ఈశాన్యంలో చావుకేక!
సంపాదకీయం
మరోసారి అస్సాం నెత్తురోడింది. మూడురోజులుగా అక్కడ చోటుచేసుకుంటున్న ఘటనలు ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కంటతడి పెట్టిస్తున్నాయి. అసలు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. కత్తులు, విల్లమ్ములు, తుపాకులు, గ్రెనేడ్లు చేతబూనిన బృందాలు గ్రామాలపైబడి దొరికిన వారిని దొరికినట్టు మట్టుబెట్టడం ఊహించడానికే భయంకరమైన సన్నివేశం. తాజా నరమేథంలో ఇంతవరకూ 80 మంది మరణించగా అందులో అత్యధికులు పిల్లలు, మహిళలు. ఈ ఘటనల్లో వందలాది మంది గాయపడ్డారు. వేలాది మంది కొంపా గోడూ వదిలి వెళ్లిపోతున్నారు. మనుషుల్ని చంపడంతోపాటు వారి ఊళ్లనూ, వారు దాచుకున్న తిండిగింజలను, వారి పశువులను తగలబెట్టడం ఈ హంతక బృందాలు చేస్తున్న పని. ఆప్తులను కోల్పోయి, మూడురోజులనుంచి పట్టెడన్నం దొరక్క, కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లయినా లభ్యం కాక అలమటిస్తున్నవారు... కాలుతున్న తమ ఇళ్లలో బుగ్గిపాలు కాకుండా మిగిలిన తిండిగింజలను ప్రాణ ప్రదంగా ఏరుకుంటున్న విషాద దృశ్యాలు చానెళ్లలో కనబడుతున్నాయి.
ఏమైంది ఈశాన్యానికి? ఆ ప్రాంతంలో పెద్ద రాష్ట్రమైన అస్సాం ఎందుకలా నిత్యాగ్నిహోత్రంలా మండుతుంటుంది? అస్సాంలో లెక్కకు మిక్కిలిగా ఉన్న వివిధ తెగల మధ్య... మళ్లీ ఆయా తెగలకూ, విదేశీయులుగా ముద్రపడిన వలసవచ్చిన వారికీ మధ్య ఎడతెగకుండా సాగుతున్న పోరు అక్కడ నిత్యమూ ఉద్రిక్తతలను రాజేస్తున్నది. పరిమితంగా ఉన్న వనరులు తమకు మాత్రమే సొంతం కావాలంటే అవతలి తెగ నిష్ర్కమణే ఏకైక మార్గమనుకోవడమే ఈ జనహననానికి ప్రధాన కారణం. అస్సాంకు అందరికంటే ముందు వలసవచ్చిన బోడోలు జనాభా రీత్యా అధిక సంఖ్యాకులు. పదిన్నర లక్షల మంది జనాభాగల ఈ బోడోలు ఎప్పటినుంచో అస్సాంనుంచి వేరు చేసి తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పర్చాలని డిమాండు చేస్తున్నారు. అందుకోసం కొన్ని సంస్థలు ఆవిర్భవించి సాయుధ పోరాటానికి దిగాయి. అలాంటి గ్రూపుల్లో ఒకటైన బోడో లిబరేషన్ టైగర్స్ ఫోర్స్ (బీఎల్‌టీఎఫ్)తో 2003లో కేంద్రంలోని అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఒక ఒప్పందానికి వచ్చి బ్రహ్మపుత్ర నది ఉత్తర తీరంలోని కోక్రాఝర్, చిరాంగ్, సోనిత్‌పూర్, బక్సా, ఉదల్‌గురివంటి జిల్లాలను కలుపుతూ బోడో ప్రాదేశిక మండలి (బీటీసీ)ని ఏర్పాటుచేసింది. ఇందులో 70 శాతం మంది బోడో, రాభా, గారో వగైరా తెగలున్నాయి. ఈ తెగల ప్రయోజనాలమధ్య వైరుధ్యాలున్నాయి. వీరుగాక బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చే వారూ ఉంటారు. తరచుగా తోవమార్చుకునే బ్రహ్మపుత్ర నది వల్ల ఉండటానికి జానెడు జాగా కూడా కరువై ఉపాధిని వెతుక్కుంటూ వలసవచ్చే తెగలకూ, అప్పటికే ఆయా ప్రాంతాల్లో స్థిరపడే తెగలకూమధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తమ జనాభా తగ్గిపోతుందని, తమ వనరులను ఆ తెగలు కొల్లగొడతాయని భావించే ఇతర తెగలు వారిని తరుముతాయి. కేవలం వ్యవసాయాధారంగానే బతుకులీడ్చే పౌరులకు ఇతరత్రా ఉపాధి అవకాశాలను పెంచితే, పారిశ్రామికీకరణను అమలుచేస్తే ఇలాంటి ఘర్షణలు తలెత్తే అవకాశం ఉండదు. శాశ్వత పథకాలపై దృష్టిసారించని ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు తాత్కాలికంగా తమ పబ్బం గడవడానికి తెగలకు చెందిన పలుకుబడిగల నాయకులను గుర్తించి వారికి కాంట్రాక్టులు అప్పగిస్తున్నాయి. ఆ కాంట్రాక్టుల ద్వారా అయ్యే పనులేమీ ఉండవని ప్రభుత్వ పెద్దలకూ తెలుసు. వారిని జాగ్రత్తగా చూసుకుంటే క్షేత్రస్థాయిలో వారే అన్నీ అదుపులోకి తెస్తారన్నదే దీని వెనకున్న ఉద్దేశం. అత్యధికులకు ప్రయోజనం కలిగించాల్సిన పథకాలు, కోట్లాది రూపాయల సర్కారీ సొమ్ము ఇలా దొంగలపాలవుతున్నాయి. పర్యవసానంగా అప్పటికే ఉన్న సామాజిక, ఆర్థిక సమస్యలు మరింతగా ముదురుతున్నాయి. గుర్తింపు పొందిన తెగలకు అరకొరగానైనా సౌకర్యాలుంటాయి. వారికి రేషన్ కార్డు ద్వారా తిండిగింజలు చవగ్గా దొరుకుతాయి. కానీ, నిలువనీడ లేని స్థితిలో వలస వచ్చిన వారికి, విదేశీయులుగా ముద్రపడిన మైనారిటీలకు దక్కేదేమీ ఉండదు. వారి పిల్లలకు చదువుండదు. ఆ పిల్లలకు రోగాలొస్తే చికిత్స చేసే ఆస్పత్రులుండవు.
ఈ దుస్థితిని ఎన్నికల రాజకీయాలు సరిదిద్దడం మాట అటుంచి దాన్ని మరింత దిగజారుస్తున్నాయి. బోడోలకూ, ముస్లింలకూ... బోడోలకూ, సంతాల్, ముండా వంటి ఇతర గిరిజన తెగలకూమధ్య తరచు తలెత్తే తగాదాలన్నీ దాదాపు రాజకీయ పక్షాల విశ్వామిత్ర సృష్టే. ఈ ఘర్షణలవల్ల 1983లో నెల్లి గ్రామం నెత్తుటిమడుగైంది. దాదాపు నాలుగువేల మంది ఊచకోతకు గురయ్యారు. రెండేళ్లక్రితం బోడో ప్రాదేశిక మండలి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో దాదాపు వందమంది చని పోయారు. ఇటీవలికాలంలో ఒక సాయుధ గ్రూపు నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్‌డీఎఫ్‌బీ) (ప్రోగ్రెసివ్) సంస్థతో అస్సాం ప్రభుత్వం ఒప్పందానికి రావడంతో దాని ప్రత్యర్థి సంస్థ ఎన్‌డీఎఫ్‌బీ(ఎస్) సంస్థ ప్రస్తుత ఊచకోతకు తెగించిందని చెబుతున్నారు. ఈ సంస్థ బక్సా జిల్లాలో గత మే నెలలో 22మంది పిల్లలతోసహా 46 మందిని ఊచకోత కోసింది. మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్ వంటి దేశాలు ఇరుగు పొరుగునుండటం... ఆ సరిహద్దు ప్రాంతాలన్నీ దట్టమైన అడవులు కావడం మిలిటెంటు గ్రూపులకు కలిసివస్తున్నది. ఎన్‌డీఎఫ్‌బీ మిలిటెంట్లు దాడులకు దిగొచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ సమాచారాన్నిచ్చినా అస్సాం ప్రభుత్వం సకాలంలో ఆ ప్రాంతానికి బలగాలను తరలించలేకపోయింది. వచ్చే ఏడాది అస్సాంలో ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, ఈశాన్యంలో భౌగోళికంగా చైనా, మయన్మార్, బంగ్లాదేశ్‌వంటి దేశాలతో సరిహద్దులున్నందువల్ల ప్రభుత్వాలు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. జాతుల వైరం సమసి పోయేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకోవాలి.