సీనియర్ నటుడిపై కేసు నమోదు
ముంబై: భారత సైన్యంపై ఓ టీవీ చర్చ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురిపై ముంబైలో కేసు నమోదైంది. భారత సైన్యాన్ని ఆయన అవమానించారంటూ అంధేరి పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.
భారత్‌లో పాకిస్థాన్ కళాకారులు పనిచేయడాన్ని బలంగా సమర్థించిన ఓంపురి ఓ టీవీ చానెల్ చర్చలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సైన్యంలో చేరమని వాళ్లని ఎవరు బలవంతపెట్టారు. మా నాన్న సైన్యంలో ఉన్నారు. మేం సైనికులను చూసి గర్వపడతాం. కానీ భారత్-పాకిస్థాన్.. ఇజ్రాయెల్, పాలస్తీనాలాగా కావాలని మీరు కోరుకుంటున్నారా?’ అని ఆయన పేర్కొన్నారు. ‘సల్మాన్ ఖానా? ఇంకో ఖానా అన్నది కాదు. నేరుగా ప్రధాని మోదీజీ వద్దకే వెళ్లి.. పాకిస్థానీ నటుల వీసాలను రద్దు చేయించండి. 15, 20మంది ఆత్మాహుతి బాంబర్లుగా తయారుచేసి పాక్ మీదకు పంపండి’ అని ఓంపురి అన్నారు.
ఓంపురి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. బాలీవుడ్ సినీ ప్రముఖులు అనుపమ్ ఖేర్, అశోక్ పండిట్ సహా పలువురు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. భారత సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదని అన్నారు.