'మోదీ'పై చర్చకు సిద్ధం'
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీ అంశంపై ఈ రోజు తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ మాట్లాడారు. రాజ్యసభలో కూడా ఇదే విషయాన్ని వెల్లడించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పినట్లు తెలిపారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
అయితే ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీ ... ఆ సంస్థ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 20 - 20 క్రికెట్ టోర్నీ ఐపీఎల్ నిర్వహణలో తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో పాటు ఈడీ సహా పలు జాతీయ దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటూ ఆయన విదేశాలకు పరారైయ్యారు. దాంతో భారత్ ప్రభుత్వం ఆయనపై బ్లూ కార్నర్ నోటుసులు జారీ చేసింది. లండన్ ఉన్న లలిత్ మోదీ తన భార్యకు వైద్య చికిత్స నిమిత్తం పోర్చుగల్ వెళ్లాల్సి వచ్చింది.
వీసా మంజూరు కోసం ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ను సంప్రదించారు. ఆమె బ్రిటన్లోని ఉన్నతాధికారులతో మాట్లాడి... లలిత్ మోదీ సమస్యను పరిష్కరించారు. ఆ విషయం బయటకు పొక్కడంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. బీజేపీపై ఎదురుదాడికి దిగింది. మోసానికి పాల్పడిన లలిత్ మోదీకి ఎలా సహాయం చేశారంటూ సుష్మా స్వరాజ్పై కాంగ్రెస్ ప్రశ్నలు సంధించింది. దాంతో తాను మానవత్వంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సుష్మా ప్రకటించారు. కానీ సుష్మా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.