నాచినపల్లిలో విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్న జడ్పీ చైర్‌పర్సన్ పద్మ
పంతులమ్మగా జెడ్పీ చైర్‌పర్సన్
Published Fri, Aug 5 2016 10:07 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
దుగ్గొండి: నిత్యం బిజీ జీవితం.. జిల్లా పాలనలో నిత్యం తలమునకలై ఉంటారు. వివిధ శాఖలను పర్యవేక్షిస్తుంటారు. బిజీ బిజీగా పాలన సాగించే జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ కాసేపు పంతులమ్మగా మారారు. 10 వతరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారిని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మండలంలోని నాచినపల్లి, దుగ్గొండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు రిజిష్టర్‌లను పరిశీలించారు. నాచినపల్లిలో తెలుగు ఉపాధ్యాయుడి గైర్హాజర్‌పై హెచ్‌ఎం దుర్గాప్రసాద్‌ను ప్రశ్నించింది. పాఠశాలకు సక్రమంగా విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు.
కంప్యూటర్‌లు వృథాగా ఉంటున్నాయని వివరించడంతో బోధకుడి ఏర్పాటు కోసం డీఈఓతో మాట్లాడుతామన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పుష్టికరమైన భోజనం వండిపెట్టాలని ఏజెన్సీ మహిళలకు సూచించారు. పాఠశాల పూర్వవిద్యార్థులు సమకూర్చిన ఎకరంన్నర ఆటస్థలానికి ప్రహారీ మంజూరు చేయాలని పీఏసీఎస్ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, సర్పంచ్ గోవిందు అనిత కోరడంతో వెంటనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దుగ్గొండి ఉన్నతపాఠశాల హెచ్‌ఎం, ఇన్‌చార్జి ఎంఈఓ కొంగర ప్రశాంత్ ఎలాంటి అనుమతి లేకుండా పాఠశాలకు గైర్హాజర్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఓ పనితీరు సరిగా లేదని ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ సభ్యురాలు రజిత, ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రావులు చైర్మన్‌కు వివరించారు. విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచిన దుగ్గొండి ఉపాధ్యాయ బృందాన్ని ఆమె అభినందించారు.
పాఠశాల ఆవరణల్లో మొక్కలు నాటిన పద్మ
దుగ్గొండి, నాచినపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు నలుగురు విద్యార్థులకు బాధ్యత అప్పగించారు. ప్రతి విద్యార్థి పాఠశాల ఆవరణలో తన పేరున మొక్క నాటి సంరక్షించాలని సూచించారు.
Advertisement