చీపురుపుల్లల విప్లవం | AAP win a defeat for arrogance, says Mamata | Sakshi
Sakshi News home page

చీపురుపుల్లల విప్లవం

Published Tue, Feb 10 2015 11:54 PM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

చీపురుపుల్లల విప్లవం - Sakshi

చీపురుపుల్లల విప్లవం

కేజ్రీవాల్ పార్టీ సాధించిన విజయం స్వతంత్ర భారత చరిత్రలోనే ఘనమైనదిగా కీర్తిని నమోదు చేసుకోగలిగింది. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో నేడు ప్రతిపక్షం లేదు. ఉన్నా కంటితుడుపు బలమే. ఈ ఫలితాలు భారతదేశ రాజకీయాలలో సరికొత్త పరిణామా లకు దారితీస్తాయని ఇప్పుడే అంచనాలు మొదలైనాయి. వేగవంతమైన సమీకరణలకు కారణమవుతాయని కూడా అంతా నమ్ముతున్నారు. ఇటీవల యువతను విశేషంగా ఆకర్షించిన రాజకీయ పక్షం ఆప్. ఇది ఊదర ద్వారా వచ్చిన వాపు కూడా కాదు.

‘పాలనాక్రమంలో సిద్ధాంత ప్రాతిపదికలేని ప్రయోగాల ప్రమాదం ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుకావచ్చు. ఆ క్రమంలోనే పాలకుడు తప్పులు చేస్తాడు. ఆ తప్పుల మూలంగా గొలుసుకట్టు పరిణామాలు చోటుచేసుకుంటాయి. అవి ఒకప్పుడు విషాదంగానూ, మరొకప్పుడు హాస్యాస్పదంగానూ మారవచ్చు. కానీ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ‘ఆప్’ మాత్రం సంక్షోభ దశను తట్టుకుని కూడా బలంగా నిలదొక్కుకుంది’.
-ప్రొఫెసర్ శివ్‌విశ్వనాథన్ (9-2-‘15)

అన్నా హజారే నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఆరంభమైన అవినీతి వ్యతిరేకోద్యమంతో సన్నిహిత సంబంధం కలిగినవారు అరవింద్ కేజ్రీవాల్. అన్నాకు ఆయన సన్నిహిత సహచరుడు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు (ఐఆర్‌ఎస్) చెందిన కేజ్రీవాల్ భారత రాజకీయాలలో ‘కొరకరాని కొయ్య’. ‘దేశీయ తయారీ సరుకు’ కేజ్రీ మొదట యూపీఏ (కాంగ్రెస్) ప్రభుత్వానికీ, ఆ తరువాత ఎన్‌డీఏ (బీజేపీ) పాలనా శక్తులకూ సవాలుగా నిలిచారు.

ఢిల్లీ శాసనసభకు మొన్న జరిగిన ఎన్నికలలో ఒక వెల్లువలా ఓట్లు సాధించి అధికార పీఠం వైపు అడుగువేశారు. మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏరికోరి తెచ్చుకుంది. ఆ పార్టీలో మరెవరూ ‘మొనగాడు’ లేనట్టు పోలింగ్ జరగడానికి పది పన్నెండు రోజుల ముందు ఆమెను పార్టీలో చేర్చుకుని ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించారు. నిజానికి అన్నా ఆరంభించిన అవినీతి వ్యతిరేకోద్యమంలో ఆమె కూడా భాగస్వామి. కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి పట్టు ఉన్న ఢిల్లీ నగరంలో, కేజ్రీవాల్‌కు దీటుగా నిలబడగల ప్రత్యర్థిగా ఆ పార్టీ బయటి వ్యక్తి బేడీని ఎంచుకుంది. ఆ పార్టీ ఓటమికి ఇదే తొలిమెట్టు.  

తొలి ప్రయత్నం
కేజ్రీవాల్ మొదటి నుంచి అవినీతి వ్యతిరేకోద్యమాలతోనే పేరు తెచ్చుకున్నా రు. నవంబర్, 2012లో ఆప్‌ను ఏర్పాటు చేసి, జాతీయ కన్వీనర్‌గా ఎన్నికై, ఆ మరుసటి సంవత్సరమే ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పోటీకి దిగారు. 70 స్థానా లు ఉన్న ఢిల్లీ శాసనసభలో ఆప్‌కు 28 స్థానాలు వచ్చాయి. తొలి ప్రయత్నంలో ఢిల్లీకి ఏలిక కాగలిగిన మెజారిటీకి కొంచెం ఇవతల ఉండిపోయారు. అయినా కాంగ్రెస్ మద్దతుతో డిసెంబర్ 28, 2013న ఆయన ముఖ్య మంత్రిగా ప్రమా ణ స్వీకారం చేశారు. 49 రోజుల తరువాత ఫిబ్రవరి 14, 2014న రాజీనామా చేశారు.

జన్‌లోక్‌పాల్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టలేకపోయినందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినా ఉద్యమ నాయకత్వం ఇచ్చిన అనుభవంతో ఆప్ ఆ వ్యవధిలోనే కొన్ని మౌలిక ప్రయోజనాలను నెరవేర్చాలని భావించిం ది. కానీ అవసరమైన ఆధిక్యం అసెంబ్లీలో లేదు. తాను ఆశించిన మేరకు అలాంటి చట్టాలను వెలువరించడానికి తన బలంతో సాధ్యంకాదు కనుకనే కేజ్రీవాల్ పదవి నుంచి అర్ధంతరంగా వైదొలిగారు. ఇది దుందుడుకుగా కనిపించింది. అయినా సంవత్సరానికల్లా ఆప్ మళ్లీ అధికారంలోకి వచ్చింది.

చరిత్ర సృష్టించిన గెలుపు
కేజ్రీవాల్ పార్టీ సాధించిన విజయం స్వతంత్ర భారత చరిత్రలోనే ఘనమైనది గా నమోదు చేసుకోగలిగింది. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో నేడు ప్రతిపక్షం లేదు. ఉన్నా కంటితుడుపు బలమే. ఈ ఫలితాలు భారతదేశ రాజకీయాలలో సరికొత్త పరిణామాలకు దారితీస్తాయని ఇప్పుడే అంచనాలు మొదలైనాయి. వేగవంతమైన సమీకరణలకు కారణమవుతాయని కూడా అంతా నమ్ముతున్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ అహంకారంతో అనుసరిస్తున్న ధోరణే ప్రజానీకాన్ని ఆప్ వైపు చూడక తప్పని పరిస్థితిని కల్పించింది.

అధికార పార్టీ అహంకారం
విభజించి పాలించే బీజేపీ తత్వం కూడా కొద్దిమాసాల కాలంలోనే ఆ పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచింది. ప్రజల అసంతృప్తే, దాని నుంచి వచ్చిన అసహ నమే ఆప్ విజయావకాశాలను రెట్టింపునకు పెంచి ఉండవచ్చు. నిర్దిష్టమైన సామాజిక దృక్కోణం, అదికూడా లౌకిక వ్యవస్థను సుసంపన్నం, సుస్థిరం చేసేందుకు దోహదపడే తాత్వికత బీజేపీలో కొరవడ్డాయి. ప్రజాబాహుళ్యానికి జీవనాధారం కాగలిగిన ఆర్థిక ప్రణాళిక, వైదేశిక నీతి కూడా బీజేపీకి లేవు. ఇవే దేశాన్ని విపరిణామాల వైపు తీసుకుపోతున్నాయి. ప్రతిపక్షాల ప్రతీకలను, పథకాలను, ఎన్నికల చిహ్నాలను కూడా తస్కరించే స్థితికి అధికార పార్టీ దిగజారిందని చెప్పుకోవాలి. ఉదాహరణకి ఆప్ పార్టీ చిహ్నం - చీపురు. ఆ చిహ్నాన్ని కాజేసి ‘స్వచ్ఛభారత్’ పేరుతో వీధులను ఊడ్చే వస్తువుకు ప్రతీకగా చిత్రించి చూపేందుకు బీజేపీ ప్రయత్నించింది.

గాంధీజీ కళ్లజోడుతో జాతి కళ్లు కప్పే యత్నం
ప్రధాని మోదీ తలపెట్టిన స్వచ్ఛభారత్ ప్రకటనలలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ మహాత్మా గాంధీ కళ్లజోడును ‘సింబల్’గా ఉపయోగించుకుంటోంది. కళ్లజోడైతే గాంధీజీదేగానీ, జాతిపిత దూరదృష్టి ఆ పార్టీ సిద్ధాంతకర్తలకు అబ్బలేదు. గాంధీజీని నాథూరామ్ గాడ్సే తుపాకీ గుళ్లకు బలిచేయడాన్ని బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు అమిత్‌షా ఇంతవరకు ఖండించిన దాఖలా లేదు. దీనికి తోడు అన్యమతస్తుల, వారి ప్రార్థనామందిరాల మీద దాడులు మరొక పరిణామం. వీటిని కూడా ఆయన ఖండించడం లేదు.

స్విస్ బ్యాంకులలో మూలుగుతున్న భారత మోతుబరుల లక్షల కోట్ల రూపాయల  నల్ల (గుప్త) ధనరాశులను రప్పిస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీ గాలికి ఎగిరిపోయింది. వీటన్నిటి కారణంగానే దేశ రాజధానిని ఆప్ కైవసం చేసుకోగలిగింది. కేంద్ర పాలిత అధీన ప్రాంత రాష్ట్రమైన ఢిల్లీకి ఆప్ అధినేత పాలకుడు కావడం చీపురుకట్టకు పట్టుకుచ్చు చుట్టినట్టయింది.

అవినీతిని సహించని తత్వం
కేజ్రీవాల్ మీద ఢిల్లీ ప్రజల తిరుగులేని విశ్వాసానికి మరో ముఖ్యకారణం - అవినీతి వ్యతిరేకోద్యమంతో ముందునుంచీ ఆయన మమేకమై ఉండడమే. అన్నాతో కలసి ఆరంభించిన ఆ ఉద్యమాన్ని ఆయన నేటికీ కొనసాగిస్తు న్నారు.  లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటు కోసం హజారేతో కలసి పోరుతూనే ఉన్నా రు. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ మారకుండా, కనీసం ఆ చట్టం పరిధిలో అయినా సంస్కరణలు చోటు చేసుకుంటే తప్ప కేజ్రీవాల్ ఆ విషయంలో చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. అలాగే వామపక్షాల అనైక్యత వల్ల తృతీ య ఫ్రంట్ ఏర్పాటు రూపుదాల్చకుండా వాయిదా పడుతున్న ఈ సంధి దశలో ప్రజలు ‘ఆప్’ను ఒక తాత్కాలిక దశగా భావించి ఉండవచ్చు కూడా.  పలు రాష్ట్రాలలో ఆప్ కార్యకలాపాలను సాగిస్తుండడం వల్ల భవిష్యత్‌లో గుణాత్మకమైన మార్పునకు దోహదం చేయవచ్చు.

ఈలోగానే, దేశంలో మూడో బలమైన ప్రత్యామ్నాయ సమైక్య రాజకీయ సంఘటన నాయకత్వం లో వేదిక ఏర్పాటు కావడానికి ఆప్ ఉద్యమం దోహదకారి కావచ్చు కూడా. ఇటీవల కాలంలో యువతను విశేషంగా ఆకర్షించిన రాజకీయ పక్షం ఆప్. ఇది ఊదర ద్వారా వచ్చిన వాపు కూడా కాదు. పార్టీ నిర్మాణంలో భాగంగా ఒక తటస్థ శక్తితో పార్టీ నిర్వహణ తీరుతెన్నులను నిష్కర్షగా విమర్శించి, సలహాలు ఇవ్వగల అంబుడ్స్‌మన్‌ను నియమించాలని అనుకోవడం కేజ్రీవాల్ ప్రజాస్వామిక దృష్టికి నిదర్శనమే. ప్రజా ప్రయోజనాలకు సమాచార హక్కు చట్టాన్ని చక్కగా వినియోగించుకున్న వ్యక్తి కేజ్రీవాల్.

లోపాలూ గుర్తించాల్సిందే
ఈ విజయాలూ, ఈ సిద్ధాంతాలు చూసినంత మాత్రానే ఆప్ వామపక్ష జాతీయ ప్రజాతంత్ర ఐక్య సంఘటనకు శాశ్వత ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడగలదని భావించలేం. కానీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కశ్మీర్‌లో రాజకీయ సమీకరణలను కూడా ప్రభావితం చేసే అవకాశమే ఉంది. 370 అధికరణను రద్దు చే సి, ఆ రాష్ర్ట ప్రత్యేక ప్రతిపత్తిని నీరుగార్చాలని బీజేపీ ఆశ. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గినట్టే కనిపిస్తూ అక్కడ సాధించిన కొద్దిపాటి సీట్లతో రాజకీయాలను ప్రభావితం చేయాలని బీజేపీ యోచన.

పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్‌తో (పీడీఎఫ్) కలసి కశ్మీర్‌లో అధికారం పంచుకుందామని కలలు కంటున్న బీజేపీకి ఢిల్లీ ఫలితాలు ఒకింత నిరాశ మిగిల్చినా ఆశ్చర్యం లేదు. ఢిల్లీ ప్రజల తిరస్కారంతో పీడీఎఫ్‌బీజేపీతో అధికారం పంచుకొనే ప్రయత్నాన్ని విరమించుకోవచ్చు. పంజాబ్, ఈశాన్య భారతం, మధ్య భారత  రాష్ట్రాలలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ క్రమంగా దక్షిణ భారతావనిని కూడా కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో ఉంది. కానీ ఢిల్లీలో  చీపురు తెచ్చిన ప్రభావంతో ఆయా రాష్ట్రాలలో కూడా సమీకరణలు మారే అవకాశమే ఎక్కువ. 

నిజానికి  హజారే, కేజ్రీవాల్‌ల తొలి రాజకీయ మొగ్గు బీజేపీ వైపే ఉన్నా, గతంలో చేసిన తప్పులను పునరావృతం కానివ్వబోనని ఆయన ప్రకటించారు. ఇది హర్షణీయం. భారత రాజకీయాలలో విప్లవకర మార్పుల కు ఎదురు చూడవచ్చునంటూ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపు ఒక ఆశగానే మిగిలిపోరాదు. ఎందుకంటే ఇంత ఆధిక్యంతో వచ్చే దూకుడును అదుపు చేసుకోవడం కూడా ఆప్‌కు పెనుసవాలే.
(వ్యాసకర్త మొబైల్: 9848318414)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement