చమురు సంస్థల అన్యాయంపై సమరం చేయాలి
-ముమ్మిడివరం వైఎస్సార్ సీపీ ప్లీనరీలో ఎమ్మెల్సీ బోస్
-టీడీపీ పాలనపై కన్నబాబు, పినిపే ధ్వజం
ముమ్మిడివరం : చమురు సంస్థల నిధుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయంపై ఈ ప్రాంత ప్రజలు ఉద్యమించాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ముమ్మిడివరం శ్రీకృష్ణదేవరాయ కాపు కల్యాణమండపంలో బుధవారం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రత్యేకమైన ప్రాంతమైన కోనసీమలో చమురు సంస్థల కార్యకలాపాలు విరివిగా జరగటంతో సీఎస్‌ఆర్ నిధులతో మంచి అభివృద్ధి జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశించారన్నారు. ఈ ప్రాంతంలో ఆ నిధులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కళాశాలల వంటివి నిర్మించక పోవడం దురదృష్ణకరమన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు సరైన అవగాహన లేకపోవడంతో ఆ నిధులను అతిథి గృహాలకు, కల్యాణ మండపాలకు, కేటాయించడం శోచనీయమన్నారు. ఈ అంశాలపై ప్లీనరీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్లీనరీలో ప్రవేశపెట్టాలని సూచించారు. మరో ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని విమర్శించారు. అమరావతిని అద్భుతమైన రాజధానిగా నిర్మిస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలకగా ప్రభుత్వ అవినీతిలో అమరావతి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. సబ్ ప్లాన్ నిధులను షెడ్యూల్డ్ తెగలు నివసించే ప్రాంతాలలో ఖర్చుచేయకుండా అమరావతిలో నిర్మించే 120 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి మళ్లించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ౖఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్న లక్ష్యంతో కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా అప్పటి ఉమ్మడి రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకొని వెళ్లిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌కే దక్కిందన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్ల్రంలో14లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తే తన హయాంలో 73లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ ప్రవేశపెడితే చంద్రబాబు అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశార విమర్శించారు. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నా భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సమావేశంలో గ్రేటర్ రాజమండ్రి కోఆర్డినేటర్ కందుల దుర్గేష్, పి.గన్నవరం కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాష్ట్ర పార్టీ ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరావు, రాజమండ్రి నగర పాలక సంస్థఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు భూపతిరాజు సుదర్శనబాబు, పెయ్యల చిట్టిబాబు, పాలెపు «ధర్మారావు, ఏడిద చక్రపాణిరావు, మిండగుదిటి మోహన్, అత్తిలి సీతారామస్వామి, కొల్లి నిర్మలాకుమారి, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.