అనుపమ్‌కి ఈ అవార్డు ఎలా వచ్చింది?!
అవార్డొస్తే ఆనందం. రాకపోతే నిరాశ. వస్తుందనుకునీ రాకపోతే కోపం. క్వయిట్ నేచురల్. ఆనందంలో ఎగిరి గంతేస్తాం. నిరాశలో డీలా పడిపోతాం. కోపంలో కయ్యిమని లేస్తాం. ఇదీ నేచురలే. ఆనందంలో, నిరాశలో, కోపంలో ఒకేలా ముక్కూ మూతి బిగించుకుని ఎలా కూర్చుంటాం? కానీ ఈ మనుషులకి ఎప్పుడూ ఒకే ఎక్స్‌ప్రెషన్ కావాలి. ‘ఆరోజు నువ్వు అవార్డుల్ని తీసి పారేశావు కదా, ఇప్పుడెలా వాటిని తలకెత్తుకుంటావు’ అని వీళ్ల పాయింట్! సోషల్ మీడియా కోడిని కోసి, ఎవరికైనా ఒక సండే రోజు వండి పెట్టాలన్నంత కోపం వస్తోంది. ఎప్పుడో ఏదో అన్నానని, ఇప్పుడూ అదే అనాలా?! పని చేసేవాళ్ల కన్నా, పనికిమాలిన ప్రశ్నలేసేవాళ్లు ఎక్కువయ్యారు దేశంలో!
అవును. అన్నాను. పద్మ అవార్డులకి ఇక్కడేం విలువ లేదు అన్నాను. అది పాస్ట్. ఇప్పుడు హ్యాపీ అండ్ హంబుల్డ్ అంటున్నాను. ఇది ప్రెజెంట్. ‘నీ పాస్టు, నీ ప్రెజెంటు ఒకేలా ఉండాలి’ అనే వాళ్లకి సమాధానం చెప్పేంత తీరిక నాకు లేదు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాను. ఇప్పుడూ ఉన్నాను. ఐదున కరాచీలో లిటరేచర్ ఫెస్టివల్. దానికి వెళ్లాలి. దాని కోసం నోట్స్ రాసుకోవాలి. పెద్ద పని! ఇంకా పెద్ద పని.. ఫెస్టివల్‌లో నా పుస్తకం ‘ది బెస్ట్ థింగ్ ఎబౌట్ యు ఈజ్ యు’ రీడింగ్‌కి నన్ను నేను రెడీ చేసుకోవడం. నా లైఫ్ స్ట్రగుల్ అంతా ఆ పుస్తకంలో ఉంది. నేను ఇల్లొదిలి వెళ్లడం, వేషాల కోసం వెతుక్కోవడం, రైల్వే ప్లాట్‌ఫారాల మీద పడుకోవడం.. ఊరికే పద్దెనిమిది ముద్రణలు అవుతాయా? ఊరికే నాకు అవార్డులు వచ్చేస్తాయా? నన్ను నేను రెస్పెక్ట్ చేసుకోదగిన జీవితం నాకు ఉన్నందువల్లనే కదా ఈ గుర్తింపు అంతా. గుర్తింపు రాని రోజుల్లో నిరాశతో, కోపంతో నేను అన్నమాటలకు కూడా రెస్పెక్ట్ ఉంటుందనే జ్ఞానం ఈ క్రిటిక్స్‌కి లేకపోతే.. ఆ జ్ఞానమేదో కలిగించడానికి నేనెందుకు టైమ్ వేస్ట్ చేసుకోవాలి?
‘అసలు అనుపమ్‌కి ఈ అవార్డు ఎలా వచ్చింది?!’ అని.. వీళ్లదే ఇంకో క్వొశ్చన్ మార్క్! ఏం? ఎందుకు రాకూడదు? నాకేం పెయింటింగ్‌కీ, డాన్సింగ్‌కీ పద్మభూషణ్ ఇవ్వలేదే? అలా ఇచ్చి ఉంటే ముఖం దాచుకోడానికి ముంబైలో ఎక్కడైనా మంచి ప్లేస్ ఉందేమో వెతుక్కునేవాడిని. లేదా నేను పుట్టిన సిమ్లాకు వెళ్లిపోయేవాడిని. ‘నేను ఏమిటో అందుకు మాత్రమే’ వచ్చిన అవార్డు ఇది. కాబట్టి నేనెవ్వరికీ సమాధానం చెప్పక్కర్లేదు. నాకైతే ఒకటి బాగా అర్థమైంది. మనమంటే నచ్చనివాళ్లకు మనమేం సాధించినా లెక్కకాదు. మనమంటే ఇష్టపడేవాళ్లకు మనం ఏం సాధించామన్నది లెక్కకాదు.