు మూడు రోజుల క్రితం అరెస్ట్ చేశారు.