ఉత్సాహం పంచి.. ఉత్తేజం నింపి.. | ysrcp plenary meetings | Sakshi
Sakshi News home page

ఉత్సాహం పంచి.. ఉత్తేజం నింపి..

Published Mon, Jun 5 2017 12:12 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

ఉత్సాహం పంచి.. ఉత్తేజం నింపి.. - Sakshi

ఉత్సాహం పంచి.. ఉత్తేజం నింపి..

- వైఎస్సార్‌ సీపీ ప్లీనరీలకు పోటెత్తిన జనం
- తరలివచ్చిన రాష్ట్ర నేతలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రజాధనాన్ని దుబారా చేస్తూ.. అధికారులపై ఒత్తిడి తెస్తూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షలు పేలవంగా సాగుతుంటే.. వైఎస్సార్‌ సీపీ నిర్వహిస్తున్న నియోజకవర్గ ప్లీనరీలకు జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. గత మూడు రోజులుగా జిల్లాలో ప్లీనరీలు జరుగుతుండగా.. ఆదివారం ఒకే రోజే ఐదు నియోజకవర్గాల్లో ప్లీనరీలు నిర్వహించారు. వీటికి పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. తుని, రాజానగరం, జగ్గంపేట, అనపర్తి, కొత్తపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీలకు రాష్ట్ర నేతలు తరలిరావడం పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. చంద్రబాబు సర్కార్‌ వైఫల్యాలపై రాష్ట్ర, ప్రజాప్రతినిధులు, నేతలు ప్లీనరీల్లో ఎండగడుతున్న తీరుకు పార్టీ కేడర్‌తో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఇందుకూరి రామకృష్ణంరాజు వంటి అగ్రనేతలు ఒకేసారి ఆదివారం తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.
తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అధ్యక్షతన జరిగిన ప్లీనరీకి అనూహ్య రీతిలో జనం తరలివచ్చి స్థానికంగా యనమల సోదరులపై వ్యతిరేకతను చాటారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిన వైనాన్ని పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు వివరించారు. మంత్రి యనమల సోదరుల అరాచకాలను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఎండగట్టినప్పుడు నియోజకవర్గం నలుమూలల నుంచీ తరలివచ్చిన జనం నుంచి ఈలలు, కేకలతో పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. తునిలో నడుస్తున్న దోపిడీ రాజ్యాన్ని ఎదుర్కొనేందుకు వెన్నంటి ఉంటానన్నప్పుడు ‘జై రాజా’ అనే నినాదాలు మిన్నంటాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తీరుతో ప్రభుత్వం దిగివచ్చిందని అన్నారు. యనమల ఆగడాలు సాగుతున్నా జనం భయపడకుండా ఎమ్మెల్యే రాజాకు అండదండలు అందిస్తుండటం అభినందనీయమని కాకినాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్‌ అన్నారు. రెండేళ్లలో రానున్న కురుక్షేత్రంలాంటి ఎన్నికల్లో పాండవుల్లా అధికారాన్ని చేపట్టేందుకు సైనికుల్లా పని చేయాలని పరిశీలకుడు కందుల దుర్గేష్‌ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
జగ్గంపేటలో నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గ పాలనను దుయ్యబట్టారు. అవినీతిని, దోపిడీని రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేశారని, చట్టాలను మార్చి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో ఓడిపోలేదని, మొదట ఒక సీటు, తరువాత 17 సీట్లు, గత ఎన్నికల్లో 67 సీట్ల స్థాయికి చేరుకుందని చెబుతూ కేడర్‌లో ఉత్తేజాన్ని నింపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఏదో ఒక రోజు జిల్లా ప్లీనరీ ఉంటుందని వివరించారు. టీడీపీ మహానాడు ఫుడ్‌ ఫెస్టివల్‌గా మారిందని, ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాలు, కాకినాడ పీతలు తప్ప ప్రజల సమస్యలు పట్టలేదని విమర్శించారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్‌ మాట్లాడుతూ, నియోజకవర్గంలో 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పాగా వేయడమే లక్ష్యంగా పని చేయాలని, జగ్గంపేటను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానని అన్నారు.
దివాన్‌చెరువులోని ఎంఎఫ్‌ కన్వెన్షన్‌ హాలులో జరిగిన వైఎస్సార్‌ సీపీ రాజానగరం నియోజకవర్గ ప్లీనరీకి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కో ఆర్డినేటర్‌ జక్కంపూడి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహానేత వైఎస్, మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావుల విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మృతికి కొద్దిసేపు మౌనం పాటించారు. ఇసుక, మట్టితో దొరికిన కాడికి దోచుకోవడమే చంద్రబాబు సర్కార్‌ విధానంగా పెట్టుకుందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆక్షేపించారు. నియోజకవర్గం అవినీతికి పరాకాష్టగా మారిందని, కోడిగుడ్డు, పాడైన పాలప్యాకెట్లను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ, విజయలక్ష్మి సాక్ష్యాధారాలతో సహా ప్లీనరీ ముందుంచారు. అవినీతికి అంతు లేకుండా ఉందని, వివిధ రకాల పథకాల పేరుతో దోపిడీయే ధ్యేయంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆక్షేపించారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు అడుగుజాడల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరాన్ని పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్‌ సూచించారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో పార్టీ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి నొక్కి చెప్పారు.
రావులపాలెంలో జరిగిన కొత్తపేట నియోజకవర్గ ప్లీనరీకి అనూహ్య స్పందన లభించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ అభిమానులు, నేతలతో ప్లీనరీ జరిగిన బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానం కిక్కిరిసిపోయింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రకృతి వనరులను నిలువునా దోచుకుంటున్న చంద్రబాబు ప్రజాకంటక పాలనపై ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిప్పులు చెరిగినప్పుడు జనం చప్పట్లతో స్వాగతించారు. జన్మభూమి పేరుతో గ్రామాల్లో అక్రమాలకు పాల్పడుతూ అర్హులకు అన్యాయం చేస్తున్న వైనాన్ని ఎండగట్టారాయన. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ప్లీనరీలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని జగ్గిరెడ్డితోపాటు జెడ్పీ ప్రతిపక్ష నేత సాకే ప్రసన్నకుమార్‌ తదితరులు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆ ప్లీనరీలో 13 తీర్మానాలను ఆమోదించారు.
అనపర్తి కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ కళావేదిక ప్రాంగణంలో ప్లీనరీ జరిగింది. ఎమ్మెల్సీ, పార్టీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పి, చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అనంతరం జనాన్ని నిలువునా ముంచేశారని, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను నీరుగార్చారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడే కుటుంబం వైఎస్సార్‌దని అన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ, నీరు - చెట్టు, ఉచిత ఇసుక, మద్యం షాపులను అక్రమ ఆదాయ మార్గాలుగా చేసుకుని చంద్రబాబు అండ్‌ కో 420గా మారిందని తనదైన శైలిలో వాక్బాణాలు సంధించడంతో జనం ఈలలతో కేరింతలు కొట్టారు. అక్రమాలతో సంపాదించిన కోట్ల కరెన్సీ కట్టలతో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న బాబుకు జనం ఓట్ల కట్టలతో బుద్ధి చెప్పేలా కార్యకర్తలు ముందుండి నడిపించాలంటూ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న జనం సర్కార్‌పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతున్నారని యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా విశ్లేషించారు. ఈ ప్లీనరీల్లో పార్టీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, పరిశీలకులు వలవల బాబ్జీ, కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, పెండెం దొరబాబు, ముత్తా శశిధర్, పర్వత ప్రసాద్, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, పరిశీలకులు మిండగుదిటి మోహనరావు, శెట్టిబత్తుల రాజబాబు, రాష్ట్ర, జిల్లా నేతలు కొల్లి నిర్మలకుమారి, కర్రి నాగిరెడ్డి, మార్గాని గంగాధర్‌, గొల్లపల్లి డేవిడ్‌రాజు, మోతుకూరి వెంకటేష్, కర్రి పాపారాయుడు, సుంకర చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement