సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ పటమటకు చెందిన రాజారావు కుమార్తెకు ఫిబ్రవరిలో వివాహం. ఏటీఎంలలో విత్‌డ్రాల మీద రోజుకు గరిష్ట పరిమితి ఉంది కదా. పెళ్లి పనులకు పెద్ద మొత్తం చేతిలో ఉండాలి. అందుకే నగదు విత్‌డ్రాకు బ్యాంకుకు వెళ్లారు. కానీ రోజుకు రూ.49 వేలుకు మించి విత్‌డ్రా ఇవ్వబోమని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆయనకు నోటమాట రాలేదు. ఇదీ ఆ ఒక్క బ్యాంకులోనే కాదు... అమరావతి పరిధిలో దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ నెలకొన్న పరిస్థితి.
బ్యాంకుల అనధికార పరిమితులు....
అమరావతి పరిధిలో బ్యాంకులు ఖాతాదారులకు విత్‌డ్రాల మీద అనధికారికంగా ఆంక్షలు విధించాయి. ఒక ఖాతాదారునికి రోజుకు రూ.49 వేలుకు మించి నగదు విత్‌డ్రా ఇవ్వడం లేదు. కృష్ణా జిల్లాలో 48 బ్యాంకులచెందిన 789 శాఖలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 42 బ్యాంకులకు చెందిన 795 శాఖలు ఉన్నాయి. గతంలో సగటున ఒక్కో బ్యాంకు రోజుకు రూ.3 కోట్ల వరకు నగదు విత్‌డ్రాలు ఇచ్చేవి. కానీ ప్రస్తుతం రూ.కోటికి మించి నగదు విత్‌డ్రాలు ఇవ్వలేకపోతున్నాయి. ఇక ఏటీఎంలలో కూడా తగినంత నగదు అందుబాటులో ఉంచడం లేదు. కృష్ణా జిల్లాలో 928 ఏటీఎంలు ఉండగా గుంటూరు జిల్లాలో 850 ఏటీఎంలున్నాయి. వాటిలో దాదాపు 40 శాతం ఏటీఎంలు నగదు అందుబాటులో ఉంచలేకపోతున్నారు. ప్రధాన బ్యాంకులే దాదాపు 30 శాతం ఏటీఎంలకు నగదు సరఫరా నిలిపివేశాయి. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఆ ఏటీఎంల వద్ద నియమించిన గార్డులను కూడా తొలగించాయి. ఆ ఏటీఎంలను త్వరలో మూసివేయాలని భావిస్తున్నారు. ఉన్న ఏటీఎంలలో కూడా ఒక బ్యాంకు ఖాతా మీద రోజుకు విత్‌డ్రా గరిష్ట పరిమితి రూ.20 వేలే ఉంది.
ఖాతాదారుల ఇక్కట్లు....
విత్‌డ్రాల మీద పరిమితులతో ఖాతాదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. అమరావతి పరిధిలో దాదాపు 3 వేల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. పెళ్లి ఏర్పాట్ల కోసం చేతిలో నగదు ఉండాల్సిందే. సంప్రదాయ ఖర్చులు అన్నింటికీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వినియోగించలేరన్నది అందరూ అంగీకరించే వాస్తవం. ఇక నగదు కొరత వ్యాపార కార్యకలాపాల మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. వాణిజ్య రాజధాని విజయవాడలో 100 హోల్‌సేల్ అసోషియేషన్లు ఉన్నాయి. రోజుకు దాదాపు రూ.500 కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాలు సాగుతాయి. వ్యవసాయోత్పత్తుల ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్న గుంటూరులో రోజుకు రూ.250 కోట్లకుపైగా వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయి.
అందులో కనీసం 50 శాతం నగదు లావాదేవీలే ఉంటాయి. గత ఏడాది పెద్ద నోట్ల రద్దుతో వ్యాపార కార్యకలాపాలు దాదాపు ఆరునెలలపాటు పడకేశాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి గాడిలో పడుతోందని అనుకుంటుంటే నగదు కొరత మళ్లీ దెబ్బతీస్తోంది. చేతిలో తగినంత నగదు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో వ్యాపార కార్యకలాపాల జోరు తగ్గుతోందని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు. నగదు ఇక్కట్లకు ఎప్పటిలోగా తెరపడుతుందో తాము చెప్పలేమని లీడ్‌బ్యాంకు అధికారులు అంటున్నారు. రిజర్వుబ్యాంకు తగినంత నగదు సరఫరా చేస్తే తప్పా తాము చేయగలిగేందీ లేదని తేల్చి చెబుతున్నారు. అంతవరకు నగదు ఇక్కట్లు కొనసాగాల్సిందేనా...! పరిస్థితి అలానే ఉంది మరి.
బ్యాంకుల్లో నగదు కటకట....
నగదు కటకట మళ్లీ తలెత్తింది. బ్యాంకు ఖాతాదారులు మరోసారి నగదు కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జనవరి మొదటి వారం నుంచి మొదలైన ఈ పరిస్థితి రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. లీడ్ బ్యాంకు వర్గాలు అనధికారికంగా చెబుతున్న వివరాల ప్రకారం ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంకులకు నగదు సరఫరాను బాగా తగ్గించి వేసింది. కొత్త రూ.500, రూ.200, రూ.2వేల నోట్లు ఆశించిన స్థాయిలో ముద్రించలేకపోతున్నారు. బ్యాంకులకు సరఫరా చేసే నగదుపై ఆర్‌బీఐ పరిమితులు విధించడంతో అమరావతిలోని బ్యాంకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment