సాక్షి, న్యూఢిల్లీ : అసోంలో అఖండవిజయంతో, మణిపూర్‌లో రాజకీయ చాతుర్యంతో, అరుణాచల్ ప్రదేశ్‌లో వివాదాస్పద రీతిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ.. అదే ఊపుతో ఈశాన్య భారతంలోని మరో మూడు రాష్ట్రాల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఏడాది మార్చిలో మేఘాలయ, త్రిపురా, నాగాలాండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న దరిమిలా అన్ని పార్టీల కంటే ముందే ప్రచారపర్వానికి తెరలేపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం మేఘాలయలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆదివారం ఆయన త్రిపురలో పర్యటిస్తారు.
అమిత్ షా బిజీ బిజీ : మేఘాలయలో అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ, మోదీ అభివృద్ధిమంత్రాన్ని జనంలోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాకు గట్టిపట్టున్న టిక్రికిల్లా(గారో హిల్స్) నుంచే నేటి మధ్యాహ్నం అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం షిల్లాంగ్‌లో బీజేపీ రాష్ట్రకార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. 60 స్థానాలున్న మేఘాలయలో కనీసం 40 స్థానాలు గెల్చుకోవాలనే ప్రణాళికతో బీజేపీ వ్యూహాలు పన్నింది. అటు త్రిపురలో అప్రతిహాతంగా కొనసాగుతోన్న సీపీఎంను నిలువరించాలని పావులు కదుపుతోంది. ఆదివారం త్రిపురలో అమిత్‌షా పర్యటిస్తారు. డిసెంబర్ మొదటివారంలో ఈశాన్యంలో పర్యటించిన ప్రధాని మోదీ.. పెద్ద ఎత్తున అభివృద్ధిపనులను ఆరంభించిన సంగతి తెలిసిందే.
టార్గెట్ 8/8 : ఈశాన్యంలో పాగా కోసం స్థానికంగా బలంగా ఉన్న పార్టీలను సైతం కలుపుకుపోవాలని బీజేపీ ఇదివరకే నిర్ణయించింది. నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్టీఏ)లో అతర్భాగంగా 2016లో నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్‌ఈడీఏ)ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన ఎన్‌ఈడీఏ రెండో వార్షిక సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈశాన్యంలోని అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో బీజేపీ సొంతగా అధికారంలో ఉంది. నాగాలాండ్, సిక్కింలలో ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి. ఇక మేఘాలయ(కాంగ్రెస్ ప్రభుత్వం), త్రిపుర(సీపీఎం), మిజోరం(కాంగ్రెస్)లను కూడా కైవసం చేసుకుంటే ఈశాన్యంలో ఎనిమిదికి ఎనిమిది రాష్ట్రాలూ బీజేపీ ఖాతాలోకి చేరతాయి. మిజోరం అసెంబ్లీకి ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment