- సన్నాహక సమావేశంలో వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు
- నేడు పరిశీలకుల నియామకం
- ఐదో తేదీ తరువాత మరోసారి భేటీ
- జయప్రదానికి పార్టీ శ్రేణులు కసరత్తు
ఇప్పటికే గడప గడపకూ వైఎస్సార్ పేరుతో ప్రతి ఇంటి తలుపు తట్టి పలుకరించిన వైఎస్పార్ సీపీ పార్టీ ... గ్రామ, మండల, జిల్లా స్థాయి సమస్యలే అంజెండాగా ప్లీనరీ సమావేశాలను నియోజకవర్గ స్థాయిల్లో వినూత్నంగా చేపట్టడానికి శ్రీకారం చుడు తోంది. గ్రామ స్థాయి సమస్యలను నియోజకవర్గ స్థాయి సమవేశంలో చర్చించి ... అందులో ప్రధానమైనవాటిని జిల్లా ప్లీనరీలో చచ్చకు పెట్టి వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తుంది. మరీ కీలకమైన సమస్యలను రాష్ట్రస్థాయి సమావేశంలో తీర్మానాలుగా ప్రవేశ పెడతారు. ఆ దిశగా బలంగా అడుగులు వేయడానికి జిల్లా పార్టీ సమాయత్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి నియోజకవర్గ స్థాయిలో ప్లీనరీలకు సిద్ధమవుతోంది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు అన్ని నియోజక వర్గాల్లో ప్లీనరీ సమావేశాలు చేపట్టనున్నారు. నియోజక వర్గాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పార్టీ అభిమానులు, ప్రజల సమక్షంలో చర్చించి తీర్మానాన్ని ఆమోదించి జిల్లా ప్లీనరీలో ప్రతిపాదించడం, ఆ తరువాత రాష్ట్ర ప్లీనరీలో ఆమోదించాలనేది పార్టీ ఆదేశం. ఈ ప్లీనరీలలో ఎటువంటి సమస్యలు చర్చించాలి, ఎలా నిర్వహించాలి, ఎవరు పర్యవేక్షించాలి, నిర్వహణ తదితర అంశాలపై గురువారం కాకినాడ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. తొలిసారి నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ప్లీనరీల్లో పార్టీ కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిపై సమగ్రంగా చర్చించాల్సి ఉంటుంది. చర్చ అనంతరం ఆ సమస్య పరిష్కారానికి పార్టీ తరఫున తీసుకోవాల్సిన ఆందోళనకు కార్యచరణను రూపొందించి జిల్లా ప్లీనరీకి నివేదించనున్నారు. వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో ఏదో ఒక రోజు నిర్వహించే జిల్లా ప్లీనరీలో ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి జిల్లా స్థాయిలో ఒక ప్రతిపాదన ముసాయిదాను రూపొందించి రాష్ట్ర ప్లీనరీ ముందుంచాలనేది పార్టీ నిర్ణయం. ఇందుకు నియోజకవర్గ స్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన కార్యచరణపై పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్ర బోస్, దాడిశెట్టి రాజా, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు సుదీర్ఘంగా చర్చించారు.
నియోజకవర్గానికి ఒక్కో పరిశీలకుడి పర్యవేక్షణలో...
ఇందుకోసం ప్రతి నియోజక వర్గానికి ఒక పరిశీలకుడిని నియమించే విషయమై కసరత్తు చేశారు. ఏ నియోజక వర్గానికి ఎవరిని నియమించాలనే జాబితా శుక్రవారం నాటికి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. ఏ నియోజకవర్గంలో ఏ తేదీన నిర్వహిస్తారనేది నియోజకవర్గ నేతలు తమకున్న వెసలుబాటును చూసుకుని చర్చించి శుక్రవారం మధ్యాహ్నానికి పార్టీ జిల్లా కార్యాలయానికి నివేదించాలని తీర్మానించారు. జిల్లా స్థాయిలో ప్లీనరీ ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలనేది వచ్చే నెల 5 తరువాత మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునేందుకు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్లీనరీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజా సమస్యలను ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గట్టిగా చెప్పారు. పార్టీ యువజన విభాగం నుంచి ప్రతి ఒక్కరు విధిగా ఎవరి పరిధిలో వారు నియోజకవర్గ ప్లీనరీకి హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని ఆ విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయభాస్కర్ పేర్కొన్నారు. పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పార్టీ కేడర్ ద్వారా దిశా నిర్థేసనం చేసేందుకు ఉపయోగపడే నియోజకవర్గ ప్లీనరీలు సద్వినియోగంచేసుకునేందుకు వేదికగా చేసుకోవాలని రాజమహేంద్రవరం గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్, ప్లీనరీ ద్వారా టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై హడలెత్తిపోయేలా కార్యక్రమాలుండాలని సీజీసీ సభ్యులు కుడుపూడి, విజయలక్ష్మి సూచించారు. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పన మోహనరావు, పార్టీ క్షేత్రస్థాయిలో బలపడటానికి దోహదపడే వీటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పాముల రాజేశ్వరీదేవి, పెండెం దొరబాబు, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకే ప్రసన్నకుమార్ సూచించారు. పార్టీని నిర్మాణాత్మకంగా క్షేత్రస్థాయిలో మరింత బలపడేందుకు ప్లీనరీలు దోహదపడేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అమలాపురం పార్లమెంటు పరిశీలకుడు వలవల బాబ్జీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహనరావు, కర్రి పాపారాయుడు తదితరులు పేర్కొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించడం, మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేయడం ద్వారా ప్లీనరీ ప్రారంభమయ్యేలా చూడాలని ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి, రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వెంకటేష్‌లు సూచించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కోఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, పర్వత ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, కొండేటి చిట్టిబాబు, వేగుళ్ల పట్టాభి, వేగుళ్ల లీలాకృష్ణ, పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గుత్తుల సాయి, రావూరి వెంకటేశ్వరరావు, పాలెపు ధర్మారావు, వట్టికూటి రాజశేఖర్, ఎస్ వెంకటరెడ్డి, కాకినాడ పార్టీ నగర అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.