- నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ప్లీనరీల్లో నేతల దిశా నిర్థేశం
- సైనికుల్లా పని చేయండి ... విజయం మనదే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : హామీలు అమలు చేయకుండా సంక్షేమ పథకాలకు కోతలు పెడుతున్న చంద్రబాబు సర్కార్ దాష్టీకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వైఎస్సార్‌సీపీ ప్లీనరీలు పార్టీ శ్రేణులకు దిశా నిర్థేశనం చేస్తున్నాయి. మూడో రోజు శనివారం పి.గన్నవరం, రాజమహేంద్రవరం రూరల్, మండపేట నియోజక వర్గాల్లో పార్టీ ప్లీనరీలు జరిగాయి. ఈ ప్లీనరీల్లో గణాంకాలతో కూడిన నివేదికలు, చైతన్య పరిచే నేతల ప్రసంగాలు క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేయడం, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ తదితర సంక్షేమ పథకాల్లో చంద్రబాబు కోతలు పెట్టిన విషయంపై కార్యకర్తలకు వివరించారు. ప్లీనరీలు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కాగా రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించారు. నేతల ప్రసంగాలు, క్షేత్రస్థాయి నాయకులు తీర్మానాలను చదివే తీరు, కార్యకర్తలు చర్చల్లో పాల్గొన్న తీరు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ప్రజా సంక్షేమంలో దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ఔన్నత్యాన్ని, చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని, దళితులను దగా చేస్తున్న వైనాన్ని వివరిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు.
అంబాజీపేటలో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, కొంతమూరులో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మండపేటలో పరిశీలకుడు చెల్లుబోయిన వేణు అధ్యక్షతన జరిగిన ప్లీనరీల్లో నేతలు చంద్రబాబు అవినీతి పాలనను ఎండగట్టారు. మండపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, అంబాజీపేటలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాజమహేంద్రవరం రూరల్‌లో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిధిలుగా హాజరై చంద్రబాబు మాట తప్పిన వైనాన్ని కార్యకర్తలకు వివరించి ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత తీసుకునేలా వారిలో స్ఫూర్తిని రగిలించారు. కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రియల్ స్టేట్‌గా కాకుండా రియల్ ఎస్టేట్‌గా చంద్రబాబు, అతని తనయుడు లోకేష్ తయారు చేశారని ధ్వజమెత్తారు. కార్యకర్తలపై ఈగవాలితే ఉపేక్షించేది లేదని అంతా వారి వెంటే ఉంటామని కన్నబాబు భరోసా ఇచ్చారు. రైతుల రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ఏ రీతిలో భ్రష్టుపట్టించారో లెక్కలతో సహా ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ వివరించారు. సంక్షేమ పథకాల్లో కోత పెడుతూ అవినీతిలో అభివృద్ధి సాధించిన చంద్రబాబు సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.
దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు రాజమహేంద్రవరం రూరల్‌లో గెలుపొందడం ద్వారా తుని తప్ప జిల్లా అంతటా అప్పట్లో గెలుపు సాధించామని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతిని గ్రామగ్రామాన ఎండగట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు గద్దె దిగే వరకు సమిష్టిగా నేతలు, కార్యకర్తలు పోరాటాలు చేయాలని పీఏసీ, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. ప్లీనరీ పరిశీలకుడు వట్టికూటి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, పార్లమెంటరీ పరిశీలకుడు వలవల బాబ్జి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర కార్యదర్శి కొల్లి నిర్మలాకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, రావూరి వెంకటేశ్వరరావు పార్టీకార్యకర్తలు సమన్వయంతో చంద్రబాబు అరాచక పాలనపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయకుంటే చంద్రబాబు అరాచక పాలనకు అడ్డు అదుపు లేకుండా పోతోందని యూత్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షుడు అనంతబాబు, గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం ఫ్లోర్‌లీడర్ షర్మిలా రెడ్డి తదితరులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కో ఆర్డినేటర్లు గిరజాల బాబు, వేగుళ్ల పట్టాభిరామయ్య, వేగుళ్ల లీలాకృష్ణ, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాస్, మిండగుదిటి మోహనరావు, కర్రి పాపారాయుడు, నక్కా రాజబాబు, కర్రి నాగిరెడ్డి, రెడ్డి రాజబాబు, కొవ్వూరి త్రినాధరెడ్డి, పి కె రావు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పెట్టా శ్రీనివాసరావు, మార్గని గంగాధర్, జున్నూరి వెంకటేశ్వరరావు, సిరిపురపు శ్రీనివాసరావు, కాశి బాలమునికుమారి తదితరులు పాల్గొన్నారు.