బెయిల్‌కు ముందు భూతాలు
జగన్ బెయిల్‌పై తీర్పు నేపథ్యంలో హస్తినలో చంద్రబాబు నీచ రాజకీయాలు
తెలుగుదేశానికి అధిష్టానం ఢిల్లీలో ఉందా? చంద్రబాబు నాయుడి రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉందా? జగన్‌మోహన్ రెడ్డి బెయిలు పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ ఆయన ఢిల్లీకి వెళ్లటం చూస్తుంటే అది నూరుశాతం నిజమనిపించకమానదు. సాక్ష్యాలతో సహా బయటపడ్డ ఐఎంజీ, ఎమ్మార్ వంటి కుంభకోణాల్లో సైతం సీబీఐ తనవైపు చూడకుండా ఢిల్లీ వెళ్లి చీకటి రాజకీయాలు నడిపిన బాబు... అందుకోసం ఏకంగా తెలుగుదేశం ఆవిర్భావ సిద్ధాంతాన్నే తాకట్టు పెట్టేశారు. కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టిన ఆ పార్టీని... తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో విలీనం చేసే స్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం పడిపోకుండా నాలుగేళ్లుగా కాపాడుతున్న చంద్రబాబు... కేంద్రంలోనూ కాంగ్రెస్ సర్కారు ఓడిపోతుందనే భయంతో ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌కు తన ఎంపీలను గైర్హాజరు చేశారంటే ఏమనుకోవాలి? జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న ప్రతిసారీ ఏదో సాకుతో హస్తినకు వెళ్లడం... ప్రభుత్వ పెద్దలను కలిసి హడావుడి చేయడం... తన చీకటి భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చీకట్లో మంతనాలు సాగించడం... ఇదీ బాబు మార్కు ‘మోడస్ ఆపరెండీ’...
వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిపై కేసు వేయటం నుంచీ... 16 నెలలుగా ఆయనకు బెయిలు రాకుండా చేయటం దాకా చంద్రబాబు- కాంగ్రెస్- ఎల్లోమీడియా కుమ్మక్కయి చేస్తున్న హోమ్‌వర్క్ ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. రెండున్నర ఎకరాల నుంచి మొదలైన బాబు ఆస్తుల యాత్ర ఇపుడు దాదాపు 2వేల కోట్లను దాటేసింది. ఇక ఆయన దాచిపెట్టిన, విదేశాల్లో కూడబెట్టిన ఆస్తుల్ని కలుపుకుంటే ఆ మొత్తం ఎన్ని వేల కోట్లు ఉంటుందనేది ఈ భూమ్మీద ఎవ్వరైనా చెప్పటం కష్టం. ఇంత దోపిడీకి పాల్పడి కూడా... ఆయన ఏడాదికోసారి ఆస్తుల్ని వెల్లడిస్తూ... వందలాది కోట్ల విలువైన ఆస్తుల్ని సైతం కేవలం లక్షలుగా చూపిస్తూ ముందుకొస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలంటే ఆయనకెంత చిన్నచూపో అర్థం కాక మానదు.
అయినా సరే... ఈయన స్కాములపై సాక్షాత్తూ హైకోర్టు విచారణకు ఆదేశించినా కూడా సీబీఐ ఒక్క అడుగు ముందుకు కదలదు. ఆయన్ను పిలిచి కనీసం విచారించదు. చివరకు బాబు, తన ఎల్లో కవల రామోజీరావుతో సహా కోర్టులకెక్కి ఆ విచారణను నిలుపు చేయించుకునేదాకా... సీబీఐకి సమయమే చిక్కదు. పోనీ ఆయనపై సీబీఐ దర్యాప్తు జరపండని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేస్తే... తమ దగ్గర సిబ్బంది లేరని చెప్పి సీబీఐ మిన్నకుంటుంది!! అసలు ఒక దర్యాప్తు సంస్థ తన దగ్గర సిబ్బంది లేరన్న కారణంతో ఒక అవినీతి కుంభకోణాన్ని విచారించలేదంటే ఏమనుకోవాలి? కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందనుకోవాలి? ఇంత నలుపు పెట్టుకున్న బాబు... జగన్‌మోహన్‌రెడ్డి బెయిలుపై తీర్పు రానున్న ప్రతిసారీ తన ఎల్లోమీడియా సాయంతో శివాలెత్తుతుండటమే ఘోరాతిఘోరం.
కేసు వేయించటం నుంచే కుట్ర
రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన్న తరవాత... ఆయన తనయుడికి రాష్ట్రంలో అభిమానం అంతకంతకూ పెరుగుతున్న సమయంలో కాంగ్రెస్ తన ఎమ్మెల్యే శంకర్రావుతో కేసు వేయించటమే ఈ కుట్రకు ఆరంభం... పరాకాష్ట కూడా. దానికి తెలుగుదేశం తోడవటం చంద్రబాబు దిగజారుడుతనానికి, అపవిత్ర కలయికకు తారస్థాయి తప్ప మరొకటి కాదు. ఇంకా చిత్రమేంటంటే ఈ కేసులో ప్రతివాదులుగా ఒకటి నుంచి 9 వరకు ప్రభుత్వ విభాగాలే ఉన్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి 52వ ప్రతివాది. అయినప్పటికీ ఈ కేసులో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు.
కేసు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించినదైనా... ఆ నిర్ణయాలు తప్పో, ఒప్పో రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. నిజానికి ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ నిబంధనల ప్రకారం తీసుకున్నవే. ఆ విషయం గనక కోర్టుకు ప్రభుత్వం చెబితే ఈ కేసే లేదు. అలాంటి కేసులో ప్రభుత్వం సమాధానం ఇవ్వకున్నా... ఆ ఒక్క కారణంతో కేసు కొట్టేయలేమన్న న్యాయమూర్తి అభిప్రాయం కారణంగా తీర్పు జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా వచ్చేసింది.
అసలు ఈ కేసేంటి? వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ ఆస్తులు, కాంట్రాక్టులు, ప్రాజెక్టులు కొందరు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని, అందుకు ప్రతిగా వారు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని. మరి ఈ ప్రాజెక్టుల్ని, కాంట్రాక్టుల్ని కట్టబెట్టినపుడు నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అడ్డగోలుగా ఏమైనా కట్టెబెట్టేశారా? అన్నీ నిబంధనల ప్రకారం జరిగి ఉంటే వారు ముడుపులు చెల్లించాల్సిన అవసరం ఎందుకుంటుంది? ప్రతిదీ జీవోల మేరకు జరిగిందే కదా? మరి ఆ జీవోలు తప్పో, ఒప్పో ప్రభుత్వం చెప్పాలి కదా? ప్రభుత్వం కోర్టుకు సమాధానమెందుకు చెప్పలేదు? జగన్‌మోహన్‌రెడ్డిని ఇరికించడానికి కాదా?
ఛార్జిషీట్లు వేశాక అరెస్టా?
కోర్టు తీర్పు మేరకు 2011 ఆగస్టులో దర్యాప్తు ఆరంభించిన సీబీఐ... 2012 మే నాటికి మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఆ మూడింట్లోనూ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని మొదటి నిందితుడిగానే పేర్కొంది. చిత్రమేంటంటే ఆ మూడు ఛార్జిషీట్లు వేసేదాకా జగన్‌ను కనీసం విచారణకు కూడా పిలవలేదు. అసలు ఒక వ్యక్తిని విచారించకుండా ఆయన్ను నిందితుడిగా చేరుస్తూ ఛార్జిషీట్లు వేయటమనేది భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. అలాంటిది ఆ ఛార్జిషీట్లను విచారణకు స్వీకరించేటపుడు తన ఎదుట హాజరుకావాల్సిందిగా కోర్టు జగన్‌కు సమన్లిస్తే... తెల్లారితే ఆయన కోర్టుకు వెళతారనగా అర్ధరాత్రి సీబీఐ అరెస్టు చేసింది. అది కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నారని కూడా విస్మరించి... బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారన్న కారణంతో అరెస్టు చేసింది. అయినా మూడు ఛార్జిషీట్లు వేసేదాకా విచారణకు అడ్డుపడని... సాక్షులను ప్రభావితం చేయని వ్యక్తి ఆ తరవాత చేస్తారని సీబీఐ వాదించిందంటే ఏమనుకోవాలి? నిజానికి కోర్టు ఎదుట హాజరైతే సొంత పూచీకత్తుపై బెయిలిచ్చే అవకాశముంది. అపుడు సీబీఐ అరెస్టు చేయడానికి ఉండదు. ఈ నేపథ్యంలో సీబీఐ ఆయన్ను అరెస్టు చేయటమే ఇక్కడ కుట్రను కళ్లకు కట్టే అంశం.
ఈ అరెస్టు అక్రమమని సీబీఐ కోర్టే స్వయంగా చెప్పింది. ఛార్జిషీట్లు వేశాక అరెస్టు చేయడాన్ని సీబీఐ ఏ రకంగానూ సమర్థించుకోజాలదని హైకోర్టు కూడా స్పష్టంచేసింది. అంటే కుట్ర ఏ స్థాయిలో జరిగిందో కనపడటం లేదా? పెపైచ్చు కేసులో ఏం తేలుతుందో తేలదోనన్న భయంతో దర్యాప్తుకన్నా వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబ పరువు ప్రతిష్టలనే టార్గెట్ చేసింది సీబీఐ. దర్యాప్తు జరుగుతుండగానే దాన్ని ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు లీకులివ్వటం, దర్యాప్తు అధికారి నేరుగా ఓ వర్గం మీడియా విలేకరులకు ఐదారు వందల ఫోన్‌కాల్స్ చేసి ఉన్నవీ లేనివీ వెల్లడించటం చూస్తే వీళ్ల టార్గెట్ వైఎస్ కుటంబమని తెలియకమానదు.
రాష్ట్ర సమస్యలు పట్టవా?
అడ్డగోలుగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయంతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. సమైక్యాంధ్ర కోసం 53 రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులతో సీమాంధ్ర జిల్లాల జనమంతా రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేశారు. జైల్లో ఉన్న జగన్‌మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎంపీలూ రాజీనామాలకు దిగారు. రాష్ట్రాన్ని విభజించడానికి ఓకే అంటూ బ్లాంక్ చెక్ మాదిరి కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు... విభజన నిర్ణయంపై సీమాంధ్ర జిల్లాల్లో రేగిన ఆందోళన చూశాక అక్కడ యాత్రకు దిగారు. అంతేతప్ప తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకోవటం గానీ... తన ఎమ్మెల్యేలు, ఎంపీలచేత రాజీనామా చేయించటం గానీ ఏమీ చేయలేదు. పెపైచ్చు ఈ అంశంపై రాష్ట్రం రావణకాష్టంలా మండుతుండగా ఈయన జగన్ మోహన్‌రెడ్డిపై ఫిర్యాదు చేయటం కోసం ఢిల్లీకి బయలుదేరారంటే ఏమనుకోవాలి? అయినా రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థపై ప్రభావం చూపించడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నించటం సమంజసమేనా? ఒకసారి దర్యాప్తు అంటూ పూర్తయితే న్యాయమూర్తి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే వీలుంటుంది. ఈ కేసలో జరిగింది కూడా అదే. తమ దర్యాప్తు ముగిసినట్లు సీబీఐ మౌఖికంగా, లిఖితపూర్వకంగా కూడా కోర్టుకు తెలియజేసింది. మరి ఈ సమయంలో కోర్టును ప్రభావితం చేసేలా రాజకీయాలకు దిగుతున్న చంద్రబాబును ఏమనాలి?
‘ఈనాడు’ రాతల్లో నిజమెంత?
భారతి సిమెంట్‌పై ఛార్జిషీట్లో పేర్కొన్నారంటూ ‘ఈనాడు’ రెండు రోజుల పాటు తోచిన కథనాన్ని వండేసింది. కడప జిల్లాలో సున్నపురాయి గనుల మైనింగ్ కోసం గుజరాత్ అంబుజా సంస్థ దరఖాస్తు చేసినా దానికివ్వకుండా భారతి సిమెంట్‌కు ఇచ్చారని, వైఎస్ చక్రం తిప్పారని రాసేసిన ‘ఈనాడు’... అక్కడ ఐదేళ్లపాటు లీజు తనపేరిటే ఉన్నా ఫ్యాక్టరీ కట్టడంలో గుజరాత్ అంబుజా విఫలమైన అంశాన్ని మాత్రం ప్రస్తావించదు. జగన్‌మోహన్ రెడ్డి మూడేళ్లలోనే ఫ్యాక్టరీని సాకారం చేశారని గానీ... ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీపై ప్రత్యక్షంగా పరోక్షంగా 8వేల పైచిలుకు మంది ఉపాధి పొందుతున్నారని గానీ రామోజీ రాయనే రాయరు. ఆ లీజు భూములన్నీ ప్రైవేటువని, ఎకరా రూ.3 లక్షల పైచిలుకు పెట్టి కొనుగోలు చేసినవే తప్ప చంద్రబాబు నాయుడి మాదికి పప్పులు బెల్లాలకు ప్రభుత్వం కేటాయించినవి కాదని కూడా రాయరు. అవన్నీ వదిలిపెట్టి అడ్డగోలు రాతలు రాసిన రామోజీ... మర్నాడు మరీ చెలరేగిపోయారు.
జగన్‌మోహన్ రెడ్డి పైసా పెట్టకుండా భారతి సిమెంట్స్‌లో వాటా దక్కించుకున్నారని, ఆయన పెట్టిన రూ.30 కోట్ల ప్రారంభ పెట్టుబడి కూడా నిమ్మగడ్డ ప్రసాద్ ఇచ్చినదేనని రాసి పారేశారు. ‘‘వ్యవహారం బయటపడకుండా ఉండటానికి నిమ్మగడ్డ ప్రసాద్‌కు సాండూర్ పవర్‌లో షేర్లు కేటాయించారు’’ అని కూడా అదే ‘ఈనాడు’లో రాస్తారు. అంటే! నిమ్మగడ్డ ప్రసాద్‌కు సాండూర్ పవర్‌లో వాటా విక్రయించి, ఆ వచ్చిన సొమ్మును భారతి సిమెంట్‌లో జగన్ మోహన్‌రెడ్డి ఇన్వెస్ట్ చేశారనే కదా దానర్థం. అలా జరిగితే తప్పేంటి? తన సొంత సంస్థలో వాటా విక్రయించటం తప్పా? అలా విక్రయించగా వచ్చిన సొమ్మును వేరొక సంస్థలో పెట్టుబడి పెట్టడం తప్పా? అయినా ఆయన షేర్లు విక్రయించింది 2008లో అని ‘ఈనాడే’ రాసింది. అప్పటికి జగన్‌పై ఎలాంటి కేసులూ లేవు కూడా. దానర్థం ఈ షేర్ల విక్రయంలో ఎలాంటి దురుద్దేశాలూ లేనట్లేగా? కేసులు నమోదయ్యాక ఏ 2012లోనో, 2013లోనో షేర్లు విక్రయిస్తే తప్పుగానీ... మామూలప్పుడు తన కంపెనీలో షేర్లు విక్రయించుకోవటం తప్పా? అసలు మార్గదర్శిపై నిండా మునిగిపోయినపుడు... మార్గదర్శి కేసుల్లో ఇరుక్కున్నపుడు... ఆ డబ్బులతోనే ఎదిగిన ‘ఈనాడు’లో వాటా అమ్మటం తప్పుకాదా రామోజీ!! మార్గదర్శి డిపాజిటర్ల సొమ్మును అక్రమంగా మళ్లించుకుని, బండారం బయటపడి అందరికీ తిరిగి చెల్లించాల్సి వచ్చేసరికి డబ్బా కంపెనీల ద్వారా నిధులు పొందటం తప్పు కాదా రామోజీ!! లిస్టెడ్ కంపెనీ అయిన రిలయన్స్... తన పెట్టుబడిని స్టాక్ ఎక్స్ఛేంజీలకు చెప్పాల్సి ఉన్నా, విచారణకు హైకోర్టు ఆదేశించేదాకా చెప్పకపోవటం తప్పు కాదా రామోజీ! వివిధ వ్యవస్థల్లో తమను కాపాడేవారున్నారని ఎన్ని అక్రమాలు చేసినా చెల్లిపోతుందనుకుంటే... ఏదో ఒక రోజు జనం చీకొట్టక తప్పదు. చరిత్ర చెబుతున్న సత్యమిది.
ఆది నుంచీ అదే కుట్ర
చట్టప్రకారమైతే అరెస్ట్ చేసిన 90 రోజుల్లో బెయిలివ్వాలి. కానీ జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్ విచారణకు వచ్చే ప్రతి సారీ... ఏదో ఒక సంచలనం. ఈ కేసుకు సంబంధించి ఏదో కొండను తవ్వేసినట్లుగా సీబీఐ ప్రకటనలు చేయటం, దాన్ని ఎల్లోమీడియా తాటికాయలంత అక్షరాలతో ప్రచురించటం, బాబు- టీడీపీ తమ్ముళ్లు ఢిల్లీకి వెళ్లి నానాయాగీ చేయటం.. ఇవన్నీ కుట్ర ఎంత లోతైనదో చెప్పటం లేదా?
అరెస్టయిన వెంటనే దాన్ని సవాలు చేస్తూ సీబీఐ కోర్టులో జగన్ బెయిలు పిటిషన్ వేశారు. దీనిపై 2012 జూన్ 1న కోర్టు తీర్పునిచ్చింది. కానీ ఆ తీర్పునకు కొన్ని గంటల ముందు.. గాలి జనార్థనరెడ్డి బెయిలు కోసం జడ్జిలకు ముడుపులిచ్చిన వ్యవహారాన్ని సీబీఐ బయటపెట్టింది. అక్రమాన్ని బయటపెట్టడం ఎప్పుడూ తప్పు కాదు. కానీ తనకు నాలుగు రోజుల ముందే అందిన సమాచారాన్ని...బెయిలు ముందు వెల్లడించటమే తీవ్రస్థాయి సందేహాలకు తావిచ్చింది.
అంతకుముందే ఆ సమాచారం అందినా దాన్ని ఎందుకు బయటపెట్టలేదన్న ప్రశ్నలకు సీబీఐ నుంచి సమాధానమే లేదు. ఇదంతా జగన్ బెయిలుపై ప్రభావాన్ని చూపించిందని, ఆయనకు బెయిలివ్వాలంటే జడ్జిలు భయపడే స్థాయిలో సీబీఐ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిందని రాజకీయ నేతల నుంచి విమర్శలెన్నో వచ్చాయి.
సీబీఐ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు జగన్. 2012 జులై 4న తీర్పు రానుండగా.. జులై 3న సీబీఐ అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. అపుడెపుడో మార్చి 31న దాఖలు చేసిన తొలి ఛార్జిషీటుకు అనుబంధమంటూ కొన్ని పత్రాలు వేసింది. వాటి లో కొత్త అంశాలేవీ లేకున్నా.. ఏదో ఉందని.. బెయిలిస్తే ప్రమాదమని న్యాయవ్యవస్థకు సంకేతాలివ్వటానికే సీబీఐ ఇలా చేసిందని విమర్శలొచ్చాయి. అనుబంధ ఛార్జిషీట్‌పై ఎల్లో మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలొచ్చాయి కూడా.
హైకోర్టు తీర్పుపై జగన్ సుప్రీంను ఆశ్రయించారు. బెయిలుపై ఉత్తర్వులు వెలువడే ముందు... సీబీఐకి రెగ్యులర్‌గా వచ్చే లాయరు మారారని, ఆయన బదులుగా వచ్చిన ప్రభుత్వ న్యాయవాదికసలు మాట్లాడటమే రాదని, చట్టం గురించే తెలియదని చెబుతూ సీబీఐ లీకులిచ్చింది. దాన్ని ఒక వర్గం మీడియా బీభత్సంగా ప్రచారం చేసింది. కాంగ్రెస్‌తో జగన్ రాజీకి వచ్చారని, అందుకే ఇలా లాయరును మార్చి ఉండవచ్చని ఆ మీడియా వండి వార్చేసింది. ఇంత ఘోరమా?
మళ్లీ పాత లాయరు వచ్చి, వాదనలు పూర్తయి.. సుప్రీంకోర్టులో బెయిలు పిటిషన్‌పై ఉత్తర్వులు రాబోయే తరుణంలో తెలుగుదేశం పార్టీ నేరుగా రంగంలోకి దిగింది. మరికొద్ది గంటల్లో తీర్పు వెలువడనున్నదనగా... నామా నాగ్వేరరావుతో సహా తెలుగుదేశం ఎంపీలు ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిశారు. జగన్ ఆస్తుల్ని స్తంభింపజేయాలంటూ ఒక నోట్‌ను సమర్పించారు. వారు కోరిన కొన్ని గంటల్లో... సాక్షి ఆస్తులు, ఇన్వెస్టర్లయిన హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలకు చెందిన కొన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఒక నోట్ విడుదల చేసింది. తరువాతి రోజు బెయిలు తిరస్కరణకు గురైంది. అసలు తీర్పునకు కొన్ని గంటల ముందు టీడీపీ ఎంపీలు ఆర్థికమంత్రిని కలవటమేంటి...? వారు కోరినట్లుగా ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఆర్థిక శాఖ పరిధిలోని ఈడీ నోట్ ఇవ్వటమేంటి? చూస్తే తెలియటం లేదా?
తనను అరెస్టు చేసింది మొదటి ఛార్జిషీటులోనని, అరెస్టుకు ముందే ఆ ఛార్జిషీటు వేశారు కనక... 90 రోజుల్లో దర్యాప్తు ముగించి ఛార్జిషీటు వేయలేదు కనక... బెయిలివ్వాలంటూ సీబీఐ కోర్టులో జగన్ స్టాట్యుటరీ బెయిలు పిటిషన్ వేశారు. కోర్టు దీన్ని తిరస్కరించడంతో హైకోర్టులో సవాల్ చేశారు జగన్. వాదనలు ముగిసి ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా... వాన్‌పిక్ కేసు నిందితుడైన మంత్రి దర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌ను సీబీఐ తెరపైకి తెచ్చింది. షరా మామూలుగా ఎల్లోమీడియా దీన్ని పతాక శీర్షికల్లో అచ్చేసింది. హైకోర్టు తీర్పు కొన్ని గంటల్లో వెలువడనున్న ఈ తరుణంలోనే... ఏడు నెలలుగా జైల్లోనే ఉన్న సీనియర్ అధికారి బ్రహ్మానందరెడ్డి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం ఉన్నట్టుండి అనుమతినిచ్చింది. మరి ఈ కుట్రలో కేంద్ర ప్రభుత్వానికి వాటా లేదని చెప్పగలమా? కాంగ్రెస్-టీడీపీల కనుసన్నల్లోనే ఈ కుట్ర మొత్తం నడుస్తోందని చెప్పటానికి ఇంకా ఆధారాలేమైనా కావాలా?
ఇప్పుడూ అదే తీరు?
ఇప్పుడూ ఎల్లో కూటమి అదే తీరు కనబరుస్తోంది. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, ఆ తరవాత బెయిలు కోసం జగన్ దరఖాస్తు చేసుకోవచ్చని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దానిప్రకారం ఆ గడువుకు నాలుగైదు రోజుల తరవాత సీబీఐ అన్ని ఛార్జిషీట్లనూ వేసి... దర్యాప్తు ముగిసిందని కోర్టుకు స్పష్టంగా చెప్పింది. దర్యాప్తు ముగిశాక బెయిలు పిటిషన్ వేస్తే కోర్టు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని గతంలో హైకోర్టు సైతం చెప్పింది. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై వాదన ప్రతివాదనలు ముగిశాయి. సోమవారం తీర్పు వెలువడనుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల వేసిన ఛార్జిషీట్లలో అంశాల్ని నాణేనికి ఒకే వైపున చూపిస్తూ రెండు రోజులుగా ‘ఈనాడు’, దాని తోకపత్రిక శివాలెత్తేస్తున్నాయి. విచారణకు స్వీకరించని ఛార్జిషీటు... కనీసం నిందితుడికి కూడా అందని ఛార్జిషీటు తనకెలా వచ్చిందో గానీ రామోజీరావు రంకెలు మొదలుపెట్టారు. అయితే దర్యాప్తు ముగిసింది కనక బెయిలొచ్చే అవకాశం ఉందని భావించిన చంద్రబాబునాయుడు... దీన్ని అడ్డుకోవటానికి ఏకంగా ఢిల్లీ యాత్రకు దిగారు. రెండు రోజుల కిందట తమ్ముళ్లను పంపించి ఢిల్లీలో కనిపించిన ప్రతి గడపా ఎక్కించిన చంద్రబాబు... నేరుగా రాష్ట్రపతితో సైతం ఈ అంశాన్ని చర్చించడానికి వెళ్లారంటే ఏమనుకోవాలి? అయినా జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలొస్తుందంటే చంద్రబాబుకు ఎందుకంత ఉలికిపాటు? తన అడ్రస్ గల్లంతయిపోతుందనా? తన పార్టీ తుడిచిపెట్టుకు పోతుందనా? రాజకీయాల్ని జన క్షేత్రంలో తేల్చుకోవాలి తప్ప ఇలా చీకటి ఒప్పందాలకు పాల్పడటం సరైనదేనా? జనాభిమానం ఎవరివైపున ఉంటే వారు ఎన్నికల్లో గెలుస్తారు! అంతేతప్ప తనకు జనాభిమానం లేదు కాబట్టి... ఆ అభిమానం సంపాదించుకున్న నేతను జనంలోకి రానివ్వకుండా చేద్దామని కుట్రలు పన్నితే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేంటి?
బాబుపై అంత ప్రేమెందుకు?
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు నుంచి బెయిలు వరకూ అడుగడుగునా కుట్ర బుద్ధి చూపిస్తున్న సీబీఐ... చంద్రబాబుపై మాత్రం ఈగ కూడా వాలకుండా చూసుకుంటోంది. ఎమ్మార్ కేసులో అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడటమే కాక... హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 535 ఎకరాలను గోల్ఫ్‌కోర్సు కోసం, శ్రీమంతుల విల్లాల కోసం కారుచౌకగా కట్టబెట్టేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ... ఈ కేసులో కూడా లేని లింకుల్ని వెదుకుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబీకులను, సన్నిహితులను వేధించటానికే ప్రయత్నించింది. అసలు 535 ఎకరాల స్థలాన్ని సింగిల్ టెండరు వేసిన సంస్థకు పోటీ లేకుండా ఎందుకు కట్టబెట్టారో, అలా చేయటం ద్వారా చంద్రబాబు ఏం లబ్ధి పొందారో తనకు అవసరం లేదన్నట్లు వ్యవహరించింది. ఇంత పెద్ద కేసులో విచారణ జరుపుతూ... సింగిల్ టెండరుపై భూమి కట్టబెట్టేసిన బాబును కనీసం విచారణకు సైతం పిలవలేదు. ఆయన్ను విచారించకుండానే తంతు ముగించేసింది కూడా. మరి దీన్నేమనాలి? చంద్రబాబుకు సీబీఐ ఎందుకు కొమ్ము కాస్తోంది? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టనని మాట ఇచ్చి... దాన్ని కాపాడుతూ వస్తున్నందుకా? కేంద్రంలో సైతం అంశాల వారీగా తన ఎంపీలను హోల్‌సేల్‌గా, రిటైల్‌గా విక్రయించేస్తున్నందుకా?
దర్యాప్తు పూర్తయితే బెయిలు
సాక్ష్యాలు సరిపోతాయని భావిస్తే ఛార్జిషీటు దాఖలు చేసే ముందు నిందితుడిని తీసుకెళ్లి నేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి. అప్పుడు ఆ తుది నివేదికను విచారణకు స్వీకరిస్తూ... నిందితుడికి బెయిలు మంజూరు చేసే అధికారం ఆ న్యాయమూర్తికి ఉంటుంది. అయితే ఛార్జిషీట్లు వేశాక జగన్ మోహన్‌రెడ్డిని అరెస్టు చేయటాన్ని సీబీఐ ఏ రకంగానూ సమర్థించుకోజాలదు. దర్యాప్తు ఇంకా ముగియలేదు. కీలక దశలో ఉన్నందున ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలివ్వలేం’’
- జూలై 5, 2012న రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు