ప్లీనరీలకు పోటెత్తిన శ్రేణులు
చంద్రబాబు రాక్షస పాలనను ఎండగట్టిన నేతలు
పార్టీ ఫిరాయింపుదారులకు చురకలు
కేడర్‌లో ఉత్సాహం నింపిన నాయకులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో మంగళవారం జరిగిన మూడు ప్లీనరీలకు అభిమానులు పోటెత్తారు. ప్లీనరీలు జరిగిన వేదికలు తరలివచ్చిన శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. కాకినాడ రూరల్, రాజోలు, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాల్లో కో ఆర్డినేటర్‌లు కురసాల కన్నబాబు, బొంతు రాజేశ్వరరావు, రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగాయి. కాకినాడ రూరల్ ప్లీనరీ జరిగిన స్పందన ఫంక్షన్ హాలు కేడర్‌తో నిండిపోవడంతో బయట ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. రాజోలు, రాజమహేంద్రవరం సిటీ ప్లీనరీలకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ప్రభుత్వం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తోన్న వైనాన్ని జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఎత్తిచూపారు. ప్రజావ్యతిరేక విధానాలను, మోసపూరిత విధానాలను ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేత వైఎస్, మాట తప్పేవాడే బాబు అని ఇద్దరి మధ్య ఉన్న అంతరాన్ని ముఖ్య అతిథి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ విశ్లేషించారు.మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్రంలో తండ్రీ కొడుకులు దొంగపాలన చేస్తూ ప్రజలను దోచుకు తింటున్నారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లోకేష్‌కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఫిరాయించిన జిల్లా నేతలను తన సహజ శైలిలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరోక్ష హెచ్చరికలతో చురకలంటించిన తీరు కేడర్‌లో ఉత్తేజాన్ని నింపింది.
శివకోడులో రాజోలు ప్లీనరీ కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో సుఖశాంతులతో ఉన్న ప్రజలు చంద్రబాబు గద్దెనెక్కాక రాక్షస పాలన కొనసాగిస్తున్న వైనాన్ని రాజోలు ప్లీనరీలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఎండగట్టారు. దళిత ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచి పోతారని రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున చంద్రబాబు అన్నారు. నిరంకుశ పాలనపై దండెత్తాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకునే వారిని జగన్‌మోహన్ రెడ్డి గుర్తించి పగ్గాలు అప్పగిస్తారని చెబుతూ కేడర్ అంతా కలిసి కట్టుగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ పరిశీలకుడు వలవల బాబ్జీ, డీసీసీబీ డైరెక్టర్ పాముల విజయరంగారావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి టీడీపీ రాక్షస పాలనను ఎండగట్టారు.
రాజమహేంద్రవరం సిటీ ప్లీనరీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి చంద్రబాబు మోసాలను శాస్త్రీయంగా విశ్లేషించిన తీరు కేడర్‌ను ఆకర్షించింది. బాబు హస్తం భస్మాసురమని రాజమహేంద్రవరం గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్ సూత్రీకరించారు. ఆయా ప్లీనరీలలో మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, పాముల రాజేశ్వరి, రౌతు సూర్యప్రకాశరావు టీడీపీ మోసాలను ఎండగట్టారు. కో–ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, ముత్యాల శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్ పార్టీ కేడర్‌కు దిశానిర్థేసం చేశారు. ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తదితరులు టీడీపీ మోసాలను ఎండగట్టారు. రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, సంగిశెట్టి అశోక్, రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి బొబ్బిలి గోవిందు, అల్లి రాజబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబు పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉందని కేడర్‌లో మనోధైర్యాన్ని నింపారు. వైద్య, ఎస్సీ విభాగాల అధ్యక్షులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, పెట్టా శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి తదితరులు పాల్గొన్నారు.