లోకేశ్ చెప్పాడని ‘సాక్షి’ని ఆపేస్తారా?
*చంద్రబాబుకు బాకా ఊదకపోతే మీడియాను బతకనీయరా?
*వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో నేతల మండిపాటు
*రెండు రోజుల్లోగా ప్రసారాలను పునరుద్ధించాలని డిమాండ్
విజయవాడ : జనం గొంతుకైన సాక్షి మీడియా ప్రసారాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే రానున్న కాలంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. విజయవాడలో మంగళవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలువురు మాట్లాడుతూ ‘సాక్షి’కి బాసటగా నిలిచారు. ముద్రగడ పద్మనాభం దీక్షను ప్రసారం చేస్తున్నారనే సాకు చూపి సాక్షిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా, ఏ డిమాండ్లపై ఉద్యమం జరిగినా మీడియా తన వంతు బాధ్యతగా ప్రసారం చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాక్షి మీడియా గొంతు నొక్కేయడాన్ని ప్రజలు హర్షించరని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ చెప్పాడని రాష్ట్రంలో పలువురు ఎంఎస్‌వోలు సాక్షి ప్రసారాలను నిలిపివేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. వ్యాపారం చేసుకునే ఎంఎస్‌వోలు రాజకీయ నాయకులైన లోకేశ్ చెప్పాడనో, చంద్రబాబు చెప్పాడనో సాక్షి ప్రసారాలు ఆపితే జరిగే పరిణామాలకు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. చంద్రబాబుకు బాకా ఊదకపోతే మీడియాను బతకనీయం అనే ధోరణి సరికాదని ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. టీవీ చానళ్లలో ఎంతసేపూ చంద్రబాబు ప్రసంగం, ఆయన బావమరిది, తమ్ముడి కొడుకు సినిమాలే చూడాలా? అని ప్రశ్నించారు. రెండు రోజులు గడువు ఇస్తున్నామని, అప్పటికీ సాక్షి ప్రసారాలు పునరుద్ధరించకపోతే ఏ గ్రామంలోనూ ఎంఎస్‌వోల ప్రసారాలు రావని హెచ్చరించారు.
సాక్షిని అడ్డుకోవడం ద్వారా వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వేయొచ్చన్న చంద్రబాబు ఆటలు ఇక సాగవని ఎమ్మెల్యే కోటం శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. సాక్షి ప్రసారాలు పునరుద్ధరించేందుకు ఎంఎస్‌వోలపై ఒత్తిడి పెంచాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అవసరమైతే సోషల్ మీడియా అనే బ్రహ్మాస్త్రాన్ని చంద్రబాబు దుష్టపాలనకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టాలని అన్నారు. రెండు రోజుల్లోగా సాక్షి చానల్ ప్రసారాలను పునరుద్ధరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెచ్చరించారు.