‘పేట’లో వైఎస్సార్‌సీపీ బంద్ విజయవంతం
టీడీపీ దురాగతాలు, ఎన్‌సీవీ యాజమాన్యంపై అక్రమ కేసులకు నిరసన
కోడెల నుంచి ప్రాణహాని ఉంది: నల్లపాటి రాము
స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వల్ల తనకు హాని ఉందని, అక్రమంగా అరెస్టుచేసి పోలీసులు చంపుతామని తుపాకీతో బెదరిస్తున్నారంటూ ఎన్‌సీవీ అధినేత నల్లపాటి రామచంద్రప్రసాదు ఆవేదన వ్యక్తం చేశారు. హత్యాయత్నం కేసులో వన్‌టౌన్ పో లీసులు ఆయన్ను అరెస్టు చేసి సోమవారం మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఎస్పీడీ వెన్నెల వద్ద హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు వెళుతూ విలేకరులతో మాట్లాడారు.
నరసరావుపేట/గుంటూరు : వైఎస్సార్ సీపీ యువనేతకు చెందిన ఎన్‌సీవీ(నల్లపాటి కేబుల్ విజన్) యాజమాన్యంపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బంద్‌లో పాల్గొని కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు వచ్చిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, నరసరావుపేట, గుంటూరు ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ ముస్తాఫాలు పట్టణంలో పర్యటించకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ఆదివారం సాయంత్రం ఎన్‌సీవీపై టీడీపీ వర్గీయులు దాడిచేసి ధ్వంసం చేసి, అడ్డుకున్న జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావు చేయి విరగ్గొట్టిన విషయం విదితమే.ఈ నేపథ్యంలోజరిగిన బంద్‌లో పాల్గొనేందుకు వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. వారిని పంపించేందుకు పోలీసులు శతవిధాలుగా బెదిరించారు. అయినప్పటికీ కార్యకర్తలు పోలీసులను నెట్టుకుంటూ నాయకులతో కలిసి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.