కరచాలనం చేస్తూనే కత్తి దూయడం దౌత్యం అనిపించుకోదు. అందువల్ల ఫలితం లేకపోగా అంతంతమాత్రంగా ఉన్న మైత్రీ సంబంధాలకు సైతం విఘాతం కలుగుతుంది. ఈ సంగతి చైనాకు సరిగా అర్ధమైనట్టు లేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పర్యటించారు. ఆ రాష్ట్ర సంస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అరుణాచల్ మన దేశంలో అంతర్భాగం కాబట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్టే మోదీ అయినా, మరో అధినేత అయినా ఆ రాష్ట్రానికి కూడా వెళ్తారు. కానీ అలా వెళ్లిన ప్రతిసారీ నిరసన వ్యక్తం చేయడం చైనాకు రివాజుగా మారింది. గతంలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తమ పదవీకాలాల్లో అక్కడి కెళ్లినప్పుడు కూడా ఈ రకంగానే ‘అభ్యంతరం’ చెప్పింది. ఆ భూభాగం తమదేనని చైనా చాన్నాళ్ల నుంచి వాదిస్తున్నది. ఇరు దేశాలమధ్య ఉన్న సరిహద్దు వివాదాల్లో ఆ భూభాగానికి సంబంధించిన అంశం కూడా ఉంది. తమ భూభాగం సుమారు 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం భారత్ స్వాధీనంలో ఉందని చైనా ఆరోపిస్తుండగా...38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా దురాక్రమించిందని మన దేశం చెబుతున్నది. ఈ విషయంలో పరస్పరం చర్చించుకుని ఒక ఒడంబడికకు వద్దామని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. ఈలోగా యథాతథస్థితిని కొనసాగిద్దామని అనుకున్నాయి.
అలాంటపుడు అరుణాచల్‌పై చైనా పదే పదే అభ్యంతరం చెప్పకూడదు. అలా మిన్నకుండలేదు సరిగదా ఇప్పుడు మరికాస్త ముందుకుపోయింది. మన నేతలు అరుణాచల్ వెళ్లినప్పుడు గతంలో కేవలం ప్రకటనద్వారా నిరసన వ్యక్తం చేయడంతో సరిపెట్టేది. అధికారిక వార్తాసంస్థ ద్వారా తన మనోగతాన్ని ప్రచారంలో పెట్టేది. ఈసారి చైనాలోని మన రాయబారి అశోక్ కాంతాను విదేశాంగ మంత్రిత్వశాఖకు పిలిపించుకుని ఆ దేశ విదేశాంగ ఉపమంత్రి లియూ జెన్‌మిన్ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. భారత్ చర్య చైనా సార్వభౌమత్వాన్ని, హక్కులను, ప్రయోజనాలను కించపరిచేవిధంగా ఉన్నదని చెప్పారు. అంతేకాదు...ఇరు దేశాల మధ్యా ఉన్న సరిహద్దు విభేదాలను ఇది ‘కృత్రిమంగా’ ఎక్కువ చేస్తున్నదని ఆరోపించారు. వివాదాస్పద ప్రాంతాన్ని పర్యటన కోసం ఎంచుకోవడంపై తీవ్ర అసంతృప్తిని, అభ్యంతరాన్ని వ్యక్తంచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇలా పిలిపించడానికి ముందు రోజు చైనా విదేశాంగ ప్రతినిధి కూడా దాదాపు ఇలాంటి మాటలతోనే ప్రకటన చేశారు. చైనా ప్రభుత్వం అరుణాచల్‌ను గుర్తించడంలేదని, ఆ ప్రాంతానికి మోదీ వెళ్లడం తమకు సమ్మతం కాదని చెప్పారు. కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే సాధారణ పరిస్థితుల్లో అరుణాచల్ ప్రదేశ్ గురించి చైనా ప్రస్తావించేది కాదు. గత కొన్నేళ్లుగా ఆ బాణీ మారింది. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా వ్యవహరించడం ప్రారంభించింది. ఈమధ్య ఇంకాస్త ముందుకెళ్లింది. అందులో కొన్ని ‘సబ్ డివిజన్’లను ‘సృష్టించి’ వాటికి టిబెటిన్ పేర్లు పెట్టుకుని తరచుగా వల్లె వేస్తున్నది. ఇదంతా అత్యుత్సాహంతోనో, అనుకోకుండానో చేస్తున్న పనికాదు. ఆ పేర్లను పదే పదే చెప్పడంద్వారా ఆ ప్రాంతం చారిత్రకంగా తమదేనని నిర్ధారణ చేయడం చైనా చర్యలోని ఆంతర్యం.
భారత్‌తో స్నేహానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతూనే దౌత్య సంప్రదాయాలకు విరుద్ధమైన పదజాలంతో ప్రకటనలు చేయడం చైనాకు కొత్తకాదు. నిరుడు సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మన దేశ పర్యటనలో ఉండగా ఆ దేశ సైన్యం సరిహద్దుల్లో వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ దేశాధ్యక్షుడు భారత్ అతిథిగా పర్యటనలో ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా చైనా సైన్యం తమ పౌరులను రెచ్చగొట్టి మన భూభాగంలోకి ప్రవేశపెట్టింది. అక్కడ నిర్మాణం పనులు జరుగుతున్నచోట ఘర్షణను ప్రేరేపించడానికి ప్రయత్నించింది. ఇలాంటి చేష్టలు ఇరు దేశాలమధ్యా అపనమ్మకాన్ని పెంచుతాయని, చెలిమికి అడ్డువస్తాయని చైనా గుర్తించడం లేదు. అంతక్రితం మాటెలా ఉన్నా జనతా ప్రభుత్వ హయాంలో ఆనాటి విదేశాంగమంత్రి వాజపేయి చైనా పర్యటించాక సంబంధాలు మెరుగవడం ప్రారంభించాయి. 1988 తర్వాత ఆ దిశగా మరిన్ని ప్రయత్నాలు సాగాయి.
ఇరు దేశాలమధ్యా అనేకసార్లు శిఖరాగ్ర చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్యం విస్తరించడం మొదలైంది. సాంస్కృతిక సంబంధాలు కూడా పెరిగాయి. ప్రస్తుతం రెండు దేశాలమధ్యా 6,500 కోట్ల డాలర్లమేర వాణిజ్యం సాగుతున్నది. దీన్ని 10,000 కోట్ల డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యంతో ఇరు దేశాలూ కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే జీ జిన్‌పింగ్ వచ్చారు. మోదీ వచ్చే మే నెలలో చైనా వెళ్లబోతున్నారు. నిజానికి మోదీ పర్యటన జయప్రదం చేయడంలో భాగంగా ఇటీవలే విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆ దేశం వెళ్లారు. సరిహద్దు వివాదం విషయంలో ఈసారి మనవైపు ‘భిన్నమైన ప్రతిపాదనలు’ వెలువడే అవకాశం ఉన్నదని ఆమె చెప్పారు. పాకిస్థాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్‌ల విషయంలో చైనా ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నదో, అందుకు కారణలేమిటో తెలిసినా మన దేశం చైనాతో కలిసి బీసీఐఎం (బంగ్లా, చైనా, ఇండియా, మయన్మార్) ఆర్ధిక కారిడార్‌కు సరేనన్నది. పాకిస్థాన్‌తో చైనాకు అణు బంధం ఉన్నదని తేటతెల్లమైనా ఆ దేశంతో అణు విద్యుత్ ఒప్పందం కుదర్చుకోవడానికి సిద్ధపడింది. అయినా చైనా అమిత్ర చర్యకు పాల్పడుతున్నది. మోదీ చైనా పర్యటన సమయానికల్లా సరిహద్దు వివాదంలో తమది రాజీపడని వైఖరిగా చాటాలని, ఆ మాటున భారత్‌ను తన దారికి తెచ్చుకో వాలని చూస్తున్నది. మన ప్రభుత్వం చైనా తాజా అడుగులను గమనించి అందుకు దీటుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గిల్లికజ్జాలు పెట్టుకునే విధానం దౌత్యంలో పనికిరాదని, దానివల్ల సాధించేదేమీ ఉండదని చాటాల్సి ఉంది.
చైనా అతి తెలివి
Published Sat, Mar 7 2015 12:07 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement