హక్కుల ఉద్యమ స్ఫూర్తి అస్మా | Asma Jahangir an Inspiration to the rights movement | Sakshi
Sakshi News home page

హక్కుల ఉద్యమ స్ఫూర్తి అస్మా

Published Tue, Feb 13 2018 4:03 AM | Last Updated on Tue, Feb 13 2018 4:03 AM

Asma Jahangir an Inspiration to the rights movement - Sakshi

అస్మా జహంగీర్‌ (ఫైల్‌ ఫొటో)

నియంతలు దేశాన్ని ఉక్కు పిడికిట్లో బంధించినప్పుడూ... గాలి సైతం భయాన్నే వీస్తున్నప్పుడూ... ఎవరూ నోరెత్తే సాహసం చేయనప్పుడూ ఒక ధిక్కార స్వరం విని పించడానికి కేవలం గుండె ధైర్యం మాత్రమే సరిపోదు. ఆ గుండె నిండా అస హాయులపై అపారమైన ప్రేమాభిమానాలుండాలి. వారికోసం ప్రాణాలొడ్డేంత తెగింపు ఉండాలి. ఆ మాదిరి ధైర్యాన్ని, తెగువనూ కేవలం పద్దెనిమిదేళ్ల వయసు లోనే సొంతం చేసుకుని, రాజీలేని పోరాటాలకు నిలువెత్తు సంతకంలా ఖ్యాతి గడిం చిన పాకిస్తాన్‌ మానవ హక్కుల నాయకురాలు అస్మా జహంగీర్‌ శనివారం కన్ను మూశారు.

అస్మా అంటే ఉర్దూలో మహోన్నతమని అర్ధం. న్యాయవాదిగా, క్రియా శీల కార్యకర్తగా, ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా, మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కుల కోసం అలుపెరగని పోరు చేసిన యోధురాలిగా అస్మా సార్ధక నామధేయు రాలయ్యారు. దేన్నయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం, పోరాడటానికి సిద్ధపడటం మొదటినుంచీ ఆమె నైజం. ఈ క్రమంలో పర్యవసానాల గురించి ఒక్క క్షణం కూడా ఆమె ఆలోచించలేదు. అది బలూచిస్తాన్‌ కావొచ్చు, ఆక్రమిత కశ్మీర్‌ కావొచ్చు. న్యాయబద్ధమైన ఉద్యమాలైనప్పుడు వాటికి అండగా నిలబడటానికి ఆమె వెనకాడలేదు. ఆ రెండుచోట్లా వేలమంది యువకుల్ని పాకిస్తాన్‌ సైన్యం కను సన్నల్లో పనిచేసే గూఢచార సంస్థ ఐఎస్‌ఐ మాయం చేసినప్పుడు వారి ఆచూకీ తెల పాలంటూ సాగిన ఉద్యమానికి తోడ్పాటునందించడంతోపాటు అక్కడి సుప్రీంకో ర్టులో ఆ యువకుల కుటుంబాల తరఫున పోరాడారు.

ఉదారవాదులకు చాన్నాళ్లక్రితమే దక్షిణాసియా దేశాల్లో సంకట స్థితి ఏర్ప డింది. ఉద్యమిస్తున్నవారి తరఫున పోరాడేవారికి ముద్రలేయడం అన్ని దేశాల్లోనూ రివాజుగా మారింది. శ్రీలంకలో తమిళ టైగర్ల అణచివేతను ప్రశ్నించినవారిని అప్పటి రాజపక్సే ప్రభుత్వం ఉగ్రవాదులుగా ముద్రేసింది. ఇప్పుడు మయన్మార్‌లో రోహింగ్యాల ఊచకోతను నిలదీస్తున్నవారిపైనా అక్కడి ప్రభుత్వం అనేక కేసులు బనాయించి హింసిస్తోంది. మన దేశంలో కశ్మీర్‌లో హక్కుల ఉల్లంఘనల్ని ప్రశ్నిస్తే ఉగ్రవాద సమర్ధకులుగా, పాకిస్తాన్‌ అనుకూలురుగా ఎలా ముద్రేస్తారో... పాకి స్తాన్‌లో అస్మా జహంగీర్‌పై కూడా అక్కడి పాలకులు అటువంటి నిందారోపణలే చేశారు. ఆమెను భారత గూఢచార సంస్థ ‘రా’ ఏజెంటుగా అభివర్ణించి ఇబ్బందులు పెట్టాలని చూశారు. అయినా అస్మా కొంచెం కూడా బెదరలేదు. ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిన ప్రతి సందర్భంలో ఆమె ముందుండి పోరాడారు. మైనారిటీలను వేధించడం కోసం తీసుకొచ్చిన దైవ దూషణ చట్టాన్ని ఖండించడంతో వదిలిపెట్ట లేదు. గరిష్టంగా మరణశిక్ష విధించడానికి ఆస్కారమున్న ఆ చట్టం కింద అరెస్టయిన వందలమంది తరఫున న్యాయస్థానాల్లో వాదించారు. రెండు మూడు కేసుల్లో కింది కోర్టులు విధించిన మరణశిక్షలు సుప్రీంకోర్టు రద్దు చేయడానికి ఆమె వాదనా పటిమే కారణం. ఆ తర్వాత ఆమెకు అనేక బెదిరింపులొచ్చాయి. కొందరు దుండ గులు ఆమెపై హత్యాయత్నం కూడా చేశారు.

పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం ఎప్పుడూ సురక్షితంగా లేదు. అక్కడ పౌర ప్రభు త్వాల పాలన కంటే సైనిక పాలనే అధికంగా సాగింది. మతాన్ని అడ్డం పెట్టుకుని, మతతత్వాన్ని పెంచి పోషించి తమ పాలనను సుస్థిరం చేసుకోవడానికి సైనిక నియంతలు ప్రయత్నించారు. ఆ క్రమంలో సమాజంలో ఛాందసవాదాన్ని పెంచి పోషించారు. జనరల్‌ అయూబ్‌ఖాన్‌ మొదలుకొని జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌ వరకూ ఇవే పోకడలు. అలాంటి నియంతలను ఎదుర్కొనడం సామాన్యం కాదు. నియంతల్ని ప్రశ్నిస్తే మతాన్ని ప్రశ్నించినట్టు... వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే మత ద్రోహానికి పాల్పడినట్టూ చిత్రించే చోట న్యాయం కోసం నిలబడటం ఎంత ప్రాణాంతకమో అస్మా జీవితం చెబుతుంది. ప్రభుత్వాలు ఆమెపై దొంగ కేసులు బనాయిస్తే, ముల్లాలు ఆమెపై ఫత్వాలు జారీచేశారు. అన్నిటినీ ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. జనరల్‌ యాహ్యాఖాన్‌ పాలనలో తన తండ్రిని అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో పోరాడిన అస్మా జనరల్‌ జియా ఉల్‌ హక్‌ పాలనను ఖండిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వీధుల్లో పోరాడారు. జైలుకెళ్లారు. జనరల్‌ ముషార్రఫ్‌ పాలనలో ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు.

సల్మా మర్యాదస్తురాలిగా మిగిలిపోవాలనుకోలేదు. మీడియా తనను ఆకాశాని కెత్తేసినంత మాత్రాన పొంగిపోలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తెకర్‌ చౌధరిని ముషార్రఫ్‌ ప్రభుత్వం తొలగించినప్పుడు జరిగిన న్యాయవాదుల ఉద్య మంలో ఆమెదే ప్రధాన పాత్ర. ఆయనకు తిరిగి ఆ పదవి దక్కాక వెలువరించిన తీర్పులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించినప్పుడు వాటిని ప్రశ్నించడా నికి వెనకాడలేదు. తనను పాలకపక్షాల ఏజెంటుగా పలు సందర్భాల్లో నిందారోప ణలు చేసిన ఎంక్యూఎం అధినేత అల్తాఫ్‌ హుస్సేన్‌పై లాహోర్‌ హైకోర్టు ఆంక్షలు విధించినప్పుడు ఆయన తరఫున సుప్రీంకోర్టులో పోరాడి ఆ ఆంక్షలు రద్దయ్యేం దుకు కృషి చేశారు. అల్తాఫ్‌ కేసును ఎవరూ తీసుకోరాదన్న న్యాయవాదుల తీర్మా నాన్ని ఆమె బేఖాతరు చేశారు.    

అస్మా కార్యక్షేత్రం పాకిస్తాన్‌ గడ్డకు మాత్రమే పరిమితమై లేదు. భారత్, పాకిస్తాన్‌లు రెండూ మిత్ర దేశాలుగా మెలగాలని, ఉపఖండంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడాలని ఆమె ఆశించారు. అందుకోసం ప్రజాభిప్రాయాన్ని కూడ గట్టడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పలుమార్లు మన దేశం సందర్శించి ఇక్కడి సభల్లో మాట్లాడారు. తనను భారత్‌ ఏజెంట్‌గా అభివర్ణిస్తున్నా ఈ కృషిలో ఆమె వెనక్కి తగ్గలేదు. పెషావర్‌ పాఠశాలపై ఉగ్రవాదులు దాడిచేసి 148 మందిని పొట్టనబెట్టుకున్నప్పుడు ఈ దురంతంలో అసలు దోషులు ఉగ్రవాదులకు అండ దండలిచ్చిన ప్రభుత్వాలేనని ఆమె నిర్మొహమాటంగా చెప్పారు. తన కోసం, తన కుటుంబం కోసం కాక చివరి వరకూ బలహీనుల పక్షాన పోరాడిన సల్మా జహం గీర్‌ పాక్‌లో మాత్రమే కాదు... వర్ధమాన దేశాల్లోని వారందరికీ  స్ఫూర్తినిస్తూనే ఉంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement