
విక్రమ్ భట్ రాయని డైరీ
నేనెప్పుడూ దేవుణ్ణి చూడలేదు. అయినా దేవుణ్ణి నమ్ముతాను! దెయ్యాన్ని కూడా చూడలేదు. అయినా దెయ్యాన్నీ నమ్ముతాను. కనిపించని దేవుణ్ణి, కనిపించని దెయ్యాన్ని నమ్ముతున్నప్పుడు... కళ్లెదుట ఇంత ప్రేమను పెట్టుకుని, ఆ ప్రేమలో నేను ఎందుకని నమ్మకంగా నిలబడలేకపోతున్నాను?!
ప్రతి స్త్రీలోనూ నాకు ప్రేమే కనిపిస్తుంది. స్త్రీ నవ్వులో, స్త్రీ చూపులో, స్త్రీ మాటలో, స్త్రీ కోపంలో, స్త్రీ ద్వేషంలో కూడా ప్రేమే! స్త్రీలోని అన్ని ప్రేమల్నీ నేను ఫీల్ అవుతాను. కానీ స్త్రీలోని ఏ ఒక్క ప్రేమలోనూ ఉండిపోలేను! స్త్రీలో నాకు కనిపిస్తున్న ప్రేమలో దేవుడు, దెయ్యం అనే రెండు పార్ట్‌లు కనుక ఉన్నట్లయితే, బహుశా దెయ్యం పార్ట్ నేనై ఉంటాను. అందుకే స్త్రీ ప్రేమలో నేను ఎక్కువసేపు ఉండలేను. దేవుడున్న చోట దెయ్యం ఉండలేదు కదా. అలానేమో!
‘‘ఇంకా నిద్రపోలేదా డాడీ...’’ అంటూ వచ్చింది కృష్ణ. నా కూతురు! తను అచ్చంగా నాలాగే ఉంటుంది. తన కళ్లు నా కళ్లలాగే ఉంటాయి.
అదితి మా ఇద్దర్నీ ఎప్పుడైనా కలవడానికి వచ్చివెళుతుంది. నా భార్య, నా చైల్డ్‌హుడ్ స్వీట్‌హార్ట్ అదితి. నా మీద కోపంతో కూతుర్నీ కాదనుకుని వెళ్లిపోయింది. ‘‘అమ్మ గుర్తొస్తోందా డాడీ?’’... కృష్ణ అడిగింది. తనకు అమ్మ గుర్తుకొచ్చిన ప్రతిసారీ ‘అమ్మ గుర్తొస్తోందా డాడీ’ అని నన్ను అడగడానికి వస్తుంది. ‘‘అవున్రా... ’’ అని చెప్పాను. అబద్ధం చెప్పాను. నిజానికి అదితి ఒక్కటే నాకు గుర్తుకు రావడం లేదు. సుస్మిత, అమీషా కూడా గుర్తొస్తున్నారు. అంతరాత్రప్పుడు ఏ స్మృతీ, ఏ సందర్భమూ లేకుండా నా పూర్వపు స్త్రీమూర్తులంద రి ఔన్నత్యాన్నీ గుర్తు చేసుకుంటూ దిగులు మొహం వేసుకుని కూర్చున్నాను.
గుడ్‌నైట్ చెప్పి వెళ్లింది కృష్ణ. గుడ్‌నైట్ అనే మాటంటే నాకు భయం. అది నాకు ‘గుడ్‌బై’ లా వినిపిస్తుంది. అదితి నాకు గుడ్‌బై చెప్పి వెళుతున్నప్పుడు ఇదిగో... ఈ ఆరో అంతస్తులోంచే కిందికి దూకి చచ్చిపోదామనిపించింది. కానీ బతికాను. చావు ఆలోచన నుంచి స్త్రీ ప్రేమే నన్ను బతికించిందేమో! అది అదితిపై ప్రేమా, ఇంకే స్త్రీ మీదనైనా ప్రేమా అన్నది చెప్పలేను.
‘‘ఎందుకు విక్రమ్.. బయటి స్త్రీల ప్రేమ కోసం అంతగా వెంపర్లాడుతుంటావ్?’’ అని అడిగేది అదితి. ఏం చెప్పను? చెబితే, ‘నేను వాళ్లతో ఉన్నప్పుడు నువ్వు కూడా నాకు బయటి స్త్రీ లాగే కనిపిస్తావ్’ అని చెప్పాలి. చెప్పలేను. దాచేస్తాను. ఒక స్త్రీ దగ్గర ఇంకో స్త్రీని దాచేస్తాను. ఆ గిల్ట్ నన్ను తినేస్తుంది. ఆ దాపరికం నన్ను ఒంటరిని చేస్తుంది.
ప్రేమించిన స్త్రీని హర్ట్ చెయ్యడమంత హీనత్వం లేదు మగజన్మకు. నా లైఫ్‌ని రీబూట్ చేసుకునే అవకాశమే వస్తే... క్షమించమని నేను వేడుకోవలసిన స్త్రీలు ఎప్పటికప్పుడు పుట్టుకు వస్తూనే ఉంటారేమో.. నా గత జన్మలనుంచి కూడా!
మాధవ్ శింగరాజు