కోట్ల రూపాయలు పోసి నిర్మిస్తున్న తమ సినిమాలకు జనాదరణ కరువవుతున్నదని ఈమధ్య చిత్ర నిర్మాతలు వాపోతున్నారు. నిజ జీవితంలోనే క్షణక్షణానికీ ఊహాతీతమైన, ఉత్కంఠభరితమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పుడు సామాన్య పౌరులకు ఇక వినోదం కోసం, సస్పెన్స్ థ్రిల్లర్‌ల కోసం థియేటర్లకు పోవలసిన అవసరమేముంటుంది? ఇప్పుడు ఊహించని విధంగా రాజుకుని ఎన్డీయే సర్కారును చుట్టుముట్టిన ‘లలిత్ మోదీ’ వివాదం అన్ని విధాలా ఉత్కంఠభరితమైన సినిమాను పోలి ఉంది. అయిదేళ్లక్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు కమిషనర్‌గా పనిచేసి ఎన్నో అభియోగాలు ఎదుర్కొని పరారైన లలిత్ మోదీకి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ తన హోదాను దుర్వినియోగం చేసి సాయపడ్డారన్నది ప్రస్తుతం వెల్లువెత్తుతున్న ఆరోపణల సారాంశం. లలిత్ మోదీపై వచ్చిన అభియోగాలు సాధారణమైనవి కాదు.
ఆయన ఐపీఎల్‌లో బెట్టింగ్‌లకు పాల్పడ్డాడని, వందల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని, విదేశీ మారకద్రవ్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించాడని, క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల హక్కులను కట్టబెట్టాడని, తన సన్నిహితులతో కంపెనీలను స్థాపించి వాటికి అనుకూలంగా రిగ్గింగ్‌కు పాల్పడి బిడ్‌లు దక్కేలా చేశాడని ఆ ఆరోపణల సారాంశం. వాటిపై ఆదాయపు పన్ను శాఖ మొదలుకొని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) వరకూ వివిధ సంస్థలు దర్యాప్తు మొదలెట్టడం.. ఈ మొత్తం వ్యవహారం న్యాయస్థానంలో విచారణకు రావడం పర్యవసానంగా లలిత్ మోదీ దేశం విడిచివెళ్లిపోయాడు. ఆయన ప్రత్యర్థులు చెబుతున్నట్టు ఆయనపై ఇంటర్‌పోల్ నోటీసులు జారీచేసిందా... లలిత్ న్యాయ వాదులు చెబుతున్నట్టు అదంతా అబద్ధమా అన్నది పక్కనబెడితే వందల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ వేరే దేశం పరారైన వ్యక్తికి కేంద్ర కేబినెట్‌లోని సీనియర్ మంత్రి ఒకరు అన్ని నిబంధనలనూ బేఖాతరు చేసి సాయపడటం ధర్మమా అన్నదే ప్రశ్న.
నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడి ఏడాది కాలమవుతున్నది. బీజేపీ స్వయంగా చెప్పుకోవడమే కాదు... దాదాపు అన్ని వర్గాల పౌరులూ దాన్ని ఒకే ఒక విషయంలో ఏకగ్రీవంగా ప్రశంసిస్తున్నారు. మిగిలిన అంశాల మాటెలా ఉన్నా అది ఈ పన్నెండు నెలలకాలంలోనూ అవినీతి రహిత పాలన అందించిందని మెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో ప్రత్యర్థులు సైతం వేలెత్తి చూపించడానికి సాహసించలేదు. అలాంటి ప్రభుత్వంపై ఉరుము లేని పిడుగులా ఇప్పుడు లలిత్ మోదీ వివాదం వచ్చిపడింది. ఈ వివాదం రేకెత్తడం మాటలా ఉంచి... దాని విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు గానీ, ఇస్తున్న సంజాయిషీలుగానీ అందరికీ మరింత దిగ్భ్రాంతికలిగిస్తున్నాయి.
వివాదం వెల్లడయ్యాక ఇచ్చిన ట్వీట్లలో సుష్మా తనను తాను గట్టిగా సమర్థించుకున్నారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన భార్యకు పోర్చుగల్‌లో శస్త్ర చికిత్స జరిపించాల్సిన అవసరం ఉన్నదని, అందుకోసం తాను అక్కడికెళ్లి సంతకం చేయాల్సి ఉంటుందని లలిత్ మోదీ నిరుడు జూలైలో కోరడంవల్ల సాయం అందించానని ఆమె చెబుతున్నారు. ఆయన పాస్‌పోర్టును రద్దుచేశామని, ఆయనకు ఎలాంటి ప్రయాణ పత్రాలు జారీచేసినా అది ఇరుదేశాల సంబంధాలనూ దెబ్బతీస్తుందని 2010లో భారత ప్రభుత్వంనుంచి బ్రిటన్‌కు సందేశం వెళ్లింది. గత అయిదేళ్లలోనూ ఈ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. వివిధ సంస్థల దర్యాప్తునకు ఆయన ఏనాడూ సహకరించలేదు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని నిరూపించే ఆధారాలేవీ ఆయన అందించలేదు. అయినప్పటికీ ఆయన ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నందున వీటన్నిటినీ పక్కనబెట్టి చేయూతనందించాలని సుష్మా స్వరాజ్ భావిస్తే భావించవచ్చు. కానీ అందుకు కూడా ఒక విధానమంటూ ఉంటుంది. విదేశాలతో సంబంధాల విషయంలో ఒక ప్రొటోకాల్ ఉంటుంది. ఆయన దరఖాస్తును స్వీకరించమని బ్రిటన్‌లోని భారత హైకమిషనర్‌ను కోరవచ్చు. దాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వానికి పంపితే...కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆర్థిక శాఖ ఆ అంశాన్ని పరిశీలించి తమ వైఖరిని వెల్లడించాక అందుకు అనుగుణంగా బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సూచనైనా చేయవచ్చు. ఈ ప్రక్రియ అంతా ప్రారంభించడానికి ముందు... భారత్‌కు తిరిగొచ్చి చట్టానికి సహకరిస్తానని, తనపై వచ్చిన ఆరోపణల విషయంలో విచారణకు తోడ్పడతానని ఆయననుంచి హామీ తీసుకుని ఉంటే సుష్మా ప్రదర్శించిన ‘మానవతా దృక్పథానికి’ అర్థం ఉండేది. అయితే, ఇదంతా చివరకు ఎటు దారితీస్తుందోనని జంకి... విమర్శలు ఎదుర్కొనవలసి వస్తుందని సందేహించి మొత్తం వ్యవహారాన్ని దాచడానికి ప్రయత్నించినట్టు కనబడుతోంది.
సాధారణ పరిస్థితుల్లో అయితే సుష్మా స్వరాజ్ చర్య ఇంత వివాదాస్పదం కాకపోయేది. ఈ విషయంలో బ్రిటన్‌లో ఉండే భారత హైకమిషనర్ కార్యాలయాన్ని సుష్మా ఏ దశలోనూ సంప్రదించకపోవడమే ఉన్న అనుమానాలను మరింతగా పెంచింది. ఇందులో మరో కోణం ఉంది. సుష్మా సాయం అందజేసిన నెల్లాళ్లకు... అంటే నిరుడు ఆగస్టులో ఢిల్లీ హైకోర్టు ఆయన పాస్‌పోర్టును పునరుద్ధరిస్తూ ఆదేశాలిచ్చింది. సాంకేతికంగా చూస్తే లలిత్‌కు సుష్మా స్వరాజ్ సాయపడిన సమయానికి ఆయన పాస్‌పోర్టు రద్దయి ఉంది కనుక లలిత్ భారతీయ పౌరుడు కారు. కనుక దానిద్వారా సమకూరే హక్కులు ఆయనకు లభించవు. అలాంటపుడు ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం, సిఫార్సు చేయడం దోషమవుతుంది. మీదుమిక్కిలి సుష్మా కుమార్తె లలిత్ తరఫున న్యాయవాదిగా వ్యవహరించి ఉన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమ అధికారాలను వినియోగించేటపుడు...మరీ ముఖ్యంగా వివాదాల్లో ఉన్నవారికి తోడ్పడేముందూ ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో ఈ ఉదంతం వెల్లడిస్తున్నది. ఈ పెనుతుఫాను నుంచి ఎన్డీయే సర్కారు ఎలా బయటపడుతుందో వేచిచూడాలి.
పెను తుఫానులో కేంద్రం
Published Tue, Jun 16 2015 12:16 AM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM
Advertisement