ఆర్మీ నన్ను శిక్షించాలి : ఓం పురీ
అమరవీరులైన భారత ఆర్మీ జవాన్లపై తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సీనియర్ నటుడు ఓం పురి క్షమాపణ చెప్పుకున్నారు.
అమరవీరులైన భారత ఆర్మీ జవాన్లపై తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సీనియర్ నటుడు ఓం పురి క్షమాపణ చెప్పుకున్నారు. ఆర్మీ తనను శిక్షించాలని, ఆర్మీ జోన్కు పంపించి యుద్ధం ఎలా చేయాలో నేర్పించాలని క్షమాపణ ప్రకటనలో తెలిపారు. భారత జవాన్లను ఎవరు ఆర్మీలో చేరమన్నారు? ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమన్నారంటూ ఓ న్యూస్ చానల్ చర్చాకార్యక్రమంలో ఓం పురి రెచ్చిపోయారు. అమరవీరులైన ఆర్మీ జవాన్లపై ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఓం పురిపై పోలీసు స్టేషన్లలో కేసు కూడా నమోదైంది. ఈ కేసు నమోదు అనంతరం ఓం పురికి తన తప్పు తెలుసొచ్చినట్టై వెంటనే ఆర్మీకి క్షమాపణ చెప్పారు.
తనది క్షమించరాని నేరమని, వెంటనే తనని శిక్షించమని ప్రాదేయపడ్డారు. మొదట తాను ఉడి ఉగ్రఘటనలో అమరవీరుల కుటుంబసభ్యులకు క్షమాపణ చెబుతానని చెప్పారు. ఒకవేళ వారు క్షమిస్తే, దేశాన్ని, ఆర్మీని క్షమాపణ కోరతానన్నారు. తనకు తాను కూడా ఓం పురి భారీ శిక్షే విధించుకున్నారు. తనని యుద్ద ప్రాంతంలోకి పంపాలని, దేశ రక్షణలో ఆర్మీజవాన్లకు సహకరిస్తానని చెప్పారు. ఆయుధాలను ఎలా వాడాలో ఆర్మీ తనకు నేర్పించాలని, ఎక్కడైతే ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను దేశానికి త్యాగం చేశారో ఆ ప్రాంతంలోకి తనను పంపించాలని ప్రాదేయపడ్డారు. క్షమించాలని మాత్రమే తాను కోరుకోవడం లేదని, తనను కచ్చితంగా శిక్షించాలని కోరుతున్నట్టు ఓం పురి తెలిపారు.
పాకిస్తానీ నటులపై భారత్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐఎమ్పీపీఏ)నిషేధం విధించడంతో ఆయన ఆర్మీ జవాన్లపై అవమానకర వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి. పలువురు బాలీవుడ్ నటులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. జవాన్లను ఎవరైనా ఆర్మీలో చేరమని బలవంతం పెట్టారా? అని ఓం పురి వ్యాఖ్యానించారు.