సునాయిక | special story on sushma swaraj by vaka manjula reddy | Sakshi
Sakshi News home page

సునాయిక

Published Mon, Nov 26 2018 3:35 AM | Last Updated on Thu, Jul 11 2019 8:48 PM

special story on sushma swaraj by vaka manjula reddy - Sakshi

సకల సుగుణ నాయిక సుష్మాస్వరాజ్‌! వాగ్ధాటి, సుపరిపాలన, సత్వర ప్రతిస్పందన, సంస్కృతి, సంప్రదాయం, మానవత కలగలిసిన రాజనీతిజ్ఞురాలు.. సుగుణాలకే వన్నెతెచ్చిన నాయిక..  సునాయిక..సుష్మాస్వరాజ్‌.

నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. ప్రత్యర్థి పార్టీలు కూడా గౌరవించే వ్యక్తిత్వం. దేశ రాజధానికి... ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ. మూడు సార్లు ఎమ్మెల్యే... ఏడుసార్లు ఎంపీ. ‘బెస్ట్‌ లవ్‌డ్‌ పొలిటీషియన్‌’.. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రశంస. ‘బెస్ట్‌ అవుట్‌స్టాండింగ్‌ పార్లమెంటేరియన్‌’.. మన దేశం. కొత్త తరం పొలిటీషియన్లకు రోల్‌మోడల్‌. అన్నీ కలిస్తే.. సుష్మా స్వరాజ్‌.

ఓ రోజున సుష్మా స్వరాజ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌కి ‘మేడమ్‌ ప్లీజ్‌ హెల్ప్‌’ అంటూ ఒక ట్వీట్‌ వచ్చింది. అది దోహా ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన తన సోదరుడిని రక్షించమని కోరుతూ ప్రన్షు సింఘాల్‌ అనే వ్యక్తి చేసిన ట్వీట్‌. మూడవ రోజునే ‘నా సోదరుడు అంకిత్‌ క్షేమంగా విడుదలయ్యాడు. కృతజ్ఞతలు’ అంటూ మరో ట్వీట్‌ చేశాడు ప్రన్షు సింఘాల్‌. అంతకంటే ముందు... బెర్లిన్‌లో పాస్‌పోర్టు, డబ్బు ఉన్న హ్యాండ్‌ బ్యాగ్‌ను పోగొట్టుకున్న అగర్త అనే అమ్మాయి నుంచి సుష్మకు ఒక ట్వీట్‌ వచ్చింది. ఆ మరుసటి రోజే ‘ఈ రోజు ఇండియన్‌ ఎంబసీకి వెళ్లి పాస్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక అనుమతి తీసుకున్నాను. కృతజ్ఞతలు’ అంటూ ఎంబసీ ఉద్యోగుల పేర్లతో సహా మరో ట్వీట్‌ చేసింది అగర్త.

మరికొన్నాళ్లకు.. దేవ్‌ తంబోలి అనే వ్యక్తి నుంచి ఓ ట్వీట్‌.. ‘మా చెల్లెలు ఉద్యోగం కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి వెళ్లింది. ఆమెను ఓ గదిలో బంధించారు. రక్షించండి’ అంటూ తన ఫోన్‌ నంబరు కూడా ఇచ్చాడతడు. కొన్ని గంటల్లోనే దేవ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌కి ‘యుఎఈ అంబాసిడర్‌ని సహాయం అడిగాను. ఆయన మీతో మాట్లాడతారు, వివరాలు చెప్పండి’ అని భారత విదేశాంగ మంత్రి నుంచి రిప్లయ్‌ ట్వీట్‌ వచ్చింది. ఆ రోజు సాయంత్రానికే ‘దుబాయ్‌ పోలీసుల సహాయంలో మీ చెల్లెల్ని రక్షించాం. ఇప్పుడామెను దుబాయ్‌లోని ఇండియన్‌ ఎంబసీ షెల్టర్‌కు చేర్చడమైంది’ అని దేవ్‌కి ట్వీట్‌ చేశారు భారత విదేశాంగ మంత్రి.

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకే కాదు, మనదేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకూ అంతే వేగంగా సుష్మ నుంచి సేవలు అందుతున్నాయి. సుజాన్నె లుగానో అనే డచ్‌ మహిళ తన సోదరి సబినె హార్మెస్‌ భారత పర్యటనలో రిషికేశ్‌లో తప్పి పోయిందని ట్వీట్‌ చేసింది. సోదరిని గుర్తుపట్టడానికి ఆనవాళ్లను కూడా వివరించింది సుజాన్నె. ఆ ట్వీట్‌కు బదులుగా ‘మా అధికారులు సబినె హార్మెస్‌ను కనుగొన్నారు. ప్రస్తుతం ఆమె స్వతంత్ర ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటోంది. డెహ్రాడూన్‌లోని పాస్‌పోర్టు అధికారి ఆమెను స్వయంగా కలిశారు’ అని ఒక ట్వీట్‌. మరి కొన్ని గంటలకు ‘ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఆమె మానసికంగా కూడా స్థిమితంగా లేదు. నిర్మల్‌ జాలీ గ్రాంట్‌ హాస్పిటల్‌’లో చేర్చి చికిత్స చేస్తున్నారు’ అని మరో ట్వీట్‌ చేశారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌.

ఇవి మాత్రమే కాదు.. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల వీడియో చూసి మనోవేగంతో స్పందించారు సుష్మ. ఆపదలో ఉన్న వారిని విడిపించారు, మరణించిన వారిని వారి బంధువులకు అప్పగించారామె. ఇవన్నీ భారతీయులుగా మన ఛాతీ ఉప్పొంగే సేవలైతే... సోనూ అనే చిన్నారిని రక్షించడంలో ఆమెలో అమ్మతనం దేశం హృదయాన్ని తాకింది. సోనూ నాలుగేళ్ల కుర్రాడు. ఢిల్లీలో ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా  2010లో ఇద్దరు మహిళలు ఆ చిన్నారిని అపహరించుకుని వెళ్లారు. సుష్మ దృష్టికి వచ్చిన తర్వాత సోనూ కోసం శోధించి 2016లో బంగ్లాదేశ్‌లోని షెల్టర్‌ హోమ్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు.

ఆ ప్రభుత్వంతో సంప్రదించి సోనూను ఇండియాకు రప్పించి అతడి తల్లిదండ్రులకు అప్పగించినప్పటి దృశ్యం దేశ ప్రజల గుండెల్ని కదలించింది ఆ స్థానంలో మగవాళ్లు ఉంటే ఆ సందర్భం కర్తవ్య నిర్వహణలో భాగంగానే ఉండేది. మీడియా కోసం ఫొటోకి పోజిచ్చి, పిల్లాడిని అమ్మానాన్నలకు అప్పగించేవాళ్లు్ల. సుష్మాస్వరాజ్‌ మంత్రిగా మాత్రమే కాదు, ఓ తల్లిలా కూడా స్పందించారు. సోనూను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. తన బిడ్డే తప్పిపోయి తిరిగి దగ్గరకు చేరితే తల్లిపేగు కన్నీరు పెట్టుకున్నట్లు స్పందించారామె. ఇలా ఆమెలో దేశాన్ని తల్లిలా భావించే లక్షణం కూడా ఆమెతోపాటే పెరిగింది. పాలకులు ప్రజలను బిడ్డల్లా పాలించాలనే తత్వాన్ని ఆమెకు పొలిటికల్‌ సైన్స్‌ నేర్పించింది.

హరియాణా అమ్మాయి
సుష్మాస్వరాజ్‌ పూర్వికులు లాహోర్‌ (పాకిస్థాన్‌)లోని ధరంపురా నుంచి హరియాణాకు వచ్చారు. తండ్రి హర్‌దేవ్‌ శర్మ ఆర్‌ఎస్‌ఎస్‌లో క్రియాశీలక సభ్యుడు. అంబాలా కంటోన్మెంట్‌లో స్థిరపడ్డారాయన. సుష్మ బాల్యం, కాలేజ్‌ చదువు అంతా అంబాలాలోనే. వరుసగా మూడేళ్లు బెస్ట్‌ ఎన్‌సీసీ క్యాడెట్‌ అవార్డు నుంచి బెస్ట్‌ హిందీ స్పీకింగ్‌ అవార్డు, బెస్ట్‌ స్టూడెంట్‌ అవార్డు, సంగీతం, సాహిత్యం, లలిత కళలు, నాటకాలు, వక్తృత్వం... అన్నింటిలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది. పంజాబ్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బి చదివే రోజుల్లో విద్యార్థి పరిషద్‌లో చురుగ్గా పాల్గొంటున్నప్పుడు ఆమె ఊహించి ఉండరు.. దేశంలో ఇంతటి క్రియాశీలకమైన రాజకీయవేత్తగా మారతానని. లా కోర్సు పూర్తయిన తర్వాత అందరిలాగానే న్యాయవాదిగా కెరీర్‌ ప్రారంభించారు. జార్జి ఫెర్నాండెజ్‌ లీగల్‌ డిఫెన్స్‌ టీమ్‌లో చేరడం... ఆమె జీవితాన్ని మలుపు తిప్పి, ఇప్పుడు మనం చూస్తున్న గమ్యానికి చేర్చింది.

సుష్మ... స్వరాజ్‌
1975, జూలై 13. అప్పటి వరకు ఆమె కేవలం సుష్మ, ఆ రోజు నుంచి సుష్మా స్వరాజ్‌. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ.. ఫెర్నాండెజ్, జయప్రకాశ్‌ నారాయణ్‌లతోపాటు సుష్మ ఉద్యమించిన సమయంలోనే  ఫెర్నాండెజ్‌ టీమ్‌లో చేరి, పరిచయం అయిన  న్యాయవాది కౌశల్‌ స్వరాజ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. తర్వాత రెండేళ్లకు హరియాణా శాసనసభకు ఎన్నికలు వచ్చాయి. జనతాపార్టీకి చురుకైన అభ్యర్థులు కావాల్సి వచ్చింది. పార్టీ నాయకులకు సుష్మాస్వరాజ్‌ కనిపించారు. పాతికేళ్లకే ఆమె శాసన సభకు పోటీ చేయడం, గెలవడం, దేవీలాల్‌ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేయడం జరిగిపోయాయి. మరో రెండేళ్లకే పార్టీ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు.

విప్లవాత్మక నిర్ణయాలు
సుష్మాస్వరాజ్‌ దేశంలో అనేక రాజకీయ అనిశ్చితులకు ప్రత్యక్ష సాక్షి. ఎమర్జెన్సీ నుంచి సంకీర్ణ యుగం వరకు, పదమూడు రోజుల ప్రభుత్వం వంటి ఒడిదుడుకులను కూడా చూశారు. సమాచార ప్రసార మంత్రిగా పార్లమెంట్‌ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరు ఎయిమ్స్‌ల స్థాపన ఆమె చొరవే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్‌ల తనిఖీ వంటి సాహసోపేతమైన అడుగులు కూడా వేశారు. అప్పట్లో ఉల్లిపాయలు కేజీ ఐదు నుంచి యాభై రూపాయలను చేరడం భారత దేశం ఊహించని పరిణామం. ఆ ఫలితాన్ని ఆమె ఢిల్లీ ఎన్నికలలో మోయాల్సి వచ్చింది.

భారతీయత– విదేశీయత
సుష్మాస్వరాజ్‌ రాజకీయ జీవితం ఇందిరా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా మొదలవడం అనుకోకుండా జరిగిపోయింది. భారత విదేశాంగ శాఖను నిర్వహించిన మహిళల్లో ఇందిరాగాంధీ తర్వాత సుష్మ పేరు చేరడం కూడా యాదృచ్చికమే. అయితే 1999లో గాంధీ కుటుంబంతో బరిలో దిగడం మాత్రం అప్పటి రాజకీయ అవసరం. సోనియా గాంధీ కర్నాటకలోని బళ్లారి లోక్‌సభ స్థానానికి కూడా పోటీ చేశారు. అప్పుడు అద్వానీ, వాజ్‌పేయి వంటి పార్టీ పెద్దలు సుష్మాస్వరాజ్‌ వైపు మొగ్గుచూపారు. భారతీయతకు– విదేశీయతకు మధ్య పోటీగా రూపుదిద్దుకున్న ఆ ఎన్నికల్లో చివరి నిమిషంలో బరిలో దిగిన సుష్మాస్వరాజ్‌... ప్రచారంలో కన్నడ భాషలో మాట్లాడి కన్నడిగులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మూడున్నర లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. కొద్ది తేడాతో విజయానికి దూరంగా ఉండిపోయినప్పటికీ ఆ ఎలక్షన్‌ సుష్మ పొలిటికల్‌ చరిష్మా గ్రాఫ్‌ను పెంచింది.

నిత్య విద్యార్థి
సుష్మా స్వరాజ్‌ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. టెక్నాలజీతోపాటు అప్‌డేట్‌ అవుతుంటారు. ట్విటర్‌ను పరిపాలనకు ఆమె ఉపయోగించినంత విరివిగా మరెవరూ వాడి ఉండరు. ఏ క్షణమైనా ప్రపంచానికి ఒక ట్వీట్‌ దూరంలోనే ఉంటారు. సుష్మాస్వరాజ్‌... స్మార్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఎలాగన్నది చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో చేసి చూపిస్తున్నారు. అదే వేదికగా ప్రజాభిమానాన్ని కూడా చూరగొంటున్నారు. ఆమెకు కిడ్నీ సమస్య వచ్చినప్పుడు వెల్లువెత్తిన అభిమానం రాజకీయ పార్టీల హద్దులను చెరిపేసింది. తమ కిడ్నీ ఇస్తామంటూ అభిమానుల నుంచి ట్వీట్‌లు వచ్చాయి. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆమె సంపాదించుకున్న స్థిరాస్తి అది. నాయకులు రెండు రకాలు. తమకు మార్గదర్శనం చేసిన వారి అడుగుజాడల్లో నడిచేవాళ్లు, తర్వాతి తరం కోసం తమ పాదముద్రలతో పథనిర్మాణం చేయగలిగిన వాళ్లు. సుష్మా స్వరాజ్‌ది రెండో కోవ.


ప్రధాని అవుతారా?!
సుష్మా స్వరాజ్‌ గత వారం... తన ఆరోగ్య రీత్యా రాబోయే 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనని యథాలాపంగా అన్నట్లు అన్నారు. ఆ మాట ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతారా? అన్ని పార్టీల్లోనూ సందేహం. ‘ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయాల నుంచి రిటైర్‌ అయినట్లేనా? రాజ్యసభ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యి ప్రధానమంత్రి కావచ్చు కదా, ఇందిరాగాంధీలాగా’ అని సీనియర్‌ జర్నలిస్టు బర్ఖాదత్‌ ఆశాజనకమైన సందేహాన్ని వ్యక్తం చేశారు. అదే నిజం కావాలని కోరుకునే వాళ్లు దేశంలో చాలామంది ఉన్నారు.

తొలి మహిళ రికార్డులు
► ఢిల్లీ ముఖ్యమంత్రి
► భారత పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత
► జాతీయ పార్టీకి అధికార ప్రతినిధి
► అవుట్‌ స్టాండింగ్‌ పార్లమెంటేరియన్‌ అవార్డు
► హరియాణా క్యాబినెట్‌ మంత్రి
► హరియాణా జనతాపార్టీ అధ్యక్షురాలు



బర్ఖాదత్, సీనియర్‌ జర్నలిస్టు


కూతురు బాన్‌సూరి కౌశల్‌తో


సోనూను తల్లిదండ్రులకు అప్పగిస్తూ..


భర్త స్వరాజ్‌ కౌశల్‌తో (పెళ్లి ఫొటో)


సుష్మలాగ అభినయిస్తున్న చిన్నారి (ఫ్యాన్సీ డ్రస్‌ పోటీ)

– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement