Northeast
-
ఏపీలో చురుగ్గా కదులుతున్న ఈశాన్య రుతుపవనాలు
-
ఢిల్లీలో బాంబు కలకలం: ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్..!!
-
ప్రైవేటు టీవీ చానళ్లకు కేంద్రం వార్నింగ్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందండంతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రైవేటు శాటిలైట్ టీవీ చానళ్లకు కీలక సూచనలు చేసింది. హింసను ప్రేరేపించేలా, దేశ వ్యతిరేక వైఖరిని ప్రోత్సహించేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న దృశ్యాలను ప్రసారం చేయవద్దని హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఘర్షణల దృశ్యాలను కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో సమాచార, ప్రసార శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అంశాలను ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయకుండా అన్ని చానళ్లు అప్రమత్తతో ఉండాలని, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని మంత్రిత్వ శాఖ కోరింది. గతంలో కూడా పలుమార్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ టీవీ చానళ్లపై అంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
ఈశాన్య రాష్ట్రాలకు మోదీ భరోసా
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్ల అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్న క్రమంలో అసోం ప్రయోజనాలను తమ పార్టీ పరిరక్షిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. గిరిజన స్వయంప్రతిపత్తి మండళ్లలో బీజేపీకి బాసటగా నిలిచిన ప్రజలకు ప్రధాని ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అసోంలో మూడు గిరిజన మండళ్లకు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీకి అండగా నిలిచిన అసోం సోదర, సోదరీమణులకు కృతజ్ఞతలు చెబుతూ ప్రధాని మంగళవారం ట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమానికి బీజేపీ కట్టుబడిఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పలు చర్యలు, పథకాల ద్వారా అసోం ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. కాగా పౌరసత్వ బిల్లు (సవరణ) 2019ను వ్యతిరేకిస్తున్న ఈశాన్యరాష్ట్రాలకు చెందిన పలు బీజేపీ భాగస్వామ్య పార్టీలు మంగళవారం గౌహతిలో భేటీ అయ్యాయి. -
‘ఈశాన్య’ అభ్యర్థుల ఎత్తు కుదింపు
న్యూఢిల్లీ: భారత పారామిలటరీ బలగాల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని ఆదివాసీ యువకులు, గూర్ఖాల చేరికను పెంచేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పారామిలటరీ బలగాల్లో కానిస్టేబుల్, సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసే పురుష అభ్యర్థుల కనీస ఎత్తును తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుకు ఆదివాసీ యువకుల కనీస ఎత్తును 162.5 సెంటిమీటర్ల నుంచి 157 సెంటిమీటర్లకు తగ్గించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం(సీఐఎస్ఎఫ్)లో ఏఎస్సై పోస్టుకు ఆదివాసీ, గూర్ఖా యువకుల కనీస ఎత్తు 162.5 సెం.మీ, సబ్ఇన్స్పెక్టర్ పోస్టుకు 157 సెంటిమీటర్లు ఉండాల్సిందిగా నిర్ధారించారు. ఈ నిబంధనలు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సామ్ రైఫిల్స్ వంటి సంస్థలకు వర్తిస్తాయి. -
దేశ చరిత్రలో మొదటి ప్రధాన న్యాయమూర్తి
సాక్షి, న్యూఢిల్లీ : తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పేరును ప్రస్తుత సీజే దీపక్ మిశ్రా ప్రాతిపాధించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 3న 46వ ప్రధాన న్యాయమూర్తిగా గొగోయ్ ప్రమాణం చేయనున్నారు. దీంతో రంజన్ గొగోయ్ దేశ చరిత్రలో ఈశాన్య భారతం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. 1954 నవంబర్ 18న ఈశాన్యంలోని ఆసోంలో జన్మించిన గొగోయ్.. 1978లో బార్కౌన్సిల్ల్లో పేరును నమోదు చేసుకున్నారు. ఈ తరువాత గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ మోదలుపెట్టి, 2010లో పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. 2012లో ప్రమోషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో చారిత్రాత్మక తీర్పులను వెలువరించారు. ప్రభుత్వ పథకాల ప్రకటనలో రాజకీయ నాయకుల ఫోటోలను వాడకూడదని, కేవలం ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఫోటోలను మాత్రమే ముద్రించాలని 2015లో కీలక తీర్పును ఇచ్చారు. ఇటీవల న్యాయ చరిత్రలో సంచలనం సృష్టించిన నలుగురు న్యాయమూర్తుల తిరుగుబాటులో రంజన్ గొగోయ్ ఒకరు. -
జాతీయ గీతంలో ఆ పదం తొలగించాలని తీర్మానం
-
జాతీయ గీతంలో ఆ పదం తొలగించాలని తీర్మానం
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ గీతంలో సింధ్ స్ధానంలో ఈశాన్యం అని చేర్చాలని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా శుక్రవారం రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్‌లో ఈశాన్యం కీలక ప్రాంతమని, అయినా ఆ ప్రాంతానికి జాతీయ గీతంలో చోటుదక్కకపోవడం దురదృష్టకరమన్నారు. మరోవైపు ప్రత్యర్థి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న సింధ్‌ను జాతీయ గీతంలో ప్రస్తావిస్తున్నారని ఎగువ సభలో ప్రైవేట్ సభ్యుడి తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీ బోరా అన్నారు. జాతీయగీతంలో సింధ్ అనే పదాన్ని తొలగించి, దాని స్ధానంలో ఈశాన్య భారతం అని చేర్చాలని ఈ సభ ప్రభుత్వాన్ని కోరుతోందని తీర్మానంలో పేర్కొన్నారు. గతంలో 2016లో జాతీయ గీతం జనగణమనలో సింధ్ అనే పదాన్ని తొలగించాలని, ఆ పేరుతో దేశంలో ఏ రాష్ట్రం లేదని సరైన పదంతో దాన్ని సవరించాలని శివసేన సభ్యుడు అరవింద్ సావంత్ లోక్‌సభలో ప్రస్తావించారు. జాతీయ గీతాన్ని నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో రచించగా 1950లో పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. -
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే దేశానికి కీలకం
సాక్షి, గువహటి: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ వృద్ధి వేగం పుంజుకుంటుదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అడ్వాంటేజ్ అస్సాం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018 ను శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశ్యాన్య రాష్ట్రాలు, ప్రజలు అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధించినపుడు మాత్రమే భారతదేశ వృద్ధి వేగం అందుకుంటుందన్నారు. డూయింగ్ బిజినెస్ రిపోర్టులో ఈశాన్య రాష్ట్రాలలో అసోం మొదటి స్థానంలో నిలిచిందనీ ప్రశంసించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంలో రాష్ట్రం పెట్టుబడులో మరింత అభివృద్ధిని సాధించి దృఢంగా నిలబడనుందని చెప్పారు. వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, సేంద్రీయ సాగు, వెదురు, చేనేత, వస్త్ర మరియు హస్తకళలు, లోతట్టు నీటి రవాణా, పోర్ట్ టౌన్షిప్, నదులు అభివృద్ధి, లాజిస్టిక్స్ లాంటి రంగాలను తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈశాన్య ప్రజలకు, ప్రత్యేకించి ఈ ప్రాంతంలోని రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా ఈ బడ్జెట్లో 1300 కోట్ల రూపాయలతో 'జాతీయ వెదురు మిషన్' ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కాగా అసోంలో శనివారం ప్రారంభమైన ఈ సమ్మిట్‌లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సురేష్ ప్రభు, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, జితేంద్ర సింగ్, కిరణ్ రిజిజు హాజరయ్యారు. వీరితోపాటు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, రతన్ టాటా వంటి పారిశ్రామికవేత్తలు కూడా హాజరైనారు. -
దూకుడు : బీజేపీ టార్గెట్ 8/8
సాక్షి, న్యూఢిల్లీ : అసోంలో అఖండవిజయంతో, మణిపూర్‌లో రాజకీయ చాతుర్యంతో, అరుణాచల్ ప్రదేశ్‌లో వివాదాస్పద రీతిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ.. అదే ఊపుతో ఈశాన్య భారతంలోని మరో మూడు రాష్ట్రాల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఏడాది మార్చిలో మేఘాలయ, త్రిపురా, నాగాలాండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న దరిమిలా అన్ని పార్టీల కంటే ముందే ప్రచారపర్వానికి తెరలేపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం మేఘాలయలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆదివారం ఆయన త్రిపురలో పర్యటిస్తారు. అమిత్ షా బిజీ బిజీ : మేఘాలయలో అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ, మోదీ అభివృద్ధిమంత్రాన్ని జనంలోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాకు గట్టిపట్టున్న టిక్రికిల్లా(గారో హిల్స్) నుంచే నేటి మధ్యాహ్నం అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం షిల్లాంగ్‌లో బీజేపీ రాష్ట్రకార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. 60 స్థానాలున్న మేఘాలయలో కనీసం 40 స్థానాలు గెల్చుకోవాలనే ప్రణాళికతో బీజేపీ వ్యూహాలు పన్నింది. అటు త్రిపురలో అప్రతిహాతంగా కొనసాగుతోన్న సీపీఎంను నిలువరించాలని పావులు కదుపుతోంది. ఆదివారం త్రిపురలో అమిత్‌షా పర్యటిస్తారు. డిసెంబర్ మొదటివారంలో ఈశాన్యంలో పర్యటించిన ప్రధాని మోదీ.. పెద్ద ఎత్తున అభివృద్ధిపనులను ఆరంభించిన సంగతి తెలిసిందే. టార్గెట్ 8/8 : ఈశాన్యంలో పాగా కోసం స్థానికంగా బలంగా ఉన్న పార్టీలను సైతం కలుపుకుపోవాలని బీజేపీ ఇదివరకే నిర్ణయించింది. నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్టీఏ)లో అతర్భాగంగా 2016లో నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్ఈడీఏ)ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన ఎన్ఈడీఏ రెండో వార్షిక సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈశాన్యంలోని అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో బీజేపీ సొంతగా అధికారంలో ఉంది. నాగాలాండ్, సిక్కింలలో ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి. ఇక మేఘాలయ(కాంగ్రెస్ ప్రభుత్వం), త్రిపుర(సీపీఎం), మిజోరం(కాంగ్రెస్)లను కూడా కైవసం చేసుకుంటే ఈశాన్యంలో ఎనిమిదికి ఎనిమిది రాష్ట్రాలూ బీజేపీ ఖాతాలోకి చేరతాయి. మిజోరం అసెంబ్లీకి ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. -
అభివృద్ధికి ఆ రాష్ట్రాలే కీలకం...
న్యూఢిల్లీః సుదీర్ఘ కాంగ్రెస్ పాలనతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతున్నదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని చెప్పారు. దేశ అభివృద్ధికి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో వృద్ధి అనివార్యమన్నారు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (ఎన్ఈడీఏ) సదస్సులో అమిత్ షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌తో భూ సరిహద్దు ఒప్పందం ఈ ప్రాంత అభివృద్ధిలో మైలురాయి వంటిదని పేర్కొన్నారు. ఎన్ఈడీఏ రాజకీయ వేదికే కాకుండా ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల సంస్కృతికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు. తదుపరి ఎన్ఈడీఏ భేటీలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశానికి అస్సాం, మణిపూర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ సీఎంలు హాజరయ్యారు. -
బైకుపై హీరోయిన్ సాహసయాత్ర!
జీవితమంటే గమ్యాన్ని చేరుకోవడం కాదు.. గమ్యం కోసం చేసే ప్రయాణమని చెప్తారు. దేశాంతర సంచారాలు చేసే ప్రయాణికులు, సాహసికులకు అది నిజమే అనిపిస్తోంది. ప్రయాణం ఎన్నో మధురానుభూతుల్ని మిగిలిస్తుంది. ప్రయాణం జీవితాన్ని కొత్తగా అందంగా చూపిస్తుంది. సరికొత్త ఊపిరినింపుతుంది. అందుకే ప్రయాణాలు చేసి కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అదే కోవలో బాలీవుడ్ నటి కల్కీ కొచ్లిన్ సాహసయాత్రకు పూనుకుంది. ఫొటోగ్రాఫర్, బైకర్ అయిన తన తండ్రి జోయెల్ కొచ్లిన్‌తో కలిసి ఆమె బైకులపై సాహసయాత్రకు బయలుదేరింది. ఒక్కటి కాదు రెండు ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల బైకుయాత్ర.. అందమైన ఈశాన్య భారతం మీదుగా, అసోం, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్‌లోని అందమైన ప్రాంతాలను అన్వేషిస్తూ ఆమె ముందుకుసాగింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై తండ్రి, కూతుళ్లు కలిసి చేసిన ఈ సుదీర్ఘ యాత్ర త్వరలో ’ఫాక్స్ లైఫ్’ కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమంగా ప్రసారం కానుంది. సాధారణంగా సెలబ్రిటీ ప్రయాణాలు అనగానే విలాసవంతంగా, సుఖవంతంగా ఉంటాయి. అందుకుభిన్నంగా వాస్తవికతతో, విభిన్నమైన దృష్టితో సాగే ఈ బైకు యాత్ర ఈ నెల 17 నుంచి ’కల్కీస్ గ్రేట్ ఎస్కేప్’ షో పేరిట ప్రసారం కానుంది. -
ఢిల్లీ, నార్త్ఈస్ట్ మ్యాచ్ డ్రా
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ, నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఆరంభం లో నార్త్ఈస్ట్ దూకుడు కనబరిచినా ఢిల్లీ డిఫెన్స్ చురుగ్గా కదిలింది. ప్రథమార్ధం 37వ నిమిషంలో రిచర్డ్ గ్యాడ్జె గోల్‌తో ఢిల్లీకి 1-0 ఆధిక్యం అందింది. అయితే 72వ నిమిషంలో నార్త్ఈస్ట్ ఆటగాడు సిమావో గోల్ చేయడంతో స్కోరు సమమైంది. మరోవైపు మ్యాచ్‌కు ముందు స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు మొరాయించడంతో సగం లైట్ల వెలుతురులోనే 20 నిమిషాల ఆలస్యంగా మ్యాచ్‌ను ప్రారంభించారు. బుధవారం జరిగే మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో పుణే ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది. -
ఈశాన్యంలో చావుకేక!
సంపాదకీయం మరోసారి అస్సాం నెత్తురోడింది. మూడురోజులుగా అక్కడ చోటుచేసుకుంటున్న ఘటనలు ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కంటతడి పెట్టిస్తున్నాయి. అసలు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. కత్తులు, విల్లమ్ములు, తుపాకులు, గ్రెనేడ్లు చేతబూనిన బృందాలు గ్రామాలపైబడి దొరికిన వారిని దొరికినట్టు మట్టుబెట్టడం ఊహించడానికే భయంకరమైన సన్నివేశం. తాజా నరమేథంలో ఇంతవరకూ 80 మంది మరణించగా అందులో అత్యధికులు పిల్లలు, మహిళలు. ఈ ఘటనల్లో వందలాది మంది గాయపడ్డారు. వేలాది మంది కొంపా గోడూ వదిలి వెళ్లిపోతున్నారు. మనుషుల్ని చంపడంతోపాటు వారి ఊళ్లనూ, వారు దాచుకున్న తిండిగింజలను, వారి పశువులను తగలబెట్టడం ఈ హంతక బృందాలు చేస్తున్న పని. ఆప్తులను కోల్పోయి, మూడురోజులనుంచి పట్టెడన్నం దొరక్క, కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లయినా లభ్యం కాక అలమటిస్తున్నవారు... కాలుతున్న తమ ఇళ్లలో బుగ్గిపాలు కాకుండా మిగిలిన తిండిగింజలను ప్రాణ ప్రదంగా ఏరుకుంటున్న విషాద దృశ్యాలు చానెళ్లలో కనబడుతున్నాయి. ఏమైంది ఈశాన్యానికి? ఆ ప్రాంతంలో పెద్ద రాష్ట్రమైన అస్సాం ఎందుకలా నిత్యాగ్నిహోత్రంలా మండుతుంటుంది? అస్సాంలో లెక్కకు మిక్కిలిగా ఉన్న వివిధ తెగల మధ్య... మళ్లీ ఆయా తెగలకూ, విదేశీయులుగా ముద్రపడిన వలసవచ్చిన వారికీ మధ్య ఎడతెగకుండా సాగుతున్న పోరు అక్కడ నిత్యమూ ఉద్రిక్తతలను రాజేస్తున్నది. పరిమితంగా ఉన్న వనరులు తమకు మాత్రమే సొంతం కావాలంటే అవతలి తెగ నిష్ర్కమణే ఏకైక మార్గమనుకోవడమే ఈ జనహననానికి ప్రధాన కారణం. అస్సాంకు అందరికంటే ముందు వలసవచ్చిన బోడోలు జనాభా రీత్యా అధిక సంఖ్యాకులు. పదిన్నర లక్షల మంది జనాభాగల ఈ బోడోలు ఎప్పటినుంచో అస్సాంనుంచి వేరు చేసి తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పర్చాలని డిమాండు చేస్తున్నారు. అందుకోసం కొన్ని సంస్థలు ఆవిర్భవించి సాయుధ పోరాటానికి దిగాయి. అలాంటి గ్రూపుల్లో ఒకటైన బోడో లిబరేషన్ టైగర్స్ ఫోర్స్ (బీఎల్‌టీఎఫ్)తో 2003లో కేంద్రంలోని అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఒక ఒప్పందానికి వచ్చి బ్రహ్మపుత్ర నది ఉత్తర తీరంలోని కోక్రాఝర్, చిరాంగ్, సోనిత్పూర్, బక్సా, ఉదల్గురివంటి జిల్లాలను కలుపుతూ బోడో ప్రాదేశిక మండలి (బీటీసీ)ని ఏర్పాటుచేసింది. ఇందులో 70 శాతం మంది బోడో, రాభా, గారో వగైరా తెగలున్నాయి. ఈ తెగల ప్రయోజనాలమధ్య వైరుధ్యాలున్నాయి. వీరుగాక బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చే వారూ ఉంటారు. తరచుగా తోవమార్చుకునే బ్రహ్మపుత్ర నది వల్ల ఉండటానికి జానెడు జాగా కూడా కరువై ఉపాధిని వెతుక్కుంటూ వలసవచ్చే తెగలకూ, అప్పటికే ఆయా ప్రాంతాల్లో స్థిరపడే తెగలకూమధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తమ జనాభా తగ్గిపోతుందని, తమ వనరులను ఆ తెగలు కొల్లగొడతాయని భావించే ఇతర తెగలు వారిని తరుముతాయి. కేవలం వ్యవసాయాధారంగానే బతుకులీడ్చే పౌరులకు ఇతరత్రా ఉపాధి అవకాశాలను పెంచితే, పారిశ్రామికీకరణను అమలుచేస్తే ఇలాంటి ఘర్షణలు తలెత్తే అవకాశం ఉండదు. శాశ్వత పథకాలపై దృష్టిసారించని ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు తాత్కాలికంగా తమ పబ్బం గడవడానికి తెగలకు చెందిన పలుకుబడిగల నాయకులను గుర్తించి వారికి కాంట్రాక్టులు అప్పగిస్తున్నాయి. ఆ కాంట్రాక్టుల ద్వారా అయ్యే పనులేమీ ఉండవని ప్రభుత్వ పెద్దలకూ తెలుసు. వారిని జాగ్రత్తగా చూసుకుంటే క్షేత్రస్థాయిలో వారే అన్నీ అదుపులోకి తెస్తారన్నదే దీని వెనకున్న ఉద్దేశం. అత్యధికులకు ప్రయోజనం కలిగించాల్సిన పథకాలు, కోట్లాది రూపాయల సర్కారీ సొమ్ము ఇలా దొంగలపాలవుతున్నాయి. పర్యవసానంగా అప్పటికే ఉన్న సామాజిక, ఆర్థిక సమస్యలు మరింతగా ముదురుతున్నాయి. గుర్తింపు పొందిన తెగలకు అరకొరగానైనా సౌకర్యాలుంటాయి. వారికి రేషన్ కార్డు ద్వారా తిండిగింజలు చవగ్గా దొరుకుతాయి. కానీ, నిలువనీడ లేని స్థితిలో వలస వచ్చిన వారికి, విదేశీయులుగా ముద్రపడిన మైనారిటీలకు దక్కేదేమీ ఉండదు. వారి పిల్లలకు చదువుండదు. ఆ పిల్లలకు రోగాలొస్తే చికిత్స చేసే ఆస్పత్రులుండవు. ఈ దుస్థితిని ఎన్నికల రాజకీయాలు సరిదిద్దడం మాట అటుంచి దాన్ని మరింత దిగజారుస్తున్నాయి. బోడోలకూ, ముస్లింలకూ... బోడోలకూ, సంతాల్, ముండా వంటి ఇతర గిరిజన తెగలకూమధ్య తరచు తలెత్తే తగాదాలన్నీ దాదాపు రాజకీయ పక్షాల విశ్వామిత్ర సృష్టే. ఈ ఘర్షణలవల్ల 1983లో నెల్లి గ్రామం నెత్తుటిమడుగైంది. దాదాపు నాలుగువేల మంది ఊచకోతకు గురయ్యారు. రెండేళ్లక్రితం బోడో ప్రాదేశిక మండలి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో దాదాపు వందమంది చని పోయారు. ఇటీవలికాలంలో ఒక సాయుధ గ్రూపు నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్డీఎఫ్బీ) (ప్రోగ్రెసివ్) సంస్థతో అస్సాం ప్రభుత్వం ఒప్పందానికి రావడంతో దాని ప్రత్యర్థి సంస్థ ఎన్డీఎఫ్బీ(ఎస్) సంస్థ ప్రస్తుత ఊచకోతకు తెగించిందని చెబుతున్నారు. ఈ సంస్థ బక్సా జిల్లాలో గత మే నెలలో 22మంది పిల్లలతోసహా 46 మందిని ఊచకోత కోసింది. మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్ వంటి దేశాలు ఇరుగు పొరుగునుండటం... ఆ సరిహద్దు ప్రాంతాలన్నీ దట్టమైన అడవులు కావడం మిలిటెంటు గ్రూపులకు కలిసివస్తున్నది. ఎన్డీఎఫ్బీ మిలిటెంట్లు దాడులకు దిగొచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ సమాచారాన్నిచ్చినా అస్సాం ప్రభుత్వం సకాలంలో ఆ ప్రాంతానికి బలగాలను తరలించలేకపోయింది. వచ్చే ఏడాది అస్సాంలో ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, ఈశాన్యంలో భౌగోళికంగా చైనా, మయన్మార్, బంగ్లాదేశ్‌వంటి దేశాలతో సరిహద్దులున్నందువల్ల ప్రభుత్వాలు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. జాతుల వైరం సమసి పోయేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకోవాలి. -
ఈశాన్య ప్రజల భద్రతపై కమిటీ
హస్తినలో అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి నిడో తానియా మృతి చెందడంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలలోని ప్రజల భద్రతపై అధ్యాయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి బెజ్బారువా నేతృత్వం ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఆ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారని తెలిపింది. రెండు నెలలో ఆ కమిటీ నివేదిక అందజేస్తుందని వెల్లడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎంపీలు గురువారం ఉదయం న్యూఢిల్లీలో సమావేశమైయ్యారు. ఆ సమావేశం జరిగిన కొద్ది నిముషాలకే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గత గురువారం దేశరాజధానిలోని లజ్‌పత్ నగర్ మార్కెట్లో నిడో తానియాతో కొంత మంది యువకులు ఘర్షణ పడ్డారు. ఆ మరుసటి రోజున నిడో తానియా మృతి చెందాడు. దాంతో ఢిల్లీలో ఈశాన్య రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆందోళనకు దిగారు. తానియా మృతిపై ఇటు విపక్షాలు అటు స్వపక్షంలోని సభ్యులు నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైనాయి. అందులోభాగంగా నిన్న ప్రారంభమైన లోక్‌సభ నిడో తానియా మృతిని ఖండించింది. ఆ ఘటన తీవ్ర దురదృష్టకరమైనదిగా స్పీకర్ మీరా కుమార్ అభివర్ణించారు. తానియా మృతికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సభలో వామపక్షాలు డిమాండ్ చేశాయి. తానియా మృతిని ఢిల్లీ హైకోర్టు సూమోటుగా స్వీకరించి విచారణ జరుపుతుంది. నిడో మరణంపై న్యాయదర్యాప్తునకు కూడా ఆ హోం మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, షిండే ఈశాన్య ప్రాంత ఎంపీలతో సమావేశమైయ్యారు.