రోజాను అడ్డుకోవడం అన్యాయం
వైఎస్సార్‌సీపీ తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతసాగర్
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారతకు టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెప్పే ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్.. విజయవాడ సమీపంలో నిర్వహిస్తున్న జాతీయ మహిళ పార్లమెంట్ సదస్సులో పాల్గొనేందుకు వెళుతు న్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను అడ్డుకోవడం సిగ్గు చేటని ఆ పార్టీ తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు కె.అమృతసాగర్ అన్నారు. శనివారం ఆమె ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా సమాజమంతా ఈ సంఘటనను ఖండిస్తోందన్నారు.
తనకు అనుకూలురైన వారితో పొగిడించుకోవడమే సదస్సు ఉద్దేశమయితే దానికి టీడీపీ మహిళా సదస్సుగా నామకరణం చేసుకొని ఉంటే బాగుండేదన్నారు. ఎయిర్‌పోర్టులో అడ్డుకుని ఒక మహిళా ఎమ్మెల్యేను గంటలతరబడి వారి అదుపులో ఉంచుకోవడం సమంజసం కాదన్నారు. మహిళలపై బాబుకు గౌరవం లేదనే విషయం దీని ద్వారా అర్థమైపోయిందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఇంకెంత కాలం నిర్భంద కాండ కొనసాగిస్తారని ప్రశ్నించారు. రోజా అంటేనే.. బాబు, కోడెలకు వణుకు పుడు తోందన్నారు. మహిళల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వాలూ మనుగడ సాగించిన దాఖలాలు లేవన్నది వారు గుర్తుంచుకోవాలన్నారు.